ఫౌచీ సహా ఆరోగ్యనిపుణులంతా మూర్ఖులు: ట్రంప్‌

ABN , First Publish Date - 2020-10-21T10:30:47+05:30 IST

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మరోసారి నోరు పారేసుకున్నారు. అమెరికా అంటువ్యాధుల చికిత్స నిపుణుడు

ఫౌచీ సహా ఆరోగ్యనిపుణులంతా మూర్ఖులు: ట్రంప్‌

వాషింగ్టన్‌, అక్టోబరు 20: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మరోసారి నోరు పారేసుకున్నారు. అమెరికా అంటువ్యాధుల చికిత్స నిపుణుడు ఆంటోనీ ఫౌచీపై దుమ్మెత్తిపోశారు. మాస్కులు వాడకపోవడం, కరోనా నెగెటివ్‌ అని తేలకముందే శ్వేతసౌధానికి వచ్చేయడం వంటి ట్రంప్‌ చర్యలన్నింటనీ తప్పుపడుతున్న విషయం తెలిసిందే. దీంతో ట్రంప్‌ మీడియాతో మాట్లాడుతూ ‘ఫౌచీ తదితరులు మూర్ఖులు. వారు చెప్పే మాటలను ప్రజలు ఆలకించడం లేదు. కొవిడ్‌తో ప్రజలు అలసిపోయారు. ఫౌచీ తదితరులు చెప్పే మాటలను వినలేకపోతున్నారు’ అని చెప్పారు. కాగా, డెమొక్రాటిక్‌ ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారి్‌సను దుర్గాదేవిగా అభివర్ణిస్తూ ఆమె బంధువు మీనా హారిస్‌ విడుదల చేసిన కేరికేచర్‌పై హిందూ సంస్థ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ చిత్రం పలువురు హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని హిందూ అమెరికన్‌ ఫౌండేషన్‌ సభ్యుడు సుహాగ్‌ శుక్లా చెప్పారు. అనంతరం ఆ ట్వీట్‌ను మీనా హారిస్‌ తొలగించారు.


అలా చేస్తే మైక్‌ కట్‌!

ట్రంప్‌-బైడెన్‌ల తుది ముఖాముఖీలో రసాభాసకు ఆస్కారం లేకుండా చూడాలని దానిని నిర్వహిస్తున్న డిబేట్‌ కమిషన్‌ జాగ్రత్తలు తీసుకుంది. అభ్యర్థుల ముఖాముఖీని హుందాగా నిర్వహించేందుకు నియమ నిబంధనలను మారుస్తున్నట్టు ప్రకటించింది. తొలి ముఖాముఖీ చర్చలో ఇద్దరు నేతలు పరుషపదజాలంతో పరస్పరం విమర్శించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చర్చలో ఎలాంటి రచ్చ జరగకుండా, ఒకరి ప్రసంగానికి మరొకరు అడ్డుపకడకుండా మైక్‌ను కట్‌ చేయాలని కమిషన్‌ నిర్ణయించింది.  గురువారం( 22న) నాష్‌విల్లేలోని బెల్మాంట్‌ యూనివర్సిటీలో ట్రంప్‌-బైడెన్‌ మధ్య తుది ముఖాముఖీ జరగనుంది.


హెచ్‌ 1బీ కొత్త వీసా విధానం ఏకపక్షం

నూతన హెచ్‌1బీ వీసా విధానాన్ని సవాల్‌ చేస్తూ డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ కొలంబియా కోర్టులో 17 మంది వ్యక్తులు,  వర్సిటీలు, సంస్థల ప్రతినిధులు ఓ పిటిషన్‌ వేశారు. ఈ విధానం ఏకపక్షంగా, ఓ పద్ధతీ పాడూ లేకుండా అస్తవ్యస్తంగా ఉందని, దీని వల్ల అమెరికాలో ఉన్న వేలాదిమంది ఉద్యోగాలు కోల్పోతారని, అనేక సంస్థల కార్యకలాపాలు చెదిరి ధ్వంసమైపోతాయని అందులో పేర్కొన్నారు. 

Updated Date - 2020-10-21T10:30:47+05:30 IST