ఆఫ్రికన్ అమెరికన్లపైనే ప్రభావం ఎక్కువ: ట్రంప్

ABN , First Publish Date - 2020-04-08T21:05:38+05:30 IST

అమెరికాలో కరోనా బారిన అత్యధికంగా ఆఫ్రికన్ అమెరికన్లే పడుతున్నట్టు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. వైట్‌హౌస్‌లో నిర్వహించిన మీడియా

ఆఫ్రికన్ అమెరికన్లపైనే ప్రభావం ఎక్కువ: ట్రంప్

వాషింగ్టన్: అమెరికాలో కరోనా బారిన అత్యధికంగా ఆఫ్రికన్ అమెరికన్లే పడుతున్నట్టు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. వైట్‌హౌస్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. ఇప్పటివరకు తీసిన డేటా ప్రకారం తమకు ఈ విషయం తెలిసిందన్నారు. దేశంలోని మిగతా వారితో పోల్చితే ఆఫ్రికన్ అమెరికన్లకే ఎక్కువ ప్రమాదం పొంచి ఉన్నట్టు తెలుస్తోందని ట్రంప్ అన్నారు. ఆఫ్రికన్ అమెరికన్లు కరోనా బారిన పడకుండా తగిన చర్యలు తీసుకుంటూనే ఉన్నామని, ప్రభుత్వం వారికి అండగా ఉంటుందన్నారు. అమెరికా ప్రభుత్వం ఇప్పటివరకు 18 లక్షల 70 వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహించింది.


కాగా.. ఆఫ్రికన్ అమెరికన్లు అంతకు ముందే డయాబెటిస్, హైపర్ టెన్షన్, ఒబెసిటి, ఆస్తమాలతో బాధపడుతున్నట్టు గుర్తించామని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్‌ఫెక్షస్ డిసీజ్ డైరెక్టర్ డాక్టర్ ఆంటనీ ఫాసీ చెబుతున్నారు. అనారోగ్యంతో ఉన్న వారే కరోనా బారిన ఎక్కువగా పడుతున్నారని, డేటాను చూస్తే ఆఫ్రికన్ అమెరికన్లలో అత్యధిక శాతం మంది అనారోగ్యాలతో బాధపడుతున్నట్టు గుర్తించామన్నారు. కరోనా అంశం పూర్తయ్యాక కూడా ఆఫ్రికన్ అమెరికన్లపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆంటనీ అన్నారు. కాగా.. అమెరికాలో ఇప్పటివరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య నాలుగు లక్షలు దాటింది. అమెరికా వ్యాప్తంగా కరోనా కారణంగా 12,857 మంది మృతిచెందారు. 

Updated Date - 2020-04-08T21:05:38+05:30 IST