తాండూరులో కారుచిచ్చు

ABN , First Publish Date - 2022-04-28T05:30:00+05:30 IST

వికారాబాద్‌ జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. అధికార పార్టీలో గ్రూపు రాజకీయాలకు తాండూరు వేదికగా నిలిచింది. కొంత కాలంగా తాండూరు ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ, మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి మధ్య వివాదం ముదిరి పాకాన పడుతోంది.

తాండూరులో కారుచిచ్చు

  • టీఆర్‌ఎ్‌సలో నేతల గ్రూపువార్‌
  • అయోమయంలో పార్టీ క్యాడర్‌
  • ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే మధ్య మరింతగా ఆధిపత్య పోరు
  • కేటీఆర్‌ను వేర్వేరుగా కలిసిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే

వికారాబాద్‌ జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. అధికార పార్టీలో గ్రూపు రాజకీయాలకు తాండూరు వేదికగా నిలిచింది. కొంత కాలంగా తాండూరు ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ, మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి మధ్య వివాదం ముదిరి పాకాన పడుతోంది. తాండూరులో పట్టు పెంచుకునేందుకు ఎవరి ప్లాన్‌లో వారున్నారు. వీరి మధ్య జరుగుతున్న పోరాటంలో కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. వీరి పోరాటంలో కిందిస్థాయి కార్యకర్తలు కూడా రెండు గ్రూపులుగా విడిపోయారు. ఇది పార్టీకి నష్టాన్ని తెచ్చి పెడుతుందేమోనని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.

తాండూరు, ఏప్రిల్‌, 28: తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి మధ్య వివాదం మరోసారి భగ్గుమంది. వీరిద్దరి మధ్య గ్రూపు రాజకీయాలు సద్దుమణగడం లేదు. వీరి పంచాయితీ టీఆర్‌ఎస్‌ అధిష్టానానికి కూడా తలనొప్పులు తెచ్చిపెడుతోంది. తాండూరు టీఆర్‌ఎ్‌సలో జరుగుతున్న పరిణామాలపై సీఎం, కేటీఆర్‌ గట్టిగా మందలించకపోవడం వల్లే ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి మధ్య గ్రూపు తగాదాలు మరింత రెచ్చిపోయాయన్న ప్రచారం పార్టీ కార్యకర్తల్లో వినిపిస్తోంది. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డిలలో ఒకరికి కేసీఆర్‌, మరొకరికి కేటీఆర్‌ అండదండలున్నాయని, ఇక్కడి పరిణామాలను ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు కేటీఆర్‌ను వేర్వేరుగా కలిసి వివరిస్తున్నా అధిష్టానం వాటిని తేలిగ్గా తీసుకుంటోందని, వారిని గట్టిగా మందలించకపోవడం వల్లే వారిద్దరి మధ్య మళ్లీ మళ్లీ విభేదాలు పొడచూపుతున్నాయనే భావన ఇక్కడి క్యాడర్‌లో నెలకొంది. ఇదే పరిస్థితి కొనసాగితే పార్టీకి నష్టమేనని కార్యకర్తలు ఆందోళనకు గురవుతున్నారు. ఇటీవలి కాలంలో ఈ ఇద్దరు నేతల మధ్య వర్గపోరు మరింతగా పెరిగింది. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి కలిసి ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పటికీ అక్కడ వారి అనుచరులు ఏదో అంశంపై గొడవ పడుతూ పార్టీ పరువును రచ్చకీడుస్తున్నారు. గతంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన మంత్రి సబితారెడ్డి సమక్షంలోనే ఇరువర్గాలు గొడవ పడ్డారు. అటు మంత్రి కానీ, జిల్లా పార్టీ అధ్యక్షుడు కానీ వీరి వ్యవహారాన్ని చక్కబెట్టే ప్రయత్నాలు చేయలేదు. గతంలో రోహిత్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి టీఆర్‌ఎ్‌సలో కొనసాగారు. అయితే అప్పట్లో మహేందర్‌రెడ్డికి వ్యతిరేకంగా అప్పటి ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో కలిసి రోహిత్‌రెడ్డి ధర్నాలో పాల్గొనడంతో రోహిత్‌రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. తర్వాత రోహిత్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరి మహేందర్‌రెడ్డిపై ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత రోహిత్‌రెడ్డి టీఆర్‌ఎ్‌సలో చేరడంతో అప్పటి నుంచి ఇద్దరి మధ్య వర్గ విభేదాలు ముదిరిపోయాయి. కొన్ని నెలలపాటు ఇరువురు కలిసి పనిచేసినప్పటికీ తర్వాత ఇద్దరి మధ్య పరస్పర విమర్శలు, అనుచర వర్గాల అత్యుత్సాహంతో పార్టీలో విభేదాలు ముదిరిపోయాయి. 


