టీఆర్‌ఎస్‌ రచ్చరచ్చ..!

ABN , First Publish Date - 2022-07-04T08:29:44+05:30 IST

బీజేపీ అన్నా.. ప్రధాని మోదీ అన్నా.. నిప్పులు కురిపిస్తున్న టీఆర్‌ఎస్‌.. ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల వేళ రచ్చరచ్చ చేసింది.

టీఆర్‌ఎస్‌ రచ్చరచ్చ..!

  • బీజేపీ సమావేశాల నేపథ్యంలో డైరెక్ట్‌ అటాక్‌
  • సభవైపు చొచ్చుకెళ్లేందుకు కార్యకర్తల యత్నం
  • మోదీ వ్యతిరేక నినాదాలు.. గ్రౌండ్‌ వద్ద ఫ్లెక్సీలు
  • బీజేపీ సమావేశంలో టీఎస్‌ ఇంటెలిజెన్స్‌ ఎస్సై


హైదరాబాద్‌/సిటీ, జూలై 3 (ఆంధ్రజ్యోతి): బీజేపీ అన్నా.. ప్రధాని మోదీ అన్నా.. నిప్పులు కురిపిస్తున్న టీఆర్‌ఎస్‌.. ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల వేళ రచ్చరచ్చ చేసింది.  అడుగడుగునా పరోక్ష/ప్రత్యక్ష రగడకు దిగింది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల యుద్ధం ఇప్పుడే మొదలైందన్నట్లుగా సంకేతాలు ఇచ్చింది. ‘మా రాజ్యం.. మా ఇష్టం..’ అన్నట్లుగా ఫ్లెక్సీల రాజకీయాలు మొదలు.. సోషల్‌ మీడియా వార్‌ దాకా.. అన్ని రకాలుగా పరిధులు దాటి ‘ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధం’ అన్నట్లు వ్యవహరించింది. బీజేపీపై తన పైచేయిని చూపించుకునేందుకు రూ.కోట్ల ప్రజాధనంతో పలు పత్రికలకు భారీగా ప్రకటనలు ఇచ్చింది. ఇదంతా ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఏ పార్టీ అయినా.. సమావేశాలు, సభలు, జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించుకుంటే.. ఫ్లెక్సీలు, కటౌట్లు, బ్యానర్ల ఏర్పాటు సహజం. జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో బీజేపీ నేతలు కూడా నగరంలో పెద్దఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే, మోదీ వచ్చిన రోజే.. అందుకు కౌంటర్‌గా విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాను కేసీఆర్‌ నగరానికి పిలిపించారు. ఆయనకు స్వాగతం పలుకుతూ భారీగా ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేయించారు. 


సిన్హాతో కలిసి ఏర్పాటు చేసిన సభలో.. ప్రధాని మోదీ, బీజేపీపై వాగ్బాణాలతో విరుచుకుపడ్డారు. బీజేపీ సభ జరిగిన పరేడ్‌ గ్రౌండ్‌ పరిసరాల్లో కూడా పోటాపోటీగా బీజేపీ-టీఆర్‌ఎస్‌ ఫ్లెక్సీలు వెలిశాయి. ‘మోదీ మస్ట్‌ ఆన్సర్‌’ అంటూ కేసీఆర్‌ ఫొటోతో సిన్హాకు మద్దతుగా నిర్వహించిన సమావేశంలో సీఎం సంధించిన ప్రశ్నలతో పరేడ్‌ గ్రౌండ్‌ పరిసరాల్లో ఫ్లెక్సీలు వెలిశాయి. పత్రికా ప్రకటనల విషయంలోనూ ఈ ట్రెండ్‌ కనిపించింది. కొన్ని పత్రికలకు టీఆర్‌ఎస్‌ అమలు చేస్తున్న పథకాలను పేర్కొంటూ ప్రభుత్వ యాడ్స్‌ ఇచ్చారు. ‘బైబై మోదీ’ అంటూ ఫ్లెక్సీలతో.. పరేడ్‌ గ్రౌండ్‌కు వచ్చిన వారికి స్పష్టంగా కనిపించేలా.. ఆ పరిసరాల్లో కేసీఆర్‌ ఫొటో ఉన్న బెలూన్లు ఎగురవేశారు. మరోవైపు ప్రజలు, బీజేపీలో చోటామోటా నేతలు, కార్యకర్తలు మోదీ సభకు వెళ్తున్న సమయంలో.. వారి దృష్టి మరల్చేలా స్థానిక టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కొన్ని చోట్ల ర్యాలీలు తీశారు. టీఆర్‌ఎస్‌ యూత్‌వింగ్‌ ఏకంగా పరేడ్‌గ్రౌండ్‌లోకి చొచ్చుకువెళ్లేందుకు ప్రయత్నించింది. ‘మోదీ గో బ్యాక్‌’ అంటూ నినదించింది.


