హెచ్-1బీ వీసాదారుల‌కు ట్రంప్ స‌ర్కార్‌ శుభవార్త..!

ABN , First Publish Date - 2020-08-13T17:52:36+05:30 IST

హెచ్-1బీ వీసాదారుల‌కు ట్రంప్ స‌ర్కార్‌ శుభవార్త చెప్పింది.

హెచ్-1బీ వీసాదారుల‌కు ట్రంప్ స‌ర్కార్‌ శుభవార్త..!

వాషింగ్ట‌న్ డీసీ: హెచ్-1బీ వీసాదారుల‌కు ట్రంప్ స‌ర్కార్‌ శుభవార్త  చెప్పింది. హెచ్-1బీ, ఎల్1 లాంటి నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాల ద్వారా అమెరికాలోకి రావడాన్ని ఈ ఏడాది చివరి వరకు నిషేధిస్తూ జూన్ 22న ట్రంప్ స‌ర్కార్‌ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు ఈ నిషేధంపై యూఎస్‌ కొన్ని సడలింపులు ఇచ్చింది. ప్ర‌స్తుత క‌రోనా సంక్షోభం వేళ ప్ర‌వాసుల‌కు ఊర‌ట‌నిస్తూ హెచ్-1బీ వీసా నిషేధం నిబంధనల్ని సడలించింది. వీసా నిషేధాన్ని ప్రకటించడానికి ముందున్న ఉద్యోగాలకు తిరిగి వెళ్లే హెచ్-1బీ, ఎల్ 1 వీసాదారులకు అనుమతినిస్తున్నట్టు ఇమ్మిగ్రేషన్ అటార్నీ గ్రెగ్ సిస్కిండ్ ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించారు. అంటే గతంలో పనిచేసిన ఉద్యోగాల్లో మళ్లీ పనిచేయడానికి వెళ్లొచ్చు. 




ఇక‌ ఈ సడలింపుల ప్రకారం వీసాదారులతో పాటు వారిపై ఆధార‌ప‌డిన‌ జీవితభాగస్వాములు, పిల్లలకు కూడా అనుమతి ఉంటుంద‌ని విదేశాంగ శాఖ పేర్కొంది. ప్ర‌జా ఆరోగ్య‌ లేదా హెల్త్‌కేర్ సిబ్బంది, మెడికల్ రీసెర్చర్ లాంటివారికి కూడా వీసాలు పొందటానికి అవకాశం క‌ల్పిస్తున్న‌ట్టు అమెరికా ప్ర‌భుత్వం తెలిపింది. అలాగే హెచ్-1బీ వీసాలు క‌లిగి ఉన్న సాంకేతిక నిపుణులు, ఉన్న‌త‌స్థాయి మేనేజ‌ర్లకు కూడా అనుమ‌తిస్తున్న‌ట్టు యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ స్టేట్ అడ్వైజరీ పేర్కొంది. 

Updated Date - 2020-08-13T17:52:36+05:30 IST