మనసు మార్చుకునే అవకాశమే లేదు: ట్రంప్

ABN , First Publish Date - 2020-11-30T07:00:26+05:30 IST

అమెరికా ఎన్నికల్లో మోసం జరిగిందన్న తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి చెప్పుకొచ్చారు.

మనసు మార్చుకునే అవకాశమే లేదు: ట్రంప్

వాషింగ్టన్: అమెరికా ఎన్నికల్లో మోసం జరిగిందన్న తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో ఓడినట్టు అంగీకరించే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. అమెరికా ఎన్నికల్లో పరాజయం పొందిన తర్వాత ట్రంప్ మొదటిసారిగా ఓ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన ఎన్నికల్లో మోసం జరిగిందని మరోసారి పాడిన పాటనే పాడారు. ‘మీరంతా కలిసి నా మనసును మార్చలేరు. ఆరు నెలల్లో నా మనసు ఏమీ మారదు. ఎన్నికల్లో మోసం జరిగింది. మేము ఎన్నికల్లో సునాయాసంగా విజయం సాధించాము’ అని ట్రంప్ అన్నారు. ఇదిలా ఉంటే.. ఎన్నికల్లో మోసం జరిగిందంటూ ట్రంప్ అనేక కోర్టుల్లో దావా వేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన వేస్తున్న దావాలను ఒక కోర్టు తర్వాత మరో కోర్టు కొట్టివేస్తూ వచ్చాయి. తాజాగా పెన్సిల్‌వేనియాలో జో బైడెన్ గెలుపుకు వ్యతిరేకంగా వేసిన దావాను సైతం సుప్రీంకోర్టు కొట్టేసింది. 


‘మా దగ్గర చాలా సాక్ష్యాలున్నాయి. సాక్ష్యాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నా జడ్జీలు అనుమతించడం లేదు. సుప్రీంకోర్టు మా వాదనలను వినాలి. లేకపోతే సుప్రీంకోర్టు ఉండి ఏం ప్రయోజనం?’ అని ట్రంప్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. కాగా.. అమెరికా ఎన్నికల్లో జో బైడెన్ 306 ఎలక్టోరల్ ఓట్లను గెలుపొందగా.. ట్రంప్ కేవలం 232 ఎలక్టోరల్ ఓట్లను మాత్రమే సొంతం చేసుకున్నారు. మ్యాజిక్ ఫిగర్ 270ను జో బైడెన్ దాటేయడంతో వచ్చే ఏడాది జనవరి 20న ఆయన అమెరికా 46వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. మరోపక్క ట్రంప్ మాత్రం గెలుపు తనదేనని.. ఎప్పటికైనా విజయం సాధించేది తానేనని అభిప్రాయపడుతున్నారు.

Updated Date - 2020-11-30T07:00:26+05:30 IST