ట్రంప్‌ దురాగతం

ABN , First Publish Date - 2020-12-02T07:56:16+05:30 IST

ఇరాన్‌ అణు పితామహుడు మొహసెన్‌ ఫక్రిజాదే దారుణ హత్య పశ్చిమాసియాను కుదిపేసింది. హత్యకు కారకులెవ్వరో తనకు తెలుసుననీ...

ట్రంప్‌ దురాగతం

ఇరాన్‌ అణు పితామహుడు మొహసెన్‌ ఫక్రిజాదే దారుణ హత్య పశ్చిమాసియాను కుదిపేసింది. హత్యకు కారకులెవ్వరో తనకు తెలుసుననీ, కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్‌ అంటోంది. ఈ రిమోట్‌ కంట్రోల్‌ హత్య వెనుక ఇజ్రాయెల్‌ ఉన్నదనీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆశీస్సులతోనే అది ఇంతటి ఘాతుకానికి ఒడిగట్టిందని ఇరాన్‌ నమ్మకం. ఇరాన్‌తో సయోధ్య దిశగా అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడన్‌ అడుగులు వేయకుండా నిలువరించడానికే ట్రంప్ ఈ కుట్రకు పాల్పడ్డారని అంతర్జాతీయ నిపుణుల అనుమానం. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయనీ, అధ్యక్ష పీఠాన్ని బైడన్‌కు అప్పగించేది లేదనీ మొండివాదనలు చేసిన ట్రంప్‌ ఇప్పుడు అధికార బదలాయింపునకు ఒకపక్క సరేనంటూనే మరోపక్క ఇటువంటి కుట్రలకు తెరదీయడం విచిత్రం. 


రాబోయే రోజుల్లో ఫక్రిజాదే పేరు వినబడదంటూ ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ గతంలో చేసిన వ్యాఖ్యను కూడా ఇరాన్‌ నాయకులు గుర్తుచేస్తున్నారు. ఇజ్రాయెల్‌ హిట్‌లిస్టులో ఈ శాస్త్రవేత్త కూడా ఉన్నారన్నది నిర్వివాదాంశం. మొహ్‌సెన్‌ను చాకచక్యంగా మట్టుబెట్టింది మొసాదే కావచ్చును కానీ, అమెరికా పెద్దల చెవినవేయకుండా ఇజ్రాయెల్‌ ఏకపక్షంగా ఇంతటి సాహసానికి పూనుకొనే అవకాశాలు ఎంతమాత్రం లేవు. ఇరాన్‌ కీలక అణుస్థావరాలను మెరుపుదాడులతో భస్మీపటలం చేయాలని డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ మధ్యన నిర్ణయించి, చివరకు మిగతా పెద్దల హెచ్చరికలమేరకు విధిలేక వెనక్కు తగ్గారని వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో అధ్యక్షపదవినుంచి దిగేలోగా ఇరాన్‌ను గట్టిగా ఓ దెబ్బకొట్టిపోవాలని ట్రంప్‌ ఉవ్విళ్ళూరడం సహజం. నెలరోజుల్లో జో బైడన్‌కు అధికారం అప్పగించబోతున్న తరుణంలో ఒక కీలక ఇరానియన్‌ నాయకుడి హత్యకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చి ఇలా కక్షతీర్చుకున్నారు. 


