కోటి మందితో నాకు స్వాగతం

ABN , First Publish Date - 2020-02-22T08:47:41+05:30 IST

తొలిసారి భారత పర్యటనకు వస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన కోసం జరుగుతున్న స్వాగత సంరంభం గురించి చాలా ఊహించుకొని మురిసిపోతున్నారు!

కోటి మందితో నాకు స్వాగతం

  • అలా అని మోదీ నాతో చెప్పారు: ట్రంప్‌
  • అదెలా సాధ్యమంటూ నెటిజన్ల ఎద్దేవా
  • అనామక సంస్థ అధ్వర్యంలో 
  • అహ్మదాబాద్‌లో ‘నమస్తే ట్రంప్‌’
  • అలాంటి కార్యక్రమానికి 120 కోట్లు 
  • ఎలా ఖర్చు పెడతారు: కాంగ్రెస్‌
  • అమెరికాను భారత్‌ దెబ్బతీస్తోంది
  • భారీ సుంకాలు విధిస్తోంది: ట్రంప్‌


న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: తొలిసారి భారత పర్యటనకు వస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన కోసం జరుగుతున్న స్వాగత సంరంభం గురించి చాలా ఊహించుకొని మురిసిపోతున్నారు! అహ్మదాబాద్‌లో 70 లక్షల మంది తనకు స్వాగతం పలుకుతారని మొన్న ఉత్సాహంగా చెప్పిన ఆయన... ఆ సంఖ్యను ఇప్పుడు కోటికి పెంచేశారు. పైగా అంతమంది వస్తారని ప్రధాని నరేంద్ర మోదీయే తనతో చెప్పారని కూడా అంటున్నారు. మొదట మంగళవారం మేరీలాండ్‌లోని జాయింట్‌ బేస్‌ ఆండ్రూ్‌సలో విలేకరులకు అహ్మదాబాద్‌లో 70 లక్షల మంది తనకు స్వాగతం పలకడానికి వస్తారని ట్రంప్‌ చెప్పారు.


గురువారం కొలరాడో సభలో ఆ సంఖ్యను కోటి చేశారు. అహ్మదాబాద్‌లో నిర్మించిన ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియంకు వెళ్లే 22 కిలోమీటర్ల మార్గం పొడవునా కోటి మంది చేరుకొని తనకు స్వాగతం పలకనున్నారని ప్రకటించారు. అంతేకాదు, ‘నమస్తే ట్రంప్‌’ కార్యక్రమం తనను చెడగొడుతుందని కూడా చెప్పుకొన్నారు. కోటి మంది హాజరయ్యే కార్యక్ర మం చూశాక అమెరికాలో 60వేల మంది హాజరయ్యే సభలు తనను సంతృప్తిపర్చలేవన్నారు. అయితే ట్రంప్‌ వ్యాఖ్యలను ఆయన భ్రమ అంటూ నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు. దేశంలో ఎక్కడా ఒకేసారి కోటి మంది హాజరైన కార్యక్రమాలు లేవని గుర్తు చేస్తున్నారు. మోదీ-ట్రంప్‌ రోడ్‌షోకు 1-2 లక్షల మంది హాజరవుతారని మునిసిపల్‌ కమిషనర్‌ స్పష్టం చేశారు.


కాగా, ఫేస్‌బుక్‌ ఫాలోవర్ల సం ఖ్య విషయంలో తానే ‘నంబర్‌ వన్‌’, ప్రధాని మోదీ ‘నంబర్‌ టూ’ అని ట్రంప్‌ మరోసారి గొప్పగా చెప్పుకొన్నారు. భారత్‌లో జనాభా ఎక్కువగా ఉండడం మోదీకి కలిసివచ్చిందని, ఆయనకు అభినందనలు తెలిపానన్నారు. నిజానికి ఫేస్‌బుక్‌లో మోదీకి 4.40 కోట్ల మంది, ట్రంప్‌కు 2.70 లక్షల మంది మాత్రమే ఫాలవర్లు ఉన్నారు. 


అమెరికాను భారత్‌ తీవ్రంగా దెబ్బతీస్తోంది: ట్రంప్‌

భారత్‌ చాలా ఏళ్లుగా అధిక సుంకాలతో తమ దేశ వాణిజ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోందని ట్రంప్‌ ఆరోపించారు. భారత్‌ విధిస్తున్న సుంకాలు ప్రపంచంలోనే ఎక్కువన్నారు. భారత్‌ పర్యటనలో వాణిజ్య విషయాలు, అమెరికా ఉత్పత్తులకు మద్దతు పై మోదీతో మాట్లాడతానన్నారు. ట్రంప్‌తో పాటు ఆయన కుమార్తె ఇవాంకా ట్రంప్‌, అల్లుడు జేర్డ్‌ కుష్నర్‌ కూడా భారత్‌కు రానున్నట్లు అధికారులు తెలిపారు. ట్రంప్‌ భార్య మెలానియా ట్రంప్‌ వస్తున్నట్లు ఇప్పటికే అమెరికా ప్రకటించింది. ఆమె ఢిల్లీలోని ఓ ప్రభుత్వ పాఠశాలను సందర్శించనున్నారు. కాగా, భారత్‌లో ట్రంప్‌ పర్యటన అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి కొనసాగింపు కాకూడదని, భారత్‌కు స్పష్టమైన ఫలితం ఉండాలని కాంగ్రెస్‌ సూచించింది. ట్రంప్‌, మోదీ ఉమ్మడి ప్రకటనలో ఆ ఫలితమేమిటో తెలియజేయాలని కాంగ్రెస్‌ ప్రతినిధి ఆనంద్‌ శర్మ కోరారు. 


అనామక సంస్థ ఆధ్వర్యంలో ‘నమస్తే ట్రంప్‌’ నిర్వహణ

డొనాల్డ్‌ ట్రంప్‌ నాగరిక్‌ అభినందన్‌ సమితి(డీటీఎన్‌ఏఎ్‌స).. కనీసం అడ్రస్‌ కూడా లేని ఈ సంస్థే అహ్మదాబాద్‌లో ‘నమస్తే ట్రంప్‌’ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఎవర్ని ఆహ్వానించాలో ఈ సమితే నిర్ణయం తీసుకుంటుందని విదేశాంగ శాఖ ప్రతినిధి రవీశ్‌కుమార్‌ తెలిపారు. ఆయన ప్రకటనతో సమితి సంగతి తెరపైకి వచ్చింది.  అహ్మదాబాద్‌లో కొత్తగా నిర్మించిన ప్రపంచంలోనే అతి పెద్ద మోతేరా స్టేడియంలో 24న ‘నమస్తే ట్రంప్‌’ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించనున్నారు. అహ్మదాబాద్‌ విమానాశ్రయం నుంచి స్టేడియం వరకు మోదీ, ట్రంప్‌ నిర్వహించే రోడ్‌షో కూడా సమితి పరిధిలోకి వస్తుందట. ఈ సమితికి అడ్రస్‌ లేకపోవడమే కాదు ఆన్‌లైన్‌లోనూ దాని జాడ కనిపించదు. గూగుల్‌లో వెతికినా ఓ పట్టాన దొరకదు. ‘‘ప్రధాని గారూ.. ట్రంప్‌ నాగరిక్‌ అభినందన్‌ సమితి అధ్యక్షుడు ఎవరు?’’ అని కాంగ్రెస్‌ ప్రతినిధి రణదీప్‌ సింగ్‌ సూర్జేవాలా ప్రశ్నించారు.

Updated Date - 2020-02-22T08:47:41+05:30 IST