ఎట్ట‌కేల‌కు దిగొచ్చిన ట్రంప్‌.. విదేశీ విద్యార్థుల‌కు భారీ ఊర‌ట !

ABN , First Publish Date - 2020-07-16T13:03:57+05:30 IST

అమెరికాలో ఆన్‌లైన్‌ తరగతులకు హాజరయ్యే విదేశీ విద్యార్థులను తిప్పి పంపేయాలన్న వివాదాస్పద ఉత్తర్వులపై ట్రంప్‌ ఎట్టకేలకు వెనక్కి తగ్గారు. ఆ నిర్ణయంపై నలుమూలల నుంచి వ్యతిరేకత రావడంతో ట్రంప్‌ ప్రభుత్వం అనూహ్యంగా యూటర్న్‌ తీసుకుంది.

ఎట్ట‌కేల‌కు దిగొచ్చిన ట్రంప్‌.. విదేశీ విద్యార్థుల‌కు భారీ ఊర‌ట !

విదేశీ విద్యార్థులకు 12 ఐటీ దిగ్గజ కంపెనీలు, పలు ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు అండగా నిలవడంతో ఆన్‌లైన్‌  విద్యార్థులను వెనక్కి పంపాలన్న నిర్ణయాన్ని ట్రంప్‌ సర్కారు ఉపసంహరించుకుంది.

విదేశీయులపై ‘ఆన్‌లైన్‌’ అస్త్రం ఉపసంహరణ

ఉత్తర్వులను వెనక్కి తీసుకున్నట్లు కోర్టుకు వెల్లడి

వివాదాస్పద ఉత్తర్వులపై విద్యాసంస్థల విజయం 

రెండు లక్షల మంది విదేశీ విద్యార్థులకు ఊరట

నేనొస్తే వర్క్‌ వీసాలపై పరిమితి తొలగిస్తా: బిడెన్‌

వాషింగ్టన్‌, జూలై 15: అమెరికాలో ఆన్‌లైన్‌ తరగతులకు హాజరయ్యే విదేశీ విద్యార్థులను తిప్పి పంపేయాలన్న వివాదాస్పద ఉత్తర్వులపై ట్రంప్‌ ఎట్టకేలకు వెనక్కి తగ్గారు. ఆ నిర్ణయంపై నలుమూలల నుంచి వ్యతిరేకత రావడంతో ట్రంప్‌ ప్రభుత్వం అనూహ్యంగా యూటర్న్‌ తీసుకుంది. కరోనా నేపథ్యంలో విశ్వవిద్యాలయాలు పూర్తిగా ఆన్‌లైన్‌ తరగతులకు మారితే.. అమెరికాలోని విదేశీ విద్యార్థులు వెనక్కి వెళ్లిపోవాల్సి ఉంటుందంటూ ఇమిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం(ఐసీఈ) ఈ నెల 6న మార్గదర్శకాలు జారీ చేసింది. వీటిని సవాల్‌ చేస్తూ హార్వర్డ్‌, మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎంఐటీ) వంటి ప్రముఖ విద్యాసంస్థలు వ్యాజ్యం దాఖలు చేశాయి. గూగుల్‌, ఫేస్‌బుక్‌, మైక్రోసాఫ్ట్‌ తదితర 12 టెక్‌ దిగ్గజ సంస్థలు, 17 రాష్ట్రాలు, 200కి పైగా విద్యాసంస్థలు జతకలిశాయి. నలువైపుల నుంచి వ్యతిరేకత వెల్లువెత్తిన నేపథ్యంలో ట్రంప్‌ ప్రభుత్వం వారం రోజుల్లోనే తోకముడిచింది.


ఉత్తర్వులను ఉపసంహరిస్తున్నట్టు మసాచుసెట్స్‌లోని యూఎస్‌ డిస్ర్టిక్ట్‌ కోర్టు జడ్జి అలిసన్‌ డి బరోకు ట్రంప్‌ ప్రభుత్వం తెలిపింది. దీంతో వివిధ విద్యాసంస్థల్లో జనవరిలో ఎన్‌రోల్‌ అయిన 1,94,556 మంది విదేశీ విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు వివిధ యూనివర్సిటీలు, కాలేజీలు ఆన్‌లైన్‌ పద్ధతి వైపు మొగ్గు చూపాయి. ట్రంప్‌ మాత్రం ఫాల్‌(ఆగస్టు నుంచి) నుంచే విద్యాసంస్థలను బలవంతంగా తెరిపించే ప్రయత్నం చేశారు. నేరుగా తరగతులకు హాజరు కాని విదేశీ విద్యార్థులు దేశం విడిచి వెళ్లాల్సిందేనంటూ ఆదేశాలిచ్చారు. హైబ్రిడ్‌ తరగతులకు(ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ రెండూ కలిసి ఉన్న పద్ధతి) హాజరయ్యే వారికి మాత్రం దీనికి మినహాయింపు ఉంటుందని ప్రకటించారు.   వాస్తవానికి ఆన్‌లైన్‌ తరగతుల ద్వారా చదివే వారికి విద్యార్థి వీసా జారీ చేయరు. అయితే కరోనా మహమ్మారి కోరలు సాచిన సమయంలోనూ దానిని అడ్డం పెట్టుకుని విద్యాసంస్థలపై, విదేశీ విద్యార్థులపై ఒత్తిడి తెచ్చారు. ఓ దశలో ట్రంప్‌ విద్యాసంస్థలపై బెదిరింపులకు దిగారు. ఫాల్‌ నుంచి తెరవకపోతే ప్రభుత్వం నుంచి అందే రాయితీలను సమీక్షిస్తానని హెచ్చరించారు. విదేశీ విద్యార్థుల్లో చైనా తరువాత స్థానం మనదే.  


జిన్‌పింగ్‌తో మాట్లాడే ఆలోచన లేదు: ట్రంప్‌

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మాట్లాడే యోచన ఏదీ లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ స్పష్టం చేశారు. పలు అంశాల్లో ప్రస్తుతం ఇరుదేశాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్‌ కట్టడికి  సరిగ్గా వ్యవహరించని చైనాపై ఆయన ఆగ్రహంతో ఉన్నారు. కాగా హాంకాంగ్‌కు ప్రత్యేక ఆర్థిక సాయం అందించే కార్యక్రమానికి ట్రంప్‌ ఫుల్‌స్టాప్‌ పెట్టారు. ఈ మేరకు కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. ఇకపై హాంకాంగ్‌ను ప్రత్యేకంగా చూడబోమని ట్రంప్‌ చెప్పారు.  


ట్రంప్‌ వలస విధానాలు దారుణం: బిడెన్‌

ట్రంప్‌ అనుసరిస్తున్న ఇమిగ్రేషన్‌ విధానాలు దారుణంగా ఉన్నాయని డెమొక్రాటిక్‌ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌  వ్యాఖ్యానించారు. తాను గెలుపొందితే వర్క్‌ వీసాలపై పరిమితిని ఎత్తేస్తానని హామీ ఇచ్చారు. గ్రీన్‌కార్డుల కోసం ఎదురుచూస్తున్న పదిలక్షల మందికి సులువుగా పౌరసత్వం లభించేలా చూస్తానని చెప్పారు. కుటుంబాలను కలిపి ఉంచడమే తన వలస విధానమని చెప్పుకొచ్చారు.  


Updated Date - 2020-07-16T13:03:57+05:30 IST