Abn logo
Sep 27 2021 @ 01:03AM

రైతులపై ప్రేమ ఉంటే భారత్‌ బంద్‌లో టీఆర్‌ఎస్‌ పాల్గొనాలి

వేములవాడలో విలేకరులతో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

- కేంద్ర వ్యవసాయ చట్టాలపై టీఆర్‌ఎస్‌ రెండు నాల్కల ధోరణి

- శాంతియుత నిరసనకు పోలీసులు సహకరించాలి

- ఎమ్మెల్సీ టీ జీవన్‌రెడ్డి

వేములవాడ, సెప్టెంబరు 26 : రైతులపై టీఆర్‌ఎస్‌ నాయకులకు నిజమైన ప్రేమ ఉంటే ఈ నెల 27వ తేదీన అఖిలపక్షం తలపెట్టిన భారత్‌ బంద్‌ కార్యక్రమంలో పాల్గొనాలని శాసనమండలి సభ్యుడు తాటిపర్తి జీవన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో కాంగ్రెస్‌ నేత ఆది శ్రీనివాస్‌ నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.  కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ 27వ తేదీన అఖిలపక్షం ఇచ్చిన భారత్‌ బంద్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. పంటకు కనీస మద్దతు ధర నిబంధన ఉండడంతో ప్రతీ రైతు పండించిన పంటకు కనీస లాభానికి విక్రయించుకునే పరిస్థితి ఉండేదని, ఈ నిబంధనను కొత్త వ్యవసాయ చట్టాలలో ఎత్తివేయడంతో రైతులు దళారులకు పంటను తక్కువ ధరకు విక్రయించే పరిస్థితి ఏర్పడతుందని అన్నారు. దీనికి తోడు ఎస్సెన్షియల్‌ కమోడిటీస్‌ యాక్ట్‌లో ఉన్న ఆహార ధాన్యాల నిల్వ నిబంధనను ఎత్తివేయడంతో ఇకపై డబ్బున్న దళారులు రైతు వద్ద పంటను తక్కువ ధరకు కొనుగోలు చేసి భారీ ఎత్తున నిల్వ చేసి కృత్రిమ కొరత సృష్టించడం ద్వారా ధరలు పెంచుతాడని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి  వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ గత డిసెంబరు 8వ తేదీన కేటీఆర్‌తో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు ఆందోళనలో పాల్గొన్నారని, కానీ ఇటీవల కాలంలో కేసీఆర్‌ ఢిల్లీ పర్యటన అనంతరం బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. రైతులకు భారం, బాధ కలిగించే విధానాలను వ్యతిరేకించాల్సిన సీఎం కేసీఆర్‌ ఇప్పటికైనా తన విధానాన్ని స్పష్టం చేసి పార్టీ నాయకత్వానికి దిశా నిర్దేశం చేయాలన్నారు. అఖిల పక్షం బంద్‌లో పాల్గొనాలని, తద్వారా రైతులపై నిజమైన ప్రేమను చాటుకోవాలని కోరారు.    కొంతకాలంగా రాష్ట్రంలో రుణమాఫీ చేయడం లేదని, ప్రతీ సమస్యకు రైతుబంధు ఒక్కటే మందు కాదని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గకుండా టీఆర్‌ఎస్‌ సహా అన్ని పార్టీలు అఖిలపక్షం బంద్‌లో పాల్గొనాలని కోరారు. పోలీసులు సైతం గత డిసెంబరు 8న టీఆర్‌ఎస్‌ నేతలు పాల్గొన్న బంద్‌కు సహకరించినట్లుగా తమ బంద్‌కు సహకరించాలన్నారు. తాము శాంతియుతంగా బంద్‌ నిర్వహిస్తామని, వ్యాపార వాణిజ్యవర్గాలు బంద్‌లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.   ఈ సమావేశంలో పీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్‌, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ, పట్టణ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి, పాత సత్యలక్ష్మి, చిలుక రమేశ్‌, మూడికె చంద్రశేఖర్‌, నాగుల విష్ణుప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.