కులాల పేరుతో హిందువుల మధ్య చిచ్చు: విజయశాంతి

ABN , First Publish Date - 2022-03-03T00:31:03+05:30 IST

తెలంగాణలో బీజేపీని అప్రతిష్టపాలు చెయ్యడానికి అధికార టీఆరెస్ నానా పాట్లు పడుతోంది. వర్గ విభేదాలు పక్కనపెట్టి, కులాలకు అతీతంగా ఐక్యమవుతున్న హిందువుల మధ్య కుల చిచ్చు పెట్టి విడగొట్టేందుకు సోషల్ మీడియాని ఆధారంగా చేసుకుని కుట్రలు మొదలయ్యాయి. రాజకీయ వ్యూహాల్లో ఆరితేరిపోయినట్టు గొప్పలు చెప్పుకునే అధికార పార్టీ ఇప్పుడు..

కులాల పేరుతో హిందువుల మధ్య చిచ్చు: విజయశాంతి

హైదరాబాద్: హిందువుల మధ్య కుల చిచ్చు పెట్టి వర్గ విభేదాలు సృష్టించి బీజేపీని అప్రతిష్టపాలు చెయ్యాలని అధికార పార్టీ టీఆర్ఎస్ పని చేస్తోందని భారతీయ జనతా పార్టీ నేత విజయశాంతి అన్నారు. సోషల్ మీడియాను ఆధారం చేసుకుని ఇప్పటికే కుట్రలు ప్రారంభమయ్యాయని, ఊరు-పేరు లేని ఫేక్ ఐడీలతో కులాల మధ్య చిచ్చు పెట్టి అందుకు హిందుత్వమే కారణమని ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు.


బుధవారం సోషల్ మీడియా ద్వారా ఆమె స్పందిస్తూ..

‘‘తెలంగాణలో బీజేపీని అప్రతిష్టపాలు చెయ్యడానికి అధికార టీఆరెస్ నానా పాట్లు పడుతోంది. వర్గ విభేదాలు పక్కనపెట్టి, కులాలకు అతీతంగా ఐక్యమవుతున్న హిందువుల మధ్య కుల చిచ్చు పెట్టి విడగొట్టేందుకు సోషల్ మీడియాని ఆధారంగా చేసుకుని కుట్రలు మొదలయ్యాయి. రాజకీయ వ్యూహాల్లో ఆరితేరిపోయినట్టు గొప్పలు చెప్పుకునే అధికార పార్టీ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ సాయంతో సోషల్ మీడియాని ఆయుధంగా చేసుకుని తెలంగాణలోను, చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల్లో వివిధ సామాజిక వర్గాలు, కులాల పేర్లతో ఫేక్ ఐడీలు సృష్టించి హిందువులను చీల్చేందుకు నానా పాట్లు పడుతోంది. ఈ ఫేక్ ప్రొఫైల్స్ చూడటానికి బీజేపీకి చెందినవారివిగా అనిపిస్తాయి. ఇతర కులాలవారిపై దాడులకు దిగి రెచ్చగొడతాయి. ఇతర సామాజికవర్గాలు, కులాలను కించపరుస్తూ... కులాల మధ్య గొడవలు పెట్టి... అందుకు హిందుత్వమే కారణమంటూ బీజేపీపై నిందలు మోపే ప్రయత్నం గట్టిగా జరుగుతోంది. అందువల్ల ఊరు-పేరు లేని ఫేక్ ఐడీల పట్ల జాగ్రత్త వహించాలని కోరుతున్నాను.


మరోవైపు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ దేశాన్ని విచ్ఛిన్నం చేసే పని మొదలుపెట్టింది. కాశ్మీర్‌ని యూపీ, గుజరాత్ బ్యూరోక్రాట్లు పాలిస్తున్నారని... పంజాబ్‌లో 100 కిమీ ప్రాంతాన్ని సైన్యానికి అప్పగించేశారని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తున్నారు. దేశాన్ని కాపాడే సైన్యం పట్ల ప్రజల్లో విద్వేషాలు రగిలిస్తున్నారు. అసలు కాశ్మీరంలో నేడున్న పరిస్థితికి కారణం దేశాన్ని దశాబ్దాల పాటు ఏలిన కాంగ్రెస్ పార్టీ కాదా? సంక్షుభిత ఉక్రెయిన్ నుంచి విరామం లేకుండా భారతీయ విద్యార్థులను క్షేమంగా రప్పించేందుకు కేంద్రం చేస్తున్న కృషిని ప్రజలు మెచ్చుకుంటుంటే చూడలేక బురదజల్లుతున్నారు. బీజేపీని అపఖ్యాతి పాలు చెయ్యాలని ఎవరెన్ని పథకాలు వేసినా... ప్రజలకు నిజం తెలుసు’’ అని రాసుకొచ్చారు.

Updated Date - 2022-03-03T00:31:03+05:30 IST