CM KCR: కేంద్ర దర్యాప్తు సంస్థలపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు.. మీ దగ్గరకు కూడా వచ్చే ఛాన్స్ ఉందంటూ..

ABN , First Publish Date - 2022-09-04T01:54:45+05:30 IST

టీఆర్ఎస్‌ఎల్పీ (TRSLP) సమావేశంలో సీఎం కేసీఆర్‌ (CM KCR) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈడీ, సీబీఐ (CD CBI) కి భయపడాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.

CM KCR: కేంద్ర దర్యాప్తు సంస్థలపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు.. మీ దగ్గరకు కూడా వచ్చే ఛాన్స్ ఉందంటూ..

హైదరాబాద్‌: టీఆర్ఎస్‌ఎల్పీ (TRSLP) సమావేశంలో సీఎం కేసీఆర్‌ (CM KCR) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈడీ, సీబీఐ (ED CBI) కి భయపడాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు అనవసరంగా ఇష్యూ చేస్తున్నాయని దుయ్యబట్టారు. ‘‘సీబీఐతో మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. మీ దగ్గరకు కూడా వచ్చే ప్రమాదం ఉంది. మహారాష్ట్ర (Maharashtra)లో శివసేన మాదిరిగా ఇక్కడా చేయాలని చూస్తారు. ఈడీ, సీబీఐ బెదిరింపులకు ఎవరూ భయపడొద్దు. సీబీఐ, ఈడీ, ఐటీ సంస్థలు మనపై పడతాయి. వాళ్లకు అవకాశం ఇచ్చే పనులు చేయవద్దు. అన్నిటికీ సిద్ధంగా ఉండాలి. సీబీఐ విచారణల విషయంలో రాష్ట్రాల అనుమతి.. తప్పనిసరి చేసేలా కేంద్రంపై ఒత్తిడి చేద్దాం. అవసరమైతే న్యాయపోరాటం చేద్దాం’’ అని కేసీఆర్ పిలుపునిచ్చారు. 


కేంద్రం తీరుపై టీఆర్ఎస్‌ఎల్పీ సమావేశంలో కేసీఆర్ మండిపడ్డారు. కేంద్రమంత్రుల దండయాత్ర మరింత పెరుగుతుందన్నారు. రాష్ట్ర మంత్రులు అలసత్వంతో ఉండొద్దని సూచించారు. బీజేపీ ఇతర రాష్ట్రాల్లో చేసినట్లు.. ఇక్కడ చేద్దామనుకుంటే కుదరదని హెచ్చరించారు. బీజేపీ (BJP) మత రాజకీయాలు చేస్తోందని దుయ్యబట్టారు. బీజేపీ దుష్ప్రచారాన్ని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని కేసీఆర్‌ పిలుపునిచ్చారు.


రాష్ట్రాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ కార్యకలాపాలకు ఇచ్చిన సాధారణ సమ్మతిని రద్దు చేయాలని దేశంలోని అన్ని రాష్ట్రాలకు బిహార్‌ వేదికగా పిలుపునిచ్చిన కేసీఆర్‌ రాష్ట్రంలోనూ సీబీఐని అడ్డుకొనే దిశగా పావులు కదుపుతున్నారు. కొద్ది రోజులుగా తెలంగాణలో ఐటీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థల దూకుడు కొనసాగుతోంది. దానికితోడు కేసీఆర్‌ జైలుకు పోవుడు ఖాయమంటూ రాష్ట్ర బీజేపీ నాయకులు అవకాశం దొరికిన ప్రతిసారీ వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సాధారణ సమ్మతిని ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అందులో భాగంగానే పశ్చిమ బెంగాల్‌, బిహార్‌ తరహాలో తెలంగాణలోనూ సీబీఐకి ‘నో ఎంట్రీ’ చెప్పేందుకు సిద్ధమవుతోంది. సీబీఐ దర్యాప్తునకు తెలంగాణ ప్రభుత్వం ఇదివరకు ఇచ్చిన సాధారణ సమ్మతిని ఉపసంహరించుకునేందుకు ఇప్పటికే న్యాయ నిపుణులు, అధికారులతో ప్రభుత్వం చర్చించినట్లు తెలిసింది. ‘సమ్మతి’ ఉపసంహరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే అధికారిక ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలిసింది.

Updated Date - 2022-09-04T01:54:45+05:30 IST