నిజం ఎందుకు చెప్పాలంటే...

ABN , First Publish Date - 2020-07-29T09:20:50+05:30 IST

సమాచారం ప్రజలకు అవసరం, కానీ పాలకులకు, ప్రబుద్ధులకు ఒక ఆయుధం. సమాచార ప్రసారాన్ని నియంత్రించే తాళపు చెవి కోసం ప్రభుత్వాలు తహతహలాడతాయి...

నిజం ఎందుకు చెప్పాలంటే...

సమాచారం ప్రజలకు అవసరం, కానీ పాలకులకు, ప్రబుద్ధులకు ఒక ఆయుధం. సమాచార ప్రసారాన్ని నియంత్రించే తాళపు చెవి కోసం ప్రభుత్వాలు తహతహలాడతాయి. వాస్తవ సమాచారం ఇవ్వడం, తప్పుడు సమాచారం ఇవ్వడం, ఏ సమాచారమూ ఇవ్వకపోవడం, అరకొర, వక్రీకృత సమాచారం ఇవ్వడం, ప్రాధాన్యాన్ని పెంచి ప్రచారం చేయడం, ప్రాధాన్యం తగ్గించడం- ఇట్లా అనేక రకాల విన్యాసాలు సమాచార రంగంలో చేయవచ్చు. ప్రభుత్వంపై కానీ, ప్రభుత్వం తీరుపై కానీ పాలకులకు విముఖతను కలిగించే సమాచారాన్ని అడ్డుకుని, ఎటువంటి అప్రియత్వానికి తావులేని విధంగా వార్తలను వ్యాఖ్యలను నిర్వహించడమే ప్రచార యంత్రాంగం పని. గోబెల్స్ అటువంటి పని బాగా సమర్థంగా చేశాడంటారు. యుద్ధం, అంతర్యుద్ధం వంటి సందర్భాలలో సత్యం, వాస్తవం మొదలైన వాటికి పెద్దగా విలువ ఉండదు. పరిణామాలను సమాచారం ప్రభావితం చేస్తుంది కాబట్టి, అబద్ధం అక్కడ స్వైర విహారం చేస్తుంది. రకరకాల గత్తరలు, ప్లేగులు, ఇతర సాంక్రామిక వ్యాధులు చెలరేగినప్పుడు కూడా సమాచార లోపం కానీ, తప్పుడు సమాచారం కానీ ప్రజల మీద ప్రభావం వేస్తాయి. గతంలో వచ్చిన వ్యాధి వైపరీత్యాల సమయంలో, ఇంతటి సమాచార సాంకేతికత లేదు. ప్రభుత్వాలకు వాటి నిర్వహణలో సమాచార వ్యూహం పెద్దగా అవసరం లేకపోయింది. 19వ శతాబ్ది అంతంలో మహారాష్ట్రలో వచ్చిన ప్లేగు సందర్భంలో, వ్యాధి నిరోధానికి ప్రభుత్వం ఏమి చేయదలచుకున్నదో ప్రజలకు తెలియకపోవడం వల్ల, తెలియజెప్పాలని నాటి వలస ప్రభుత్వం అనుకోకపోవడం వల్ల ఎంతో నష్టం జరిగింది. సహాయ యంత్రాంగానికి, బాధితులకు మధ్య అవగాహన లోపించింది. ప్రస్తుతం ప్రపంచ ఉత్పాతంగా విజృంభించిన కరోనా వైరస్‌కు సంబంధించి, నిరోధానికి, సహాయానికి, అవగాహనకి సమాచార వినిమయం ఎంతో కీలకంగా ఉన్నది. అదే సమయంలో, సమాచార బాహుళ్యం ఎంతో గందరగోళానికి కారణమవుతున్నది. మరోవైపు, కరోనాను అడ్డుపెట్టుకుని, సమాచారాన్ని తొక్కిపెట్టడం, తగ్గించిచూపడం, పెంచి చూపడం తద్వారా ఉదాసీనత పెంచడం లేదా భయభ్రాంతులను చేయడం జరుగుతోంది. 


