Abn logo
Feb 17 2021 @ 00:56AM

ట్రంప్‌కు ఊరట

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి కూడా అభిశంసననుంచి తప్పించుకున్నారు. రెండు పర్యాయాలు అభిశంసన ఎదుర్కొన్న ఏకైక అమెరికా అధ్యక్షుడిగా, పదవినుంచి దిగిపోయాక కూడా ఆ అవమానం తప్పని వ్యక్తిగా ఆయన గుర్తుండిపోతారు. అమెరికా సెనేట్‌ ట్రంప్‌ను అభిశంసించకుండా మరోమారు వదిలేసింది. గద్దెదిగిపోయినా సరే, ట్రంప్‌ను శిక్షించాల్సిందే అంటూ డెమోక్రాట్లు ఎంతో పట్టుబట్టి మరీ చేసిన ప్రయత్నం ఫలించలేదు. వారితో చేతులు కలపడానికి అధికశాతం రిపబ్లికన్లకు మనసురాలేదు. ఏడుగురు రిపబ్లికన్లు ట్రంప్‌ తప్పుచేశారంటూ ఓటేశారు కానీ, మిగతావారు ఆయన ఏ తప్పూ చేయలేదనే అన్నారు. కొందరు ట్రంప్‌ వైఖరిని తప్పుబడుతూ ప్రస‍ంగాలు చేసినా, ఓటింగ్‌ దగ్గరకు వచ్చేసరికి భిన్నంగా వ్యవహరించారు. చేజేతులా పార్టీ పరువు తీసుకోవడం ఇష్టం లేకనే ట్రంప్‌కు అండగా నిలిచామని మరికొందరు అన్నారు. ట్రంప్‌ అభిశంసనకు గురైవుంటే జీవితంలో ఇక ఎన్నికల్లో పోటీకీ, అధ్యక్షపదవి చేపట్టడానికీ అనర్హుడుగా ముద్రపడేవారు. రిపబ్లిక్‌ పార్టీ ఆయనకు ఆ సువర్ణావకాశాన్ని దూరం చేయదల్చుకోలేదు. ట్రంప్‌ అభిమానులనూ ఆయన కష్టపడి కూడబెట్టిన ఓటుబ్యాంకునూ రెచ్చగొట్టదల్చుకోలేదు. 


కేపిటల్‌ హిల్‌మీద జనవరి 6న జరిగిన దాడికి ముమ్మాటికీ ట్రంప్‌దే బాధ్యతనీ, కానీ, పదవినుంచి దిగిపోయిన అధ్యక్షుడిని అభిశంసించడం సముచితం కాదు కనుక, ఆయన పక్షాన నిలబడ్డామని రిపబ్లికన్లు సమర్థించుంటున్నారు. నువ్వు ఎంత గొప్పవాడివైనా చట్టానికి లోబడాల్సిందేననీ, ప్రజాస్వామ్యం పరువుతీసిన నిన్ను క్షమించేది లేదని ట్రంప్‌కు ఆయన పార్టీ పెద్దలు విస్పష్టంగా చెప్పగలిగే సందర్భం ఇది. ట్రంప్‌కూ, ఆయన సిద్ధాంతానికీ ఎడం జరిగేందుకు దొరికిన ఈ సువర్ణావకాశాన్ని ధైర్యంగా వినియోగించుకోలేకపోయారు. ట్రంప్‌ని కేవలం మాటల్లో విమర్శిస్తూ, చేతల్లో ఆయన పంచనే నిలబడ్డారు. ఆయన తీరు తప్పుబడుతూనే ఆయన ఓటుబ్యాంకు మాత్రం కావాలనుకున్నారు. అధికారంలో ఉన్నంతకాలం ట్రంప్‌ తన చర్యలూ చేష్టలతో మిగతా ప్రపంచం ముందు అమెరికా పరువు తీశారు. ఆ తరువాత ఎన్నికల ఫలితాలు తారుమారు చేసేందుకు కడదాకా ప్రయత్నించారు. ఇక జనవరి 6 ఘటన అమెరికా ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రతిష్ఠను దెబ్బతీసింది. అధ్యక్ష ఉపాధ్యక్షులుగా జో బైడెన్‌, కమలాహారిస్‌ ఎన్నికను అధికారికంగా ప్రకటించేందుకు కాంగ్రెస్‌ సమావేశమైనప్పుడు, ట్రంప్‌ తన మద్దతుదారులను దాడికి ఉసిగొల్పాడు. కర్రలూ చిన్నాచితకా ఆయుధాలు ధరించి చట్టసభలోకి ప్రవేశించిన ఆయన అభిమానులు సెనేటర్లను పరుగులు తీయించారు. మిగతా ప్రపంచంముందు అమెరికా పరువు దిగజార్చిన ఈ ఘటన తరువాత కూడా ట్రంప్‌ను రిపబికన్లు వెనకేసుకురావడం విచిత్రం. 


తనను రాజకీయంగా అంతం చేయడానికి డెమోక్రాట్లు చేసిన కుట్ర విఫలమైందని ట్రంప్‌ సంతోషిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని రెండు పక్షాల మధ్య సాగుతున్న రాజకీయ యుద్ధంగా ఆయనతో పాటు రిపబ్లికన్లు కూడా చూడటం విచిత్రం. ట్రంప్‌ అభిమానులనుంచి తీవ్ర నిరసనలూ దాడులూ ఎదుర్కోవలసి వస్తుందన్న భయం చాలామంది రిపబ్లికన్లను వేధించిందని అంటారు. జనవరి 6 ఘటనలో ట్రంప్‌ ప్రమేయం ఎంతోకొంత ఉన్నదని డెబ్బయ్‌శాతం అమెరికన్ల విశ్వాసం. బహిరంగ ప్రకటనలతో సహా సామాజిక మాధ్యమాలను విశేషంగా వినియోగించుకొని ట్రంప్‌ ఈ దాడికి కారకుడయ్యాడు. మూకను విధ్వంసానికి ఉసిగొల్పడం, వారిని నియంత్రించవలసిందిగా అధికారులు చేసిన విజ్ఞప్తులను పెడచెవినపెట్టడం, తిరస్కారంగా మాట్లాడటం వంటివి ఆధారాలతో సహా నమోదైనాయి. సెనేట్‌ అభిశంసన నుంచి తప్పించుకున్న ట్రంప్‌ రేపు న్యాయస్థానాలనుంచి ఏ మేరకు బయటపడగలరో చూడాలి.

Advertisement
Advertisement
Advertisement