ఎన్నికల్లో గెలుపుపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

ABN , First Publish Date - 2020-10-19T03:13:15+05:30 IST

రాబోయే ఎన్నికల్లో విజయం సాధించేంది తానే అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.

ఎన్నికల్లో గెలుపుపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

వాషింగ్టన్: రాబోయే ఎన్నికల్లో విజయం సాధించేంది తానే అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. భవిష్యత్తులో కూడా రిపబ్లిక్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా కృషి చేయాలని తన మద్దతుదారులను కోరారు. కాగా.. ప్రస్తుతం ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అమెరికా రాజకీయాల్లో చర్చనీయాంశం అయ్యాయి. వివరాల్లోకి వెళితే.. అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికల సమయం దగ్గర పడింది. నవంబర్ 3న అమెరికాలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ట్రంప్ తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. శనివారం రోజు మిచిగాన్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన.. నవంబర్ 3న జరిగే ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీదే విజయం అని ధీమా వ్యక్తం చేశారు. మరో నాలుగు సంవత్సరాలపాటు అమెరికాను తాను పరిపాలించబోతున్నట్లు చెప్పుకొచ్చారు. 


‘ఎన్నికల్లో గెలుపు ఎవరిదన్న విషయం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అమెరికా చరిత్రలోనే ఇవి అతి ముఖ్యమైన ఎన్నికలు. మనం తిరిగి అధికారంలోకి రాబోతున్నాం. మరో నాలుగు సంవత్సరాలు అధికారం మనదే. అయితే ఇకపై కూడా మన పోరాటాన్ని కొనసాగించాలి. భవిష్యత్తులో కూడా పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా కృషి చేయాలి’ అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే.. ఎన్నికల్లో తాను ఓడితే.. అధికారాన్ని అంత సులువుగా వదులుకోనని ట్రంప్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా మెయిల్ ఇన్ ఓటింగ్ పద్ధతిని వ్యతిరేకిస్తూ.. ఈసారి ఎన్నికల్లో విజయం ఎవరిదనేది సుప్రీం కోర్టు నిర్ణయిస్తుందంటూ పలు సందర్భాల్లో ట్రంప్  పేర్కొన్నారు. ఈ క్రమంలో తాజాగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. కాగా.. ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల్లో విజయం సాధించడానికి ట్రంప్ గట్టి ప్రయత్నాలే చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 



Updated Date - 2020-10-19T03:13:15+05:30 IST