కౌన్సిల్‌లో ఢీ

ABN , First Publish Date - 2022-04-13T17:35:45+05:30 IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.6,150 కోట్లతో ప్రతిపాదించిన బడ్జెట్‌పై చర్చకు జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్‌

కౌన్సిల్‌లో ఢీ

బడ్జెట్‌పై చర్చ కోసం నిర్వహించిన జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ ప్రత్యేక సమావేశం రసాభాసగా మారింది. అధికార టీఆర్‌ఎస్‌, ప్రతిపక్ష బీజేపీ సభ్యుల విమర్శలు, ప్రతి విమర్శలు, దూషణలతో దద్దరిల్లింది. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. 


టీఆర్‌ఎస్‌, బీజేపీ కార్పొరేటర్ల మధ్య వార్‌

వాగ్వాదం.. తోపులాట

పోడియం ఎదుట కాషాయ పార్టీ సభ్యుల నిరసన

సమావేశంలో గందరగోళం 

రెండు పర్యాయాలు వాయిదా

వాయిదా వేసినా ఆగని వివాదం

గతంలో ఎప్పుడూ లేని విధంగా సమావేశంలో మార్షల్స్‌  

బడ్జెట్‌కు ఆమోదం


హైదరాబాద్‌ సిటీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.6,150 కోట్లతో ప్రతిపాదించిన బడ్జెట్‌పై చర్చకు జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి అధ్యక్షతన మంగళవారం ప్రత్యేక సమావేశం జరిగింది. చర్చ సమయంలో టీఆర్‌ఎస్‌ సభ్యురాలు మన్నె కవిత మాట్లాడుతూ.. నగరంలో అభివృద్ధి జోరుగా సాగుతోందని, వంతెనలు, అండర్‌పా్‌సలతో హైదరాబాద్‌ రూపురేఖలు మారాయని అన్నారు. బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎక్కడ అభివృద్ధి జరిగిందో చూపించాలన్నారు. తన ప్రసంగానికి అడ్డుతగులుతుండడంతో ‘వడ్లకు, గోధుమలకు తేడా తెలియని దౌర్భాగ్యపు పార్టీ బీజేపీ వాళ్లతో చర్చిస్తే మన ఇజ్జత్‌ పోతుంది’ అని కవిత అన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మేయర్‌ పోడియం వద్దకు వచ్చి నినాదాలు చేశారు. దీంతో పది నిమిషాలు సమావేశం వాయిదా వేస్తున్నట్టు విజయలక్ష్మి ప్రకటించారు. 


తోపులాట..

వాయిదా అనంతరం మొదలైన సమావేశంలో బీజేపీ సభ్యుడు మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ.. మ్యుటేషన్‌, క్రమబద్ధీకరణ ఆదాయం రూ.వందల కోట్లు పక్కదారి పట్టించారని ఆరోపించారు. జీహెచ్‌ఎంసీని అప్పులమయంగా మార్చారని అన్నారు. క్షేత్రస్థాయిలో సొంతంగా తిరిగే దమ్ము, ధైర్యం మీకు లేదని, ఎమ్మెల్యేలకు భయపడి బయటకు రావడం లేదని మేయర్‌నుద్దేశించి ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్‌ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కాప్రా కార్పొరేటర్‌ స్వర్ణరాజ్‌ మేయర్‌ పోడియం వద్దకు వెళ్లి మధుసూదన్‌రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు. ఈ క్రమంలో తాగుబోతుల పార్టీ కండువాలు వేసుకొని మీటింగ్‌కు వచ్చారనిపేర్కొన్నారు. దీనిపై ఆగ్రహించిన టీఆర్‌ఎస్‌ సభ్యులు క్షమాపణ చెప్పాలంటూ మధుసూదన్‌రెడ్డి వైపు దూసుకెళ్లారు. బీజేపీ కార్పొరేటర్లు కొందరు ఆయనకు అడ్డుగా నిలిచారు.


ముందు కవిత క్షమాపణ చెబితే, తాము చెబుతామని మధుసూదన్‌రెడ్డి పట్టుబట్టారు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఒకరినొకరు తోసుకుంటుండగా.. మార్షల్స్‌ ఇరువర్గాలను నిలువరించారు. ఎవరిది తాగుబోతుల పార్టీ.. అంటూ మహిళలతో సహా టీఆర్‌ఎస్‌ సభ్యులంతా బీజేపీ సభ్యుల వైపు వెళ్లారు. బీజేపీ కార్పొరేటర్‌ శ్రవణ్‌ తను కూర్చున్న చోట మైక్‌ను విరగ్గొట్టారు. పరిస్థితి చేజారుతోందని గమనించిన మేయర్‌ సభను మరోసారి వాయిదా వేశారు. అయినా టీఆర్‌ఎస్‌, బీజేపీ సభ్యుల మధ్య వాగ్వాదం ఆగలేదు.


రికార్డుల నుంచి..

సభ ప్రారంభం అనంతరం ఎమ్మెల్సీ ప్రభాకర్‌ మాట్లాడుతూ.. సమావేశంలో ఇలాంటి వ్యాఖ్యలు బాధాకరమని, ఏ పార్టీ వారై నా హుందాగా వ్యవహరించాలని సూచించారు. పవిత్రమైన కౌన్సిల్‌ను రాజకీయ వేదికగా మార్చవద్దని, సభ ప్రతిష్ఠ దిగజార్చేలా వ్యవహరించ వద్దని హితవు పలికారు. సభ్యుల వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని కోరారు. స్పందించిన మేయర్‌.. సభ్యుల వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించారు. అనంతరం అంతకుముందు సభ్యులు అడిగిన ప్రశ్నలకు కమిషనర్‌ లోకే్‌షకుమార్‌ సుదీర్ఘంగా సమాధానమిచ్చారు. అనంతరం బడ్జెట్‌ను ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నట్టు పేర్కొన్న మేయర్‌.. సమావేశం ముగిసిందని ప్రకటించారు. 


50 మంది మార్షల్స్‌

ప్రతిపక్ష పార్టీల సభ్యుల సంఖ్య గణనీయ స్థాయిలో ఉన్న నేపథ్యంలో అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా దాదాపు 50 మంది మార్షల్స్‌ను నియమించారు. 11 మంది మహిళా కానిస్టేబుళ్లు, 18 మంది వివిధ పోలీస్‌ స్టేషన్లలోని కానిస్టేబుళ్లతోపాటు.. ఈవీడీఎం ఉద్యోగులు 20 మందికిపైగా మార్షల్స్‌గా విధులు నిర్వర్తించారు. కౌన్సిల్‌లో బీజేపీకి 47 మంది సభ్యుల బలం ఉండడంతో పలు అంశాలపై చర్చ సందర్భంలో వాగ్వాదాలు జరుగుతాయనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఓ అధికారి చెప్పారు. 

Updated Date - 2022-04-13T17:35:45+05:30 IST