చార్టెడ్‌ ఫ్లైట్‌ కొనుగోలు చేయనున్న టీఆర్‌ఎస్‌.. విరాళాలు ఇచ్చేందుకు పోటీ పడుతున్న టీఆర్‌ఎస్ నేతలు

ABN , First Publish Date - 2022-09-30T00:02:14+05:30 IST

త్వరలో టీఆర్‌ఎస్ (TRS) చార్టెడ్‌ ఫ్లైట్‌ కొనుగోలు చేయనుంది. అక్టోబర్‌ 5న జాతీయ పార్టీ ప్రకటన తర్వాత ఆర్డర్‌ చేయనున్నారు.

చార్టెడ్‌ ఫ్లైట్‌ కొనుగోలు చేయనున్న టీఆర్‌ఎస్‌.. విరాళాలు ఇచ్చేందుకు పోటీ పడుతున్న టీఆర్‌ఎస్ నేతలు

హైదరాబాద్: త్వరలో టీఆర్‌ఎస్ (TRS) చార్టెడ్‌ ఫ్లైట్‌ కొనుగోలు చేయనుంది. అక్టోబర్‌ 5న జాతీయ పార్టీ ప్రకటన తర్వాత ఆర్డర్‌ చేయనున్నారు. దేశవ్యాప్తంగా పర్యటనల కోసం సీఎం కేసీఆర్‌ ఏర్పాట్లు చేస్తున్నారు. రూ.80 కోట్లతో 12 సీట్ల సామర్థ్యం గల చార్టెడ్‌ ఫ్లైట్‌ కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఫ్లైట్‌ కోసం మొత్తాన్ని విరాళాల ద్వారా నిధులను సమీకరించాలని టీఆర్‌ఎస్‌ నేతలు నిర్ణయం తీసుకున్నారు. టీఆర్ఎస్‌ పార్టీ ఖజానాలో ఇప్పటికే రూ.865 కోట్ల ఫండ్స్‌ ఉన్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. విమానానికి విరాళాలు ఇచ్చేందుకు టీఆర్ఎస్‌ నేతల పోటీ పడుతున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగి  ఫ్లైట్‌ కొనుగోలు చేస్తే.. సొంత విమానం ఉన్న పార్టీగా త్వరలోనే టీఆర్ఎస్‌కు గుర్తింపు పొందనుంది. 


దేశ రాజకీయాల్లోకి గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చేందుకు కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. ముందునుంచీ అనుకుంటున్నట్లుగానే అక్టోబరు 5న దసరా పండుగ రోజే ఆయన నూతన రాజకీయ పార్టీని ప్రకటించనున్నారు. పార్టీ శాసనసభాపక్ష సమావేశం, ముఖ్యనేతల సమావేశం కూడా అదే రోజు నిర్వహించనున్నట్లు సమాచారం. ఆ సమావేశాల్లో అందరికీ తన ఉద్దేశాలను కేసీఆర్‌ వివరించి అనంతరం నూతన పార్టీని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. బుధవారం మధ్యాహ్నం 1:19 గంటలకు జాతీయ పార్టీ ప్రకటన ఉంటుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కొందరు జాతీయ పార్టీ నాయకులు, లేదంటే ఇతర రాష్ట్రాలకు చెందిన నేతలు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నట్లు తెలిసింది. 


పార్టీ పేరు, జెండా, అజెండాల పైనా కసరత్తు పూర్తయిందని సమాచారం. పార్టీ పేరును మాత్రం గోప్యంగా ఉంచుతున్నారు. ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) పేరుకు దగ్గరగా ఉండేలా భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) అనే పేరు పెడతారని అంటున్నారు. ‘నవభారత్‌ పార్టీ’ కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు పార్టీ జెండా గులాబీ రంగులో ఉంటుందని, భారతదేశ మ్యాప్‌ కూడా ఉండేలా రూపొందించారని సమాచారం. అజెండా విషయానికి వస్తే.. సంక్షేమం, సహకార సమాఖ్య ప్రధాన అంశాలుగా ఉండనున్నట్లు తెలిసింది. 

Updated Date - 2022-09-30T00:02:14+05:30 IST