సోషల్‌ మీడియాలో..

సభలో ప్రధాని మోదీ ప్రసంగం ప్రారంభమయ్యే సమయానికి ‘జుమ్లా కింగ్‌ మోదీ’ హ్యాష్‌ ట్యాగ్‌తో ట్విటర్‌లో టీఆర్‌ఎస్‌ పోస్టులు పెట్టింది. ఆదివారం ట్విటర్‌-ఇండియా ట్రెండింగ్‌లో ఇది ఒకటో ర్యాంకులో కొనసాగింది. ఆ తర్వాత బీజేపీ ఆరంభించిన ‘మోదీ ఆగయా.. కేసీఆర్‌ డర్‌గయా’ హ్యాష్‌ట్యాగ్‌తో కౌంటరు 5వ స్థానంలో ఉండడం గమనార్హం..!


టీఆర్‌ఎస్‌ పట్ల జీహెచ్‌ఎంసీ ఉదాసీనత?

హైదరాబాద్‌లో ఫ్లెక్సీలపై నిషేధం ఉన్నందున.. వాటిని ఏర్పాటు చేసిన బీజేపీ, టీఆర్‌ఎ్‌సకు  నెటిజన్ల ఫిర్యాదు మేరకు జీహెచ్‌ఎంసీ పెనాల్టీలు వేసింది. బీజేపీకి రూ. 10లక్షలకు పైగా.. టీఆర్‌ఎ్‌సకు రూ. 2 లక్షల దాకా జరిమానాలు ఉంటాయని అంచనా. టీఆర్‌ఎ్‌సపై నెటిజన్లు చేసిన చాలా ఫిర్యాదులను ‘లొకేషన్‌ సరిగాలేదు’ అని పేర్కొంటూ జీహెచ్‌ఎంసీ పక్కనపెట్టిందనే ఆరోపణలు ఉన్నాయి.


కొనసాగిన మనీ హైస్ట్‌ మానియా..!

మనీ హైస్ట్‌ మానియా ఫ్లెక్సీలు నగరంలో ఆదివారం కూడా కొనసాగాయి. పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు వెలవడంతోపాటు.. బహుళ అంతస్తుల భవనాలకు గ్రాఫిక్స్‌ జోడించి రూపొందించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో కొందరు నెటిజన్లు వైరల్‌ చేశారు. ‘‘మేము బ్యాంకులను.. మీరు దేశాన్ని’’ అని పేర్కొంటునే.. ‘‘ఉత్తరాఖండ్‌, అరుణాచల్‌ప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్ర, బిహార్‌లో జరిగింది ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు.. బై బై మోదీ’’ అంటూ ఓ బస్టాప్‌ వద్ద ఫ్లెక్సీ వెలిసింది. టీఆర్‌ఎస్‌, బీజేపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను పోలుస్తూ.. ఇక్కడ అభివృద్ధి ఉంది.. మీ ఫ్లెక్సీల్లో మొహాలు మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు. 


బీజేపీ సమావేశంలో ఇంటెలిజెన్స్‌ ఎస్సై?

నోవాటెల్‌ హోటల్‌లో ఆదివారం బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలోకి తెలంగాణ ఇంటెలిజెన్స్‌ ఎస్సై శ్రీనివాస్‌ ప్రవేశించడం తీవ్ర దుమారం రేపింది. పార్టీ విధానపర నిర్ణయాలు తీసుకుంటున్న సమయంలో.. అనుమానాస్పదంగా కనిపించిన ఎస్సైని బీజేపీ సీనియర్‌ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి ‘ఎవరు నువ్వు?’ అంటూ ప్రశ్నించారు. సమాధానం చెప్పకపోవడంతో.. గట్టిగా నిలదీశారు. ఆ తర్వాత ఆయన ఇంటెలిజెన్స్‌ ఎస్సై అని తెలుసుకుని, అనుమతి లేకుండా లోనికి వచ్చాడంటూ స్థానిక పోలీసులకు అప్పగించారు.

Updated Date - 2022-07-04T08:29:44+05:30 IST