ప్లీజ్.. టీకా వేసుకోండి: ట్రంప్

ABN , First Publish Date - 2021-03-17T18:57:19+05:30 IST

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మద్దతుదారులను కరోనా టీకా వేసుకోవాల్సిందిగా కోరారు. కొవిడ్ వ్యాక్సిన్‌పై విముఖత చూపుతున్న రిపబ్లికన్స్ రోజురోజుకు పెరిగిపోతున్నట్లు ఇటీవల ఓ సర్వేలో తేలింది.

ప్లీజ్.. టీకా వేసుకోండి: ట్రంప్

వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మద్దతుదారులను కరోనా టీకా వేసుకోవాల్సిందిగా కోరారు. కొవిడ్ వ్యాక్సిన్‌పై విముఖత చూపుతున్న రిపబ్లికన్స్ రోజురోజుకు పెరిగిపోతున్నట్లు ఇటీవల ఓ సర్వేలో తేలింది. సుమారు 47 శాతం మంది రిపబ్లికన్స్ టీకా తీసుకోవడం పట్ల ఆసక్తి చూపడం లేదని ఈ సర్వే నివేదిక తేల్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రముఖ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడిన ట్రంప్.. తన మద్దతుదారులు తప్పకుండా వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. "అందరూ కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలని కోరుతున్నాను. ముఖ్యంగా ఎన్నికల్లో నాకు ఓటు వేసిన వారు తప్పకుండా టీకా తీసుకోండి. ఈ వ్యాక్సిన్ చాలా సురక్షితమైంది. సమర్థవంతంగా పనిచేస్తుంది." అని చెప్పుకొచ్చారు. 


ఈ టీకాల తయారీ కోసం ఫార్మాసిటికల్ కంపెనీలు, యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ) రేయింబవళ్లు కష్టపడుతున్నాయని ట్రంప్ పేర్కొన్నారు. అందుకే టీకా తీసుకోవడం పట్ల అలసత్వం ప్రదర్శించొద్దని మద్దతుదారులను కోరారు. టీకా మాత్రమే మనల్ని మహమ్మారిని నుంచి రక్షించగలదని ట్రంప్ తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు జో బైడెన్‌పై ట్రంప్ విమర్శలు గుప్పించారు. సరిహద్దు సంక్షోభం, చమురు ధరల పెంపు విషయమై అధ్యక్షుడిని ట్రంప్ విమర్శించారు. ఇదిలాఉంటే.. అమెరికా అంటువ్యాధుల నివారణ నిపుణుడు ఆంథోనీ ఫౌచీ కూడా ట్రంప్ మద్దతుదారులు వ్యాక్సిన్ తీసుకోవడం పట్ల విముఖత చూపించడంపై న్యూస్ ఏజెన్సీతో మాట్లాడిన విషయం తెలిసిందే. ట్రంప్ తన మద్దతుదారులను టీకా తీసుకోవాల్సిందిగా సూచించాలని ఫౌచీ కోరారు. ఇది కూడా ట్రంప్ తాజాగా తన మద్దతుదారులను వ్యాక్సిన్ తీసుకోవాలని కోరడానికి ఓ కారణం కావొచ్చని తెలుస్తోంది.     

Updated Date - 2021-03-17T18:57:19+05:30 IST