ఇరాన్‌ అణుకార్యక్రమాన్ని ఆంక్షలతో అడ్డుకోలేమని అర్థమయ్యే, అమెరికా, యూరప్‌ దే‌శాలు దానిని సుదీర్ఘచర్చోపచర్చలతో దారికి తెచ్చుకున్నాయి. అణ్వస్త్ర తయారీ ఆపితే ఆంక్షలు ఎత్తేస్తామని హామీ ఇచ్చి, శుద్ధిచేసిన యురేనియం ఎన్నికిలోలు ఉంచుకోవచ్చో నిర్ణయించి, 2015లో అణు ఒప్పందాన్ని కుదర్చుకున్నాయి. ఇరాన్‌ ఈ ఒప్పందాన్ని సక్రమంగా పాటిస్తున్నదని ఐఏఈఏ తనిఖీలతో నిర్థారణ అయిన తరువాతే ఆంక్షల సడలింపు జరిగింది. కానీ, బరాక్‌ ఒబామా నిర్ణయాలను తిరగదోడటమే లక్ష్యంగా పెట్టుకున్న ట్రంప్‌, ఒప్పందం నుంచి అమెరికాను తప్పించి, ఆంక్షలు విధించి సమస్య మొదటికి తెచ్చారు. యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని తిరిగి కసిగా ఆరంభించిన ఇరాన్‌ను గత ఒప్పందంతోనే మళ్ళీ దారికి తెచ్చుకోవాలని బైడన్‌ అనుకుంటున్న తరుణంలో ఈ హత్య జరిగింది. బైడన్‌ గెలుస్తున్న సూచనలు కనిపించగానే, ‘ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఒప్పందంవైపు మళ్ళనిచ్చేది లేదు’ అని నెతన్యాహూ శప‍థం చేశారట. తదనుగుణంగానే, ఇరాన్‌తో దౌత్య సంబంధాల పునరుద్ధరణ దిశగా కొత్త అధ్యక్షుడు ఒక్క అడుగూ వేయకముందే ఈ హత్య జరిగింది. ఇరాన్‌ అణుకార్యక్రమానికి రెండుదశాబ్దాలుగా నాయకత్వం వహిస్తున్న మొహసెన్‌ హత్య ఆ దేశానికి పెద్ద ఎదురుదెబ్బ. దీనికి ప్రతీకారంగా ఇరాన్‌ దూకుడుగా వ్యవహరిస్తే, పదవినుంచి దిగేలోగా నాలుగు బాంబులేసిపోవాలని కూడా ట్రంప్‌ ఎదురుచూస్తున్నట్టు అమెరికా పత్రికలు రాస్తున్నాయి. 


ఇరాన్‌ ఇటీవల వరుస దెబ్బలు చవిచూసింది. కమాండర్‌ ఖాసీం సులేమానీ హత్య, ఆ తరువాత సెంట్రీఫ్యూజ్‌ పరిశోధనాశాలలో పేలుడు, ఇప్పుడు ఫక్రిజాదే హత్య సందర్భాల్లో ఆరోపణలు, విమర్శలు తప్ప ప్రతీకారానికి సిద్ధపడలేని స్థితి ఇరాన్‌ది. అధికారం నుంచి తప్పుకుంటున్న చివరి క్షణాల్లో కూడా ట్రంప్‌ కయ్యానికి కాలుదువ్వుతున్నందున ఆయన పూర్తిగా పదవీచ్యుతుడయ్యేవరకూ ఓరిమితో వ్యవహరించడం ఇరాన్‌కు అవసరం. బైడెన్‌ అధ్యక్ష స్థానంలోకి రాగానే సాధ్యమైనంత త్వరగా ఒప్పందాన్ని పునరుద్ధరించడం, ఆంక్షలు తొలగించడం ప్రపంచానికి మేలు చేస్తుంది. సైనికదాడులు, ఆంక్షలు అణుకార్యక్రమాన్ని అడ్డలేవని ఇప్పటికే రుజువైంది. అణు ఒప్పందం నుంచి అమెరికా తప్పుకున్న తరువాత ఇరాన్‌ అణ్వస్త్ర కార్యక్రమంలో బాగా ముందుకు పోయినమాట నిజం. కానీ, ట్రంప్‌ తెలివితక్కువ చేష్టలతోనే ఇదంతా జరిగింది కనుక, అమెరికా తన తప్పులు సరిదిద్దుకోవడం, మరింత ఉదారంగా వ్యవహరించి ఇరాన్‌ను దారికి తెచ్చుకోవడం ఉత్తమం.

Updated Date - 2020-12-02T07:56:16+05:30 IST