టీఆర్‌ఎస్‌ సెల్ఫ్‌ గోల్‌!

ABN , First Publish Date - 2020-12-05T09:11:32+05:30 IST

టీఆర్‌ఎస్‌ సెల్ఫ్‌ గోల్‌ చేసుకుందా ? మొన్న దుబ్బాక, ఇవాళ గ్రేటర్‌.. రెండు చోట్లా స్వయంకృతాపరాధమే దెబ్బ తీసిందా ?..

టీఆర్‌ఎస్‌ సెల్ఫ్‌ గోల్‌!

మొన్న ఓటమి..ఇవాళ అరకొరగెలుపు..

వ్యతిరేకతను పసిగట్టలేకపోయిన నాయకత్వం..

సర్వేలపైనే నమ్మకం

హైదరాబాద్‌, డిసెంబరు4 (ఆంధ్రజ్యోతి): టీఆర్‌ఎస్‌ సెల్ఫ్‌ గోల్‌ చేసుకుందా ? మొన్న దుబ్బాక, ఇవాళ గ్రేటర్‌.. రెండు చోట్లా స్వయంకృతాపరాధమే దెబ్బ తీసిందా ?..ఈ ప్రశ్నలకు టీఆర్‌ఎస్‌ వర్గాల నుంచి అవుననే సమాధానాలు వస్తున్నాయి. రాష్ట్రంలో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే రాజకీయంగా ఒడిదుడుకులు చవిచూస్తుండటంపై పార్టీ ముఖ్యులు అంతర్మథనంలో పడ్డారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 88 స్థానాలతో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌.. పరిషత్‌, మునిసిపల్‌ ఎన్నికల్లోనూ తిరుగులేని విజయాలను నమోదు చేసుకుంది. 


  లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం 16 చోట్ల గెలుపొందాలని లక్ష్యంగా పెట్టుకొని, తొమ్మిది చోట్లనే గెలిచింది.  హుజూర్‌నగర్‌ అసెంబ్లీ ఉప ఎన్నికలో విజయం సాధించినప్పటికీ, ఇటీవలి దుబ్బాక ఉప ఎన్నికలో ఓడిపోయింది. ఇప్పుడు జీహెచ్‌ఎంసీలో అతి పెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, అరకొర సీట్లు సాధించటం అధికార పార్టీగా టీఆర్‌ఎస్‌కు రాజకీయ తలవంపుగా మారింది. ఇందుకు దారితీసిన పరిస్థితులపై పలువురు పార్టీ సీనియర్లు ఒక అంచనాకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కారుపై తమ అధినేత కయ్యానికి కాలు దువ్వుతున్న పరిస్థితుల్లో అదే పార్టీ నుంచి దుబ్బాక, గ్రేటర్‌లోనూ సవాల్‌ ఎదురుకావటాన్ని వారు తీవ్రంగా పరిగణిస్తున్నారు. త


మపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతే బీజేపీకి మేలు చేసిందనే అభిప్రాయాలను టీఆర్‌ఎస్‌ వర్గాలు వ్యక్తంచేస్తున్నాయి. అంతేకాక అటు దుబ్బాక, ఇటు గ్రేటర్‌లో అభివృద్ధి అజెండాతో ముందుకెళ్లిన తమను, మతం ప్రాతిపదికన బీజేపీ విద్వేషాలు రెచ్చగొట్టటం ఇరుకున పెట్టిందని భావిస్తున్నాయి. మజ్లిస్‌తో స్నేహ సంబంధాలు కూడా నష్టం కలిగించాయని అభిప్రాయపడుతున్నాయి.

ప్రత్యేకించి గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో మతం చుట్టూ బీజేపీ, మజ్లిస్‌ చేసిన విమర్శల ఽధాటిని టీఆర్‌ఎస్‌ సమర్థంగా ఎదుర్కోలేకపోయిందని భావిస్తున్నాయి. ముస్లిం మైనార్టీలకు చేరువయ్యామనే ముద్రను చెరిపేసుకొని, హిందువులకు దగ్గరయ్యే ప్రయత్నాలు కూడా ఫలించలేదని అంటున్నాయి. 


పల్లె, పట్నం తేడా లేకుండా..

 మొదటి నుంచి గులాబీ దళానికి పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే పట్టు ఎక్కువ. పైగా రైతు సంక్షేమ పథకాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువగానే అమలు చేస్తోంది. అయినప్పటికీ గ్రామీణ ప్రాంతాలున్న దుబ్బాకలో టీఆర్‌ఎస్‌ ఓడింది. దీనికి ప్రత్యేక పరిస్థితులే కారణమని పార్టీ ముఖ్యులు సర్దిచెప్పుకొన్నారు. అయితే, ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, పార్టీలో అంతర్గతంగా నెలకొన్న అసంతృప్తిని సకాలంలో గుర్తించి, తగ్గించలేకపోవటమే వరుస ప్రతికూల ఫలితాలకు కారణమని కొందరు ముఖ్య నేతలు తాజాగా అభిప్రాయపడుతున్నారు.


కొన్ని ప్రైవేటు సర్వే సంస్థలు, పోలీసు నిఘా విభాగం ఇచ్చే నివేదికలపైనే పూర్తిగా ఆధారపడి, క్షేత్రస్థాయిలో అసలు ఏమి జరుగుతున్నదో పట్టించుకోకపోవడం పార్టీని దెబ్బ తీసిందని చెబుతున్నారు. ఉద్యోగులు, యువత, నిరుద్యోగులు వివిధ వర్గాలు ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉన్నారనే వాదన బలంగా ఉంది. అయినా వారి సమస్యలను పరిష్కరించటంపై ప్రభుత్వంగా దృష్టి పెట్టకపోవటం నష్టం చేసిందని అంటున్నారు. అలాగే ఎల్‌ఆర్‌ఎస్‌, ఆస్తుల నమోదు కోసం కొత్తగా ధరణి వెబ్‌సైట్‌ తీసుకురావటం, ఈ పేరుతో నెలల తరబడి రిజిస్ట్రేషన్లు నిలిపివేయటంపై క్షేత్రస్థాయిలో సానుకూలత లేదని తాజా ఎన్నికల ఫలితాలతో అర్థం చేసుకోవాల్సి వస్తోందని చెబుతున్నారు.


సన్న వడ్లు సాగు చేయాలని రైతులకు చెప్పి, కొనుగోళ్లు చేపట్టకపోవటం, రైతుబంధు నిధులు సకాలంలో బ్యాంకు ఖాతాల్లో జమ చేయకపోవటం కూడా ప్రభావం చూపి ఉంటాయని అంటున్నారు. హైదరాబాద్‌లో భారీ వర్షాల వల్ల మౌలిక వసతులు దెబ్బతినటం, వాటి పునరుద్ధరణ ఆలస్యం కావటం ప్రభుత్వంపై ఉన్న ఫీల్‌గుడ్‌ వాతావరణాన్ని దెబ్బ తీసిందని చెబుతున్నారు.

పైగా దుబ్బాక ఓటమి ప్రభావం గ్రేటర్‌ ఎన్నికల్లోనూ పడిందని అంటున్నారు. వీటి నుంచి అధిష్ఠానం, ప్రభుత్వం పాఠాలు నేర్చుకుని, దిద్దుబాటు చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నామని పార్టీ నేతలు అంటున్నారు.


Updated Date - 2020-12-05T09:11:32+05:30 IST