ఒరాకిల్, వాల్‌మార్ట్ ఆధీనంలో టిక్‌టాక్ లేకపోతే ఒప్పందాన్ని ఆమోదించం: ట్రంప్

ABN , First Publish Date - 2020-09-22T06:56:20+05:30 IST

టిక్‌టాక్‌తో ఒరాకిల్, వాల్‌ మార్ట్ చేసుకున్న ఒప్పందాన్ని అమెరికా ప్రభుత్వం ఆమోదించాలంటే

ఒరాకిల్, వాల్‌మార్ట్ ఆధీనంలో టిక్‌టాక్ లేకపోతే ఒప్పందాన్ని ఆమోదించం: ట్రంప్

వాషింగ్టన్: టిక్‌టాక్‌తో ఒరాకిల్, వాల్‌ మార్ట్ చేసుకున్న ఒప్పందాన్ని అమెరికా ప్రభుత్వం ఆమోదించాలంటే టిక్‌టాక్‌‌పై పూర్తి అధికారం ఈ రెండు కంపెనీలకే ఉండాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. టిక్‌టాక్ యాప్ ద్వారా అమెరికన్ల డేటాను చైనా దొంగిలిస్తోందని ట్రంప్ చాలా కాలం నుంచి ఆరోపిస్తూ వచ్చిన విషయం తెలిసిందే. అమెరికాకు చెందిన కంపెనీకి టిక్‌టాక్ సంస్థను అమ్మేయాలని.. లేదంటే యాప్‌పై బ్యాన్ విధిస్తామంటూ ట్రంప్ టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌ను హెచ్చరించారు. ఇందులో భాగంగానే సెప్టెంబర్ 20 నుంచి టిక్‌టాక్‌ను అమెరికా ప్రభుత్వం నిషేధించాలని అనుకుంది.


అయితే అమెరికాకు చెందిన ఒరాకిల్, వాల్‌మార్ట్ సంస్థలతో బైట్‌డ్యాన్స్ ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందం కింద కంపెనీలోని 20 శాతం వాటా ఒరాకిల్, వాల్‌మార్ట్ కంపెనీలకు దక్కనున్నట్టు తెలుస్తోంది. రానున్న ఏడాదిలోగా అమెరికా స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో టిక్‌టాక్ గ్లోబల్‌గా కంపెనీని లిస్ట్ చేసేందుకు కూడా ఒరాకిల్, వాల్‌మార్ట్, బైట్‌డ్యాన్స్ అంగీకరించాయి. అయితే కొత్త ఒప్పందం తర్వాత సంస్థలో టిక్‌టాక్ మైనారిటీ స్టేక్ కలిగి ఉండాలని.. పూర్తి అధికారం ఒరాకిల్, వాల్‌మార్ట్‌లకే ఉండాలని ట్రంప్ పట్టుబడుతున్నారు. మరోపక్క టిక్‌టాక్‌పై రాజ్యాంగానికి విరుద్దంగా చర్యలు తీసుకుంటున్నామని డెమొక్రటిక్ పార్టీ అనడం సరికాదని ట్రంప్ అన్నారు. అమెరికా ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లే సంస్థ అమెరికన్ల చేతికి వస్తోందని.. 25 వేల ఉద్యోగాలు కూడా రాబోతున్నాయని ఆయన పేర్కొన్నారు. 

Updated Date - 2020-09-22T06:56:20+05:30 IST