Abn logo
Dec 2 2020 @ 23:34PM

‘ట్రక్కు’టమారి యత్నాలు!

 

526 వాహనాలకు 4,701 దరఖాస్తులు

రేపు ఇంటర్వ్యూలు 

లబ్ధిదారుల ఎంపికలో పైరవీలు!

నేతల సిఫారసులకు ప్రయత్నాలు

(ఇచ్ఛాపురం రూరల్‌) 

ప్రభుత్వం రాయితీపై అందజేయనున్న మినీట్రక్కుల పంపిణీ విషయంలో రాజకీయ పైరవీలు జోరుగా సాగుతున్నాయి. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపడతామని అధికారులు చెబుతున్నా.. నేతల సిఫారసు కోసం దరఖాస్తుదారులు క్యూ కడుతున్నారు. లబ్ధిదారుడి వాటా పది శాతమే కావడం.. ఆపై నెలకు ప్రభుత్వం రూ.10వేలు చొప్పున వేతనం అందజేయనుండడంతో వాహనాల కోసం పోటీ తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నేతలు తమకు అనుకూలంగా ఉన్నవారికే వాహనాలు మంజూరు చేసేలా ప్రయత్నాలు సాగిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

---------------------

ప్రభుత్వం ఇంటింటికీ రేషన్‌ సరఫరా చేసేందుకు రాయితీపై మినీ ట్రక్కులను పంపిణీ చేయనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ కార్పొరేషన్‌ల ద్వారా వీటిని అందజేసేందుకు చర్యలు తీసుకుంది. అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు విధి విధానాలను ఖరారు చేసింది. ప్రతి రెండువేల రేషన్‌ కార్డుదారులకు సరుకులు సరఫరా చేసేందుకు ఒక మినీట్రక్కును కేటాయించనుంది. ఈ మేరకు జిల్లాలో 526 వాహనాల పంపిణీకి దరఖాస్తులను ఆహ్వానించింది. ఇప్పటివరకూ 4,701 మంది దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు వీరందరికీ ఈ నెల 4న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. పోటీ తీవ్రంగా ఉండడంతో దరఖాస్తుదారులు నేతల సిఫారసు కోసం క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో పైరవీలు సాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అధికార పార్టీకి చెందిన చోటా నాయకులు తమకు అనుకూలంగా ఉన్నవారిని ముందుగానే నిర్ధారించుకుంటున్నారు. నియోజకవర్గ ప్రజాప్రతినిధుల ఆశీస్సులతో తమవారు ఎంపికయ్యేలా ముందుస్తుగానే ప్రయత్నాలు చేస్తున్నారు. నాయకులు తమ వర్గీయులకు వాహనాలు వచ్చేలా చర్యలు తీసుకుంటుంటుంటే పేరుకే ఇంటర్వ్యూలన్న భావన మిగతా దరఖాస్తుదారుల్లో వ్యక్తమవుతోంది. 


ఎంపికలు ఇలా.. :

ప్రభుత్వం రాయితీపై మినీట్రక్కులతో పాటు వాహన డ్రైవర్‌కు ప్రతినెలా రూ.10వేల చొప్పున వేతనం అందజేయనుంది. ఒక్కో వాహనం విలువ రూ.5,81,190 ఉండగా లబ్ధిదారులు కేవలం 10 శాతం మాత్రమే చెల్లించాలి. బ్యాంకు రుణం 30 శాతం(రూ.1,74,357) ప్రభుత్వం సబ్సిడీ 60 శాతం (రూ.3,48,714లు) అందిస్తారు. బ్యాంకు అందించిన రుణాన్ని 72 నెలల వాయిదాలలో వడ్డీతో సహా చెల్లించాలి. లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను పౌరసరఫరాల శాఖ..  వివిధ కార్పొరేషన్‌లకు అప్పగించింది. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ కార్పొరేషన్ల ఆధ్వర్యంలో ఎంపిక జరగనుంది. క్షేత్రస్థాయిలో ఎంపీడీవో, కమిషనర్ల పర్యవేక్షణలో ఇంటర్వ్యూలు నిర్వహించి లబ్ధిదారులను ఖరారు చేస్తారు. వారికి వాహనాలు అందజేయనున్నారు. తీవ్ర పోటీ, పైరవీల నడుమ ఈ వాహనాలు ఎవరికి దక్కుతాయోనన్నది చర్చనీయాంశమవుతోంది. 


కమిటీల ద్వారానే : 

పోటీ తీవ్రంగా ఉంది. చాలా మండలాల్లో పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. ముఖ్యంగా బీసీ అభ్యర్థుల నుంచి మంచి స్పందన వచ్చింది. వీరిలో అభ్యర్థులు ఎవరన్నది మండల, పట్టణ స్థాయిలో కమిటీలు ఎంపిక చేస్తాయి. ఎంపికైన అభ్యర్థులకు కార్పొరేషన్‌ ద్వారా రుణాలు మంజూరు చేస్తాం.

- జి.రాజారావు, ఈడీ, జిల్లా బీసీ కార్పొరేషన్‌


అర్హులకే ప్రాధాన్యం

మినీ ట్రక్కులకు సంబంధించి మండలంలో పెద్దఎత్తున దరఖాస్తులు వచ్చాయి. అన్ని అర్హతలున్న వారినే ఎంపిక చేస్తాం. జిల్లా అధికారుల ఆధ్వర్యంలో ఎంపికలు నిర్వహిస్తాం. 

- బి.వెంకటరమణ, ఎంపీడీవో, ఇచ్ఛాపురం.

Advertisement
Advertisement
Advertisement