  • అధికారుల ప్రొటోకాల్‌ చిచ్చు

ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల విషయాల్లో అధికారులు ప్రొటోకాల్‌ ప్రకారం వ్యవహరించడం లేదన్న విమర్శలున్నాయి. తాండూరు పట్టణం భావిగి భద్రేశ్వరస్వామి జాతరలో ఎండోమెంట్‌ ఈవో ప్రొటోకాల్‌ ప్రకారం వ్యవహరించి ఉంటే ఈ సమస్య తలెత్తేది కాదన్న వాదన వినిపిస్తోంది. రెండు రోజుల క్రితం బషీరాబాద్‌ మండలంలో తహసీల్దార్‌ కార్యాలయ అధికారులు ప్రొటోకాల్‌ ప్రకారం గ్రామ సర్పంచ్‌ను స్టేజీపైకి ఆహ్వానించకపోవడంతో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే వర్గీయుల మధ్య ఘర్షణకు దారితీసింది. అదేవిధంగా యాలాల మండలంలో అధికారికంగా నిర్వహించిన రంజాన్‌ కిట్ల పంపిణీ కార్యక్రమంలో వేదికపైకి పార్టీ మండలాధ్యక్షుడిని ఆహ్వానించడంతో ఎమ్మెల్సీ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఏడాది జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ వర్గానికి చెందిన పార్టీ మండల అధ్యక్షుడిని వేదికపైకి పిలిస్తే ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అతడిని వేదికపై నుంచి కిందకు దింపారు. ఇప్పుడు ఎమ్మెల్యే వర్గానికి చెందిన అధ్యక్షుడిని వేదికపైకి పిలవడంతో ఎమ్మెల్సీ దానిని ప్రశ్నించారు. దీంతో వివాదం మరింత ముదిరింది. దీనికితోడు తాండూరు మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌లు చెరో వర్గంలో ఉన్నారు. దీంతో కూడా ఇక్కడ తరచూ విభేదాలు తలెత్తుతున్నాయి. ఇటీవల తాండూరు మున్సిపల్‌ నూతన భవనాన్ని మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి చేరుకోకముందే ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి వర్గానికి చెందిన మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్వప్న ప్రార ంభించారు. ఈ వ్యవహారం కూడా వివాదాస్పదమైం ది. పెద్దేముల్‌ మండలంలో జెడ్పీ నిధులతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను ఎమ్మెల్యే లేకుండానే జెడ్పీ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి ప్రారంభించడం ఎమ్మె ల్యే వర్గానికి ఆగ్రహం తెప్పించింది. దీంతో ఆయన వర్గం కొన్నిచోట్ల సునీతారెడ్డి రావడానికి ముందుగానే శిలాఫలకాలను ధ్వంసం చేశారు.


  • ఎమ్మెల్సీపైకేసు నమోదు

రంజాన్‌ కిట్ల పంపిణీ విషయంలో ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి తనను దుర్భాషలాడారని తాండూరు పట్టణ సీఐ రాజేందర్‌రెడ్డి ఫిర్యాదు చేయడంతో తాండూరు పోలీ్‌సస్టేషన్‌లో కేసు నమోదైంది. అదే సందర్భంగా తన పట్ల కూడా దురుసుగా ప్రవర్తించి దుర్భాషలాడారని యాలాల ఎస్‌ఐ అరవింద్‌ ఫిర్యాదు మేరకు యాలాల పోలీస్‌ స్టేషన్‌లో కూడా ఎమ్మెల్సీపై కేసు నమోదైంది.


  • ఏక్‌ కుర్సీ.. దో ప్రెసిడెంట్స్‌!

యాలాల మండలంలో టీఆర్‌ఎస్‌ పార్టీ మండలాధ్యలుగా ఇద్దరు కొనసాగుతున్నారు. అందులో ఒకరు ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి వర్గానికి చెందిన మల్లారెడ్డి. అయితే, ఆయనను ఆ పదవినుంచి తప్పించినట్లు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి పేర్కొని, తన అనుచరుడైన రవీందర్‌రెడ్డిని అధ్యక్షుడిగా ప్రకటించారు. ఇందులో ట్విస్ట్‌ ఏమిటంటే గురువారం హైదరాబాద్‌లో జరిగిన పార్టీ ప్లీనరీకి ఆ ఇద్దరు అధ్యక్షులనూ ఆహ్వానించింది. దీంతో అసలు పార్టీ మండల అధ్యక్షుడు ఎవరో తెలియక కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. ఈ విషయంలో పార్టీ జిల్లా నాయకత్వం కూడా ఒక నిర్ణయం తీసుకోలేకపోతోంది. ఈ పదవి కూడా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వర్గాల మధ్య పంచాయితీకి మరింత ఆజ్యం పోస్తోంది.

Updated Date - 2022-04-28T05:30:00+05:30 IST