అదే జరిగితే అమెరికా నుంచి వెళ్లిపోతానన్న ట్రంప్.. సరేనన్న జో బైడెన్!

ABN , First Publish Date - 2020-10-17T22:53:55+05:30 IST

డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ చేతిలో ఓడిపోతే.. తాను దేశం విడిచి వెళ్తానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు అమెరికాలో చర్చ

అదే జరిగితే అమెరికా నుంచి వెళ్లిపోతానన్న ట్రంప్.. సరేనన్న జో బైడెన్!

వాషింగ్టన్: డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ చేతిలో ఓడిపోతే.. తాను దేశం విడిచి వెళ్తానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు అమెరికాలో చర్చనీయాంశం అయ్యాయి. వివరాల్లోకి వెళితే.. అమెరికాలో ఎన్నికల సమయం దగ్గరపడింది. నవంబర్ 3న అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసిన ట్రంప్.. జార్జియాలోని ప్రచార ర్యాలీలో శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన తన ప్రత్యర్థి జో బైడెన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. జో బైడెన్‌ను అసమర్థ అభ్యర్థిగా ట్రంప్ అభివర్ణించారు. దేశ చరిత్రలోనే అటువంటి అభ్యర్థిని తాను చూడలేదని విమర్శించారు.


 ‘నా ప్రత్యర్థి  అసమర్థుడు. దేశ చరిత్రలోనే ఇటువంటి అభ్యర్థిని చూడలేదు. తనపై పోటీ చేయడం వల్ల నాపై ఒత్తిడి పెరుగుతోంది. అతని చేతిలో ఓడిపోతే నేను ఏం చేస్తానో మీరు ఊహించగలరా? జో బైడెన్ వంటి అసమర్థ అభ్యర్థి చేతిలో నేను ఓడిపోతే దాన్ని నేను స్వీకరించలేను. బహుశా నేను దేశం విడిచి వెళ్లవలసి వస్తుందేమో.. నేను చెప్పలేను’ అంటూ వ్యాఖ్యానించారు. కాగా.. ఎన్నికల్లో తాను ఓడితే దేశం విడిచి వెళ్తానాంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ స్పందించారు. తన సమ్మతిని తెలిపారు. ‘నేను జో బైడెన్‌ను. దేశం విడిచి వెళ్తానంటూ మీరు చేసిన వ్యాఖ్యలను నేను అంగీకరిస్తున్నాను’ అంటూ బైడెన్ ట్వీట్ చేశారు. 


Updated Date - 2020-10-17T22:53:55+05:30 IST