హాకీ స్టిక్‌, బాల్‌తో పెయింటింగ్‌.. ఒలింపిక్ హీరోకు నివాళి..!

ABN , First Publish Date - 2020-10-11T18:55:37+05:30 IST

అభిమానం కొంత మంది మాటల్లో చూపిస్తారు. మరికొంత మంది చేతల్లో చూపిస్తారు. చండీఘర్‌కు చెందిన ఓ కళాకారుడు కూడా అలాంటి పనే చేశాడు. తనకెంతో ఇష్టమైన హాకీ హీరోపై అభిమానాన్ని ఓ భారీ పెయింటింగ్...

హాకీ స్టిక్‌, బాల్‌తో పెయింటింగ్‌.. ఒలింపిక్ హీరోకు నివాళి..!

అభిమానం కొంత మంది మాటల్లో చూపిస్తారు. మరికొంత మంది చేతల్లో చూపిస్తారు. చండీఘర్‌కు చెందిన ఓ కళాకారుడు కూడా అలాంటి పనే చేశాడు. తనకెంతో ఇష్టమైన హాకీ హీరోపై అభిమానాన్ని ఓ భారీ పెయింటింగ్‌ వేసి ప్రకటించుకున్నాడు. అంతేకాదు ఆ పెయింటింగ్‌ వేసేందుకు కుంచెకు బదులు హాకీ స్టిక్‌, బాల్‌ను ఉపయోగించాడు. బంతిని ఇంకులో ముంచి దానిని క్యాన్వాస్‌పై పెట్టి హాకీ స్టిక్‌తో కదిలిస్తూ అద్భుతమైన చిత్రాన్ని గీశాడు.


సర్దార్‌ బల్‌బీర్‌ సింగ్‌ సీనియర్‌.. హాకీలో ఒకప్పుడు అద్భుతమైన ఆటగాడు. ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సైతం సాధించి దేశం గర్వించేలా చేశారు. ఆయన ఈ ఏడాది ఫిబ్రవరి 28న దివంగతులయ్యారు. ఆయనకు చండీఘర్‌లో ఓ యువ అభిమాని ఉన్నాడు. బల్‌బీర్‌ సింగ్‌ అంటే అతడికి వల్లమాలిన అభిమానం. ఈ నేపథ్యంలో తన అభిమాన క్రీడాకారుడి జయంతి సందర్భంగా గొప్పగా నివాళి అర్పించాలనుకున్నాడు. అలాగే హాకీపై యువతకు అవగాహన కల్పించాలనుకున్నాడు. స్వతహాగా చిత్రకారుడు కావడంతో తన చిత్రం ద్వారానే హాకీ గొప్పతనం గురించి, ఒకప్పటి లెజెండరీ హాకీ ఆటగాడు బల్‌బీర్‌ సింగ్‌ సీనియర్‌ గురించి నేటి ప్రపంచానికి చెప్పాలనుకున్నాడు. అనుకున్నదే ఆలస్యంగా.. ఓ భారీ సైజు కాన్వాస్‌ను తీసుకుని దానిపై ఇంకుతో బల్‌బీర్‌ సింగ్‌ బొమ్మ గీయడం ప్రారంభించాడు. కానీ ఏదైనా వినూత్నంగా చేస్తేనే కదా అందరికీ తన ఇంటెన్షన్‌ తెలిసేది. అదే అతడు కూడా చేశాడు.


అందరూ గ్రౌండ్‌లో హాకీ ఆడుతుంటారు. కానీ అతడు మాత్రం పెయింటింగ్‌ కాన్వాస్‌పై హాకీ ఆడాడు. అందులోనూ కళాకారుడు కదా.. హాకీ ఆడుతూనే అద్భుతమైన పెయింటింగ్‌ వేశాడు. బల్‌బీర్‌ సింగ్‌ చిత్రాన్ని 23x15 అడుగుల కాన్వాస్‌పై గీశాడు. ఈ చిత్రం గీసేందుకు అతడికి దాదాపు 10రోజులకు పైగా సమయం పట్టింది. అయినా పట్టువదలకుండా చిత్రన్ని పూర్తి చేశాడు. తన అభిమాన హాకీ హీరోకు ఘనంగా నివాళి అర్పించాడు. తన హీరో గురించి అందరికీ తెలిసేలా చేశాడు. ఇతడి ప్రతిభను ఆంధ్రజ్యోతి మనస్ఫూర్తిగా ప్రశంసిస్తోంది. అలాగే లెజెండరీ హాకీ ప్లేయర్‌ బల్‌బీర్‌ సింగ్‌కు శిరస్సు వంచి నివాళులర్పిస్తోంది.

Updated Date - 2020-10-11T18:55:37+05:30 IST