తాలిబన్లు గొప్ప యోధులు.. వెయ్యేళ్ల నుంచీ పోరాడుతున్నారు: ట్రంప్

ABN , First Publish Date - 2021-08-19T01:18:21+05:30 IST

తాలిబన్ల గురించి ట్రంప్ తాజాగా నవ్వు పుట్టించే కామెంట్స్ చేశారు.

తాలిబన్లు గొప్ప యోధులు.. వెయ్యేళ్ల నుంచీ పోరాడుతున్నారు: ట్రంప్

వాషింగ్టన్: ఎప్పుడు ఏంమాట్లాడతారో తెలియని అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన కామెంట్లతో గతంలో పలుమార్లు వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. అధికారంలో ఉండగా ట్రంప్ తరచూ.. ఒక పట్టాన అర్థం కాని, లాజిక్‌కు అందని వ్యాఖ్యలతో నవ్వుపుట్టిస్తూ హడావుడి చేస్తుండేవారు. అధ్యక్ష పీఠాన్ని దిగిపోయాక..ట్రంప్ హడావుడి కాస్త సద్దుమణిగింది. అయితే..అఫ్ఘాన్ సంక్షోభం దరిమిలా.. ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్‌పై విరుచుకుపడుతూ ట్రంప్ మరోమారు చర్చల్లో వ్యక్తిగా నిలిచారు. ప్రస్తుతం తన జోరు కొనసాగిస్తున్న ఆయన.. తాలిబన్ల గురించి తాజాగా నవ్వు పుట్టించే కామెంట్స్ చేశారు. 


ఫాక్స్ న్యూస్ చానల్‌కు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... తాలిబన్లు 1000 ఏళ్ల నుంచీ పోరాడుతున్నారని అనేశారు. ‘‘తాలిబన్లు గొప్ప యోధులు, మరోసారి చెబుతున్నా..వారు గొప్ప ఫైటర్లు. ఈ విషయంలో వారిని మెచ్చుకోవాల్సిందే’’ అని కామెంట్ చేశారు. దీంతో.. యాంకర్ సహా చూస్తున్నవాళ్లందరూ ఒక్కసారిగా అవాక్కైపోయారు. 1994లో తాలిబన్ల సంస్థ ఏర్పాటైన విషయం తెలిసిందే. తదనంతర కాలంలో.. తాలిబన్లు అఫ్ఘాన్ మొత్తాన్ని తమ వశం చేసుకున్నారు. అప్పటి అఫ్ఘాన్ ప్రభుత్వ అక్రమపాలనను అంతమొదించడమే తమ లక్ష్యమని వారు మొదట్లో చెప్పారు. అయితే.. ఇస్లామ్ నిబంధనలకు కఠిన నిర్వచనాలు ఇస్తూ వారు సాగించిన పాలనలో మహిళలు నరకం చవిచూశారు. వారి ఏలుబడిలో అఫ్ఘానిస్థాన్ ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా మారింది. 

Updated Date - 2021-08-19T01:18:21+05:30 IST