లారీలు లేక నిలిచిన కొనుగోళ్లు

ABN , First Publish Date - 2022-05-13T05:52:21+05:30 IST

కామారెడ్డి జిల్లాలో లారీలు రాక వరి కొనుగోళ్లు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గత రెండు రోజులుగా కొనుగోలు విక్రయాలు జరగక రైతులు ధాన్యం కుప్పల వద్ద పాట్లు పడుతున్నారు.

లారీలు లేక నిలిచిన కొనుగోళ్లు
అధికారులతో మాట్లాడుతున్న ఆర్‌డీఓ శ్రీనునాయక్‌

కామారెడ్డి, మే 12: కామారెడ్డి జిల్లాలో లారీలు రాక వరి కొనుగోళ్లు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గత రెండు రోజులుగా కొనుగోలు విక్రయాలు జరగక రైతులు ధాన్యం కుప్పల వద్ద పాట్లు పడుతున్నారు. ఇటీవల మాచారెడ్డి మండలం లచ్చపేట సమీపంలోని ఓ రైస్‌మిల్లు యజమాని వడ్లను కొనుగోలు చేయమని చెప్పడంతో రైతులు ఆగ్రహించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై జిల్లాలోని రైస్‌మిల్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు బంద్‌కు పిలుపునివ్వడంతో ఎక్కడికక్కడే లారీలు నిలిచిపోయాయి. దీంతో ఒకవైపు వాతావరణ ఇబ్బందులు, మరోవైపు తూకం వేయకపోవడంతో లారీలు రాక రైతులు వరి కుప్పల వద్ద పడిగాపులు పడుతున్నారు. దీంతో సంబంధిత సహకార సంఘాల పాలకవర్గలపైన రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్‌ స్పందించి వరి కొనుగోలు జరిగేలా చూడాలని రైతులు కోరుతున్నారు.

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి

ఎల్లారెడ్డి : ఎల్లారెడ్డి డివిజన్‌ పరిధిలోని ప్రతీ కొనుగోలు కేంద్రం వద్ద రైతులకు సౌకర్యాలు కల్పించాలని, ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని ఆర్‌డీవో శ్రీనునాయక్‌ తెలిపారు. గురువారం ఎల్లారెడ్డి ఆర్డీవో కార్యాలయంలో ఎంఆర్‌వోలతో, పీఏసీఎస్‌ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులకు ఇబ్బందులు కలుగకుండా కొనుగోలు వేగవంతం చేయాలని,రైతులకు సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. రైతుల వివరాలు వెంటనే ట్యాబ్‌లో ఎంట్రీ చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వోలు సయిద్‌, మునిరోద్దిన్‌, పీఏసీఎస్‌సీఈఓలు తదితరులు పాల్గొన్నారు.

Read more