కొవిడ్ మరణాల ద్వారా డాక్టర్లు లాభపడుతున్నారు: ట్రంప్

ABN , First Publish Date - 2020-10-31T21:03:57+05:30 IST

తమ ప్రాణాలను పణంగా పెట్టి కరోనా మహమ్మారి బారినపడ్డ ప్రజలను రక్షిస్తున్న వైద్యులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆరోపణలు చేశారు. కరోనా మరణాల ద్వారా డాక్టర్లు లాభపడుతున్నారని ట్రంప్ ఆరోపించారు. అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికల సమయం దగ్గరపడింది. మరో మూడు రోజుల్లో

కొవిడ్ మరణాల ద్వారా డాక్టర్లు లాభపడుతున్నారు: ట్రంప్

వాషింగ్టన్: తమ ప్రాణాలను పణంగా పెట్టి కరోనా మహమ్మారి  బారినపడ్డ ప్రజలను రక్షిస్తున్న వైద్యులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆరోపణలు చేశారు. కరోనా మరణాల ద్వారా డాక్టర్లు లాభపడుతున్నారని ట్రంప్ ఆరోపించారు. అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికల సమయం దగ్గరపడింది. మరో మూడు రోజుల్లో అమెరికాలో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం ట్రంప్.. మిడ్‌వెస్ట్రన్ రాష్ట్రాల్లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. డెమొక్రటిక్ పార్టీకి చెందిన గవర్నర్‌లపై విమర్శలు గుప్పించారు. కరోనా వ్యాప్తిని కట్టడి చేయడం కోసం డెమొక్రటిక్ పార్టీ గవర్నర్‌లు తీసుకున్న చర్యలను అమెరికా అధ్యక్షుడు తప్పబట్టారు. నవంబర్ 3న జరగబోయే ఎన్నికల్లో జో బైడెన్ గెలిస్తే.. జనసమూహాలపై ఆంక్షలు విధిస్తారని ఆరోపించారు. 


అంతేకాకుండా ‘కరోనా కారణంగా ఎవరైనా మరణిస్తే మన డాక్టర్లు లాభపడుతారు. వాళ్లకు ఎక్కువ మొత్తంలో డబ్బు అందుతుంది’ అంటూ వ్యాఖ్యానించారు. కాగా.. ట్రంప్ వ్యాఖ్యలపై జో బైడెన్ మండిపడ్డారు. మహమ్మారితో చేస్తున్న పోరాటంలో ట్రంప్ చేతులెత్తేసి, వైద్యులపై ఆరోపణలు చేస్తున్నారని బైడెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డొనాల్డ్ ట్రంప్ మినహా మిగిలిన వారెవరూ వైరస్‌కు సరెండర్ కాలేదని జో బైడెన్ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. అమెరికాలో మహమ్మారి విజృంభణ మళ్లీ మొదలైంది. ప్రతి రోజు దాదాపు లక్ష కేసులు నమోదవుతున్నాయి. కాగా.. ఇప్పటి వరకు అమెరికాలో 2.30లక్షల మంది కొవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. 

Updated Date - 2020-10-31T21:03:57+05:30 IST