స్కూళ్లు తెరిచేలా రాష్ట్రాలపై ఒత్తిడి తీసుకొస్తాం: ట్రంప్

ABN , First Publish Date - 2020-07-08T23:44:04+05:30 IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు.

స్కూళ్లు తెరిచేలా రాష్ట్రాలపై ఒత్తిడి తీసుకొస్తాం: ట్రంప్

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. దేశంలోని అన్ని స్కూళ్లను సెప్టెంబర్ నుంచి తెరిచేలా రాష్ట్రాలపై ఒత్తిడి తీసుకొస్తామని తాజాగా ట్రంప్ చెప్పుకొచ్చారు. వైట్‌హౌస్‌లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. స్కూళ్లు తెరిచేలా ముందు ముందు గవర్నర్లు, తదితర అధికారులపై ఒత్తిడి తీసుకురానున్నట్టు ట్రంప్ పేర్కొన్నారు. మరోపక్క ట్రంప్ వ్యాఖ్యలను వైట్‌హౌస్ అధికారులు సమర్థిస్తున్నారు. స్కూళ్లు మూసివేయడం వల్ల పిల్లల్లో ప్రతికూల ప్రభావం కనపడుతోందని వైట్‌హౌస్ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. అమెరికాలో మరణాల రేటు ఏప్రిల్ నెలతో పోల్చుకుంటే పది రెట్లు తగ్గినట్టు ట్రంప్, మెడికల్ నిపుణులు మంగళవారం ట్విటర్‌లో చెప్పుకొచ్చారు. ప్రపంచంలోనే అత్యంత తక్కువ మరణాల రేటు అమెరికాలో నమోదవుతోందని ట్రంప్ చెప్పారు. ఫేక్ వార్తలు చూపిస్తూ ఇటువంటి నిజమైన వార్తలను మీడియా చూపించడం లేదని ట్రంప్ మండిపడ్డారు. కాగా.. అమెరికాలో ఇప్పటివరకు 30 లక్షలకు పైగా కేసులు నమోదు కాగా.. కరోనా బారిన పడి లక్షా 30వేలకు పైగా మరణించారు. అమెరికాలో నిత్యం 50 వేల కేసులు నమోదవుతున్నాయి. జులై నెల మొదటి ఆరు రోజుల్లోనే అమెరికా వ్యాప్తంగా దాదాపు మూడు లక్షల కేసులు నమోదయ్యాయి.

Updated Date - 2020-07-08T23:44:04+05:30 IST