వాస్తవ సమాచారం అందిస్తే ప్రజలు భయపడతారు అందుకని మృతుల సంఖ్య, రోగగ్రస్తుల సంఖ్య తగ్గించి చూపుతాము- అని కొన్ని ప్రభుత్వాలు వాదిస్తాయి. ఆ వాదనను అంగీకరించవచ్చునా? యుద్ధ సమయంలో, కొన్ని కొన్ని దశలలో తమకు జరుగుతున్న నష్టాలను తగ్గించిచూపడం, శత్రువుకు జరిగే నష్టాన్ని పెంచి చూపడం ఒక ఎత్తుగడగా ఉండవచ్చు. ఇంకా పోరాటాన్ని మలుపుతిప్పే అవకాశం ఉన్నదశలో అటువంటి చిట్కాలు, కొత్త ఉత్సాహం ఇవ్వడానికి పనిచేయవచ్చును కానీ, యుద్ధగమనాన్ని ఆ సమాచార వ్యూహం నిర్ణయాత్మకంగా ప్రభావితం చేయజాలదు. పైగా, యుద్ధంతో పోలిక సరి అయినది కాదు. ఇది రెండు మానవ శిబిరాల మధ్య పోరాటం కాదు. మనిషికి, వ్యాధికి మధ్య జరుగుతున్నది. మనిషి పక్షాన పోరాడుతున్న వ్యవస్థలు ఎట్లా పనిచేస్తున్నాయన్నది ఇక్కడ కీలకం. వ్యవస్థలతో పాటు మనుషులు కూడా చేతులు కలిపి పోరాడాలి. ఏమి జరుగుతున్నదో తెలియకుండా ఎట్లా పరస్పర విశ్వాసం ఏర్పడుతుంది? అబద్ధాన్ని ప్రభుత్వ యంత్రాంగాలు ఒక అవకాశంగా తీసుకుంటే? తమ అసమర్థతను, వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి తప్పుడు లెక్కలు చెబుతుంటే, అప్పుడేమి చేయాలి?


రెండు దశాబ్దాల కిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఆకలిచావులు వెలుగులోకి వచ్చాయి. ఆకలిచావులు జరగడానికి వీలులేదని రాజకీయ నాయకత్వం ఆదేశాలిచ్చింది. ఎట్లా చేయాలో తెలియని అధికారగణం, ఆకలిచావులను నిరాకరించడం మొదలుపెట్టారు. ప్రతి ఒక్క మరణాన్ని, వారు తాజాగా రేషన్ తీసుకున్నారనో, వారి జేబులో నోట్లున్నాయనో చెప్పి, ఆకలిచావుల కారణాలను తోసిపుచ్చడం మొదలుపెట్టారు. అదొక సమాచార యుద్ధమే. తగ్గించడానికి సాధ్యం కానప్పుడు, అవి లేనేలేనట్టు బుకాయించడం ఒక వ్యూహం. ఆకలిచావులు ఉన్నాయని తెలిస్తే, సమాజం మనోస్థైర్యం దెబ్బతింటుంది కాబట్టి, ఆ వార్తలను పైకి ప్రకటించడం లేదనే వాదన ఆ రోజుల్లో ఇంకా పుట్టలేదు. 


పారదర్శకత అన్నది ఒక ప్రజాస్వామిక భావన. దేశరక్షణకు, విదేశాంగానికి సంబంధించిన అంశాలలో అధికార రహస్యాలంటూ ఏవో అవసరం కావచ్చు, వాటి సంగతి పక్కనపెడదాం. తక్కినదంతా ఎంత పారదర్శకంగా ఉంటే, ప్రజలకు అంత విశ్వాసం ఉంటుంది. మొత్తం సమాజం అంతా మృత్యుగంధం అలుముకుని ఉంటే, కరోనామరణాలు వేళ్ల మీద మాత్రమే లెక్కిస్తామంటే, జనాలకు అనుమానం వస్తుంది. వ్యాధిని ఎదుర్కొనడం కాకుండా, అంకెలను తారుమారు చేయడం ద్వారా పరిస్థితిని మభ్యపెట్టాలనే ప్రయత్నం, ప్రభుత్వం మీద అపనమ్మకాన్ని పెంచుతుంది. 


