ట్రంప్‌కు షాకిచ్చిన మోదీ.. ఫోన్‌లో అభ్యర్థించిన రోజే..

ABN , First Publish Date - 2020-04-06T13:09:44+05:30 IST

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ షాక్‌ ఇచ్చారు.

ట్రంప్‌కు షాకిచ్చిన మోదీ.. ఫోన్‌లో అభ్యర్థించిన రోజే..

  • ‘హైడ్రాక్సీ క్లోరోక్విన్‌’ సరఫరా వినతి బుట్టదాఖలు
  • ఫోన్‌లో అభ్యర్థించిన రోజే నిబంధనలు కఠినం
  • ఎగుమతి మినహాయింపులన్నీ తక్షణమే రద్దు
  • మన్మోహన్‌, సోనియాకు ప్రధాని మోదీ ఫోన్‌ 
  • కేసీఆర్‌ సహా పలువురు సీఎంలకు కూడా
  • కరోనా వైరస్‌, దేశంలో పరిస్థితులపై చర్చ


వాషింగ్టన్‌, ఏప్రిల్‌ 5: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ షాక్‌ ఇచ్చారు. ‘మీ దగ్గర పెద్దఎత్తున ఉత్పత్తి అవుతున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను మాకూ ఇవ్వరూ’ అంటూ ఆయన ఎంతో ఆశగా అడిగినప్పటికీ.. వీలుకాదని చెప్పకనే చెప్పేశారు. అది కూడా ట్రంప్‌ ఫోన్‌ చేసి మరీ అభ్యర్థించిన రోజే కావడం గమనార్హం. ఇంతకూ ఏం జరిగిందంటే.. కరోనా చికిత్సలో హైడ్రాక్సీ క్లోరోక్విన్‌పై అమెరికా ఎక్కువ ఆశలు పెట్టుకుంది.


ఈ మాత్రలను సాధ్యమైనంత ఎక్కువ సేకరించాలని భావిస్తోంది. ప్రాథమికంగా న్యూయార్క్‌లో 1,500 మంది రోగుల చికిత్సలో హైడ్రాక్సీ క్లోరోక్విన్‌, ఇతర మందులను కలిపి వాడగా మెరుగైన ఫలితాలు కనిపించాయి. దీంతో ఈ మలేరియా నివారణ మందును పెద్దఎత్తున దిగుమతి చేసుకోవాలని చూస్తోంది. ఆ క్రమంలో తమ దేశ సంస్థలు ఆర్డర్‌ ఇచ్చిన మేరకు టాబ్లెట్ల ఎగుమతికి అనుమతి ఇవ్వాలని ట్రంప్‌.. మోదీని కోరారు. దీనిపై ‘మోదీకి ఫోన్‌ చేశా. నా అభ్యర్థనను వారు తప్పక పరిశీలిస్తారు. అలా చేసే నేను వారిని అభినందిస్తా’ అంటూ శనివారం (ఏప్రిల్‌ 4)న ఆయన వైట్‌హౌస్‌ వద్ద మీడియాకు వెల్లడించారు. కానీ, ట్రంప్‌ ఈ ప్రకటన చేసిన కొద్ది గంటల్లోనే భారత్‌ హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్రల ఎగుమతి, ఫార్ములాకు సంబంధించిన నిబంధనలను మరింత కఠినం చేస్తూ నిర్ణయం తీసుకుంది. అన్ని రకాల మినహాయింపులను డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ డ్రేట్‌ తక్షణమే రద్దు చేసింది. వాస్తవానికి హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ఎగుమతిని భారత్‌ మార్చి 25నే నిలిపివేసింది. వైరస్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కొరత తలెత్తకుండా అప్రమత్తమైంది. అయితే, ‘మానవతా దృక్పథం’ కోణంలో మినహాయింపు ఇచ్చింది. కానీ, పరిస్థితి మరింత సంక్లిష్టం అవుతుండటంతో శనివారం దీనిని కూడా తొలగిస్తూ డీజీఎ్‌ఫటీ వెబ్‌సైట్‌లో ఉత్తర్వులుం చా రు. దీని ప్రకారం సాధారణంగా నిషేధం పరిధిలోకి రాని ఎగుమతి ఆధారిత యూ నిట్లు(ఈవోయూ), ప్రత్యేక ఆర్థిక మండళ్ల(సెజ్‌)కూ ఆదేశాలను వర్తింపజేశారు.


హైడ్రాక్సీ.. ట్రంప్‌ దృష్టిలో ‘గేమ్‌ చేంజర్‌’

కరోనాపై పోరాటంలో హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను ట్రంప్‌ గేమ్‌ చేంజర్‌గా అభివర్ణించారు. ట్రయల్స్‌ విజయవంతమైతే ‘స్వర్గం నుంచి అందిన  బహుమతి’గా భావిస్తానని చెప్పారు. మరోవైపు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ వినియోగానికి ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ సత్వరమే అనుమతులు ఇవ్వడంతో అమెరికా 29 మిలియన్‌ డోస్‌లను నిల్వ చేసి పెట్టుకుంది. మరింత సేకరించాలని చూస్తోంది. కాగా, అమెరికా కంపెనీలు భారత సంస్థలకు ఏ స్థాయిలో ఆర్డర్‌ ఇచ్చాయి అనేది తెలియాల్సి ఉంది.


Updated Date - 2020-04-06T13:09:44+05:30 IST