ఎక్కువ వ్యాధి వ్యాప్తి ఉంటే, ఎక్కువ ఆరోగ్యచర్యలు చేపట్టవలసి వస్తుందన్న భయం, ఎక్కువ మరణాలను ఒప్పుకుంటే, అది తమ సమర్థతకు మచ్చ అవుతుందనే సంకోచం- ప్రభుత్వాలు పారదర్శకంగా వ్యవహరించనీయకుండా అడ్డుకుంటున్నాయి. సమాచార నియంత్రణ వెనుక తప్పనిసరిగా ఉద్దేశ్యాలు ఉంటాయి. అమెరికాలో, ముఖ్యంగా న్యూయార్క్‌లో, మరణాలను పెంచిచూపించామని అక్కడి వ్యాధినియంత్రణ కేంద్రం -సిడిసి స్వయంగా అంగీకరించింది. ఎక్కువ కేసులు, ఎక్కువ మరణాలు ఉంటే బడ్జెట్ నుంచి ఎక్కువ నిధులు వస్తాయన్న ఉద్దేశ్యంతో న్యూయార్క్ నగరయంత్రాంగం ఆ పనిచేసింది. భయపెడితే తప్ప, ప్రజలు ఇళ్లకు పరిమితం అయి ఉండరనే ఉద్దేశ్యం కూడా ఆ అంకెల హెచ్చింపు వెనుక ఉండవచ్చు. మరి భారతదేశంలో, క్షేత్రస్థాయి పరిస్థితిని గణాంకాలు ప్రతిఫలిస్తున్నాయా? 


కరోనా విషయంలో ఎవరూ అనుభవజ్ఞులు కారన్నది నిజమే. అలాగని, ఇటువంటి ఉపద్రవాల సందర్భంలో వినియోగించుకోగలిగిన పూర్వ జ్ఞానం, అనుభవం లేకుండా పోలేదు. గతంలో నుంచే కాదు, వర్తమానంలో కూడా ప్రపంచంలోని వివిధ దేశాలు, సమాజాల అనుభవాల నుంచి ఎన్నో పాఠాలు అందుబాటులో ఉన్నాయి. వాటిని అధ్యయనం చేయకుండా, సమాచారాన్ని తొక్కిపెట్టే గతానుభవాన్ని మాత్రమే వినియోగించుకుంటామంటే ఏమిచేయగలం? వ్యాధి వ్యాప్తి పెద్దగా లేనిచోట పెద్ద సంఖ్యలో పరీక్షలు చేసి, వ్యాప్తి రేటును తగ్గించవచ్చు. రోగులను పది రోజులకు, ఐదు రోజులకు డిశ్చార్జి చేసి- కోలుకునే రేటును పెంచుకోవచ్చు. ఇతర జబ్బులున్నవారు చనిపోతే, వారిని కరోనా ఖాతాలో వేయకుండా మృతుల సంఖ్యను తగ్గించిచూపవచ్చు. -నిజమే, చేయవచ్చు, కానీ ఎందుకోసం? గణాంకాల ప్రదర్శన వల్ల ఎవరి మెప్పు లభిస్తుంది? క్షేత్రస్థాయి వాస్తవికతకూ గణాంకాలకూ ఉన్న అగాధాన్ని ఎవరు పూడ్చాలి? 


వాస్తవ సమాచారం ఇవ్వకపోవడమే కాకుండా, అబద్ధాలు చెప్పడం జన్మహక్కు అన్నట్టుగా బుకాయించడం ప్రభుత్వాలు చేస్తున్న మరో విన్యాసం. పైగా దానికి జాతీయవాద, ప్రాంతీయ అస్తిత్వవాద సమర్థనలు. ఉద్యమాన్ని ఇట్లా కూడా ఉపయోగించుకోవచ్చునని ఎవరి ఊహకూ అందలేదు. అసత్యానికి సైద్ధాంతిక అలంకారాలు చేయడం కంటె, నిజాన్ని ఎదుర్కొనడం నిజాయితీ అవుతుంది. వ్యాధికి ఉన్నంత శక్తి, దాన్ని ఎదుర్కొనడంలో మనకు లేదు. అది అందరికీ తెలుసు. మాయామంత్రం వేసి జబ్బును తరిమివేయలేదని ఎవరూ ప్రభుత్వాలను తప్పుపట్టరు. చేయగలిగినంత చేస్తున్నామా లేదా అన్నది ప్రశ్న. నలుగురి సలహాలు తీసుకుంటున్నామా లేదా అన్నది మరో ప్రశ్న. ఈ ప్రశ్నలు వేసుకోకపోతే, పదే పదే బోనులో నిలబడవలసి వస్తుంది.

Updated Date - 2020-07-29T09:20:50+05:30 IST