నేటి నుంచి నిరసన పర్వం

ABN , First Publish Date - 2022-04-04T09:02:18+05:30 IST

రాష్ట్రంలో రాజకీయ పార్టీల ఆందోళన పర్వం మొదలు కాబోతోంది. అధికార, విపక్ష పార్టీలు.. ఏకకాలంలో నిరసన...

నేటి నుంచి నిరసన పర్వం

  • అధికార, విపక్షాల ఆందోళన బాట
  • కేంద్రానికి వ్యతిరేకంగా టీఆర్‌ఎస్‌ నిరసనలు
  • రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా
  • 7 నుంచి జిల్లాల్లో బీజేపీ సదస్సులు 
  • బీజేపీ, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాల విధానాలను
  • నిరసిస్తూ కాంగ్రెస్‌ ఆందోళనలూ నేడే షురూ
  • టీఆర్‌ఎస్‌ నిరసనలకు సమాంతరంగా!
  • పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదలపై
  • కేంద్రానికి వ్యతిరేకంగా సీపీఐ నిరసన బాట 


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రాజకీయ పార్టీల ఆందోళన పర్వం మొదలు కాబోతోంది. అధికార, విపక్ష పార్టీలు.. ఏకకాలంలో నిరసన బాట పడుతున్నాయి. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా అధికార టీఆర్‌ఎస్‌ తమ ఉద్యమ కార్యాచరణను సోమవారం నుంచి మొదలుపెట్టనుంది. మరోవైపు ధాన్యం కొనుగోలు అంశంతోపాటు పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా ప్రతిపక్ష కాంగ్రెస్‌ కూడా సోమవారం నుంచే నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. ఇక బీజేపీ.. ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతూ ఈ నెల 7 నుంచి జిల్లాల్లో సదస్సులు నిర్వహించనుంది. మరోవైపు గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపును నిరసిస్తూ సీపీఐ రాష్ట్ర శాఖ కూడా సోమవారం నుంచి వారంపాటు ఆందోళన కార్యక్రమాలు చేపట్టనుంది.


రాష్ట్రంలోని రైతులు పండించిన యాసంగి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసేలా ఒత్తిడి తెచ్చేందుకు అధికార టీఆర్‌ఎస్‌ ఇప్పటికే ఈ నెల 11 వరకు నిరసన కార్యాచరణను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సోమవారం అన్ని మండల కేంద్రాల్లో టీఆర్‌ఎస్‌ శ్రేణులు నిరసన దీక్షలు చేపట్టనున్నాయి. అనంతరం ఈ నెల 6న ముంబై, నాగ్‌పూర్‌, బెంగళూరు, విజయవాడజాతీయ రహదారులపై రాస్తారోకో నిర్వహించనున్నారు. 7న హైదరాబాద్‌ మినహా మిగిలిన 32 జిల్లాల కేంద్రాల్లో వేలాది మంది రైతులు, పార్టీ కార్యకర్తలతో ఆందోళనకు దిగనున్నారు. 8న రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లోనూ రైతుల ఇళ్లపై నల్లజెండాలు ఎగరేయనున్నారు. దాంతోపాటు గ్రామాల్లో ర్యాలీలు, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనాలు కూడా చేయాలని టీఆర్‌ఎస్‌ శ్రేణులకు ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపునిచ్చారు. ఇక ఈ నెల 11న ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ నిరసన దీక్ష చేపట్టనుంది. ఈ దీక్షలో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర ప్రజా ప్రతినిధులుపాల్గొననున్నారు. 


టీఆర్‌ఎ్‌సకు పోటీగా బీజేపీ సదస్సులు..

ధాన్యం కొనుగోలు విషయంలో టీఆర్‌ఎస్‌ కేంద్రాన్ని టార్గెట్‌ చేస్తుండడంతో.. దానిని తిప్పికొట్టేందుకు బీజేపీ ఈ నెల 7 నుంచి రైతు సదస్సులు నిర్వహించాలని నిర్ణయించింది. హైదరాబాద్‌ మినహా తొమ్మిది ఉమ్మడి జిల్లాల కేంద్రాల్లో ఈ సదస్సులను నిర్వహించనుంది. రాష్ట్రం నుంచి ముడి బియ్యాన్ని ఎంత ఇచ్చినా తీసుకుంటామంటూ కేంద్రం పలుమార్లు ప్రకటించిన విషయాన్ని, కేంద్రానికి ఉప్పుడు బియ్యం ఇవ్వబోమంటూ రాష్ట్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా తెలియజేసిన అంశాన్ని ఈ సదస్సుల్లో రైతులకు వివరించనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. ఏ రాష్ట్రంలోనూ లేని సమస్య ఈ రాష్ట్రంలోనే ఎందుకుందన్నదీ వివరిస్తామని పేర్కొన్నాయి. ఈ నెల 7 నుంచి మూడు రోజులపాటు ఈ సదస్సులు జరగనున్నట్లు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 


రెండు అధికార పార్టీలు టార్గెట్‌గా టీపీసీసీ..

ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌ సర్కారు రైతులను మోసం చేస్తున్నాయంటూ ఆరోపిస్తున్న కాంగ్రెస్‌.. ఈ రెండు పార్టీలకు వ్యతిరేకంగా నిరసనలకు దిగుతోంది. దీంతోపాటు గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపైనా టీపీసీసీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టనుంది. సరిగ్గా టీఆర్‌ఎస్‌ నిరసనలు చేపట్టే రోజుల్లోనే కాంగ్రెస్‌ కార్యక్రమాలు కూడా ఉండనున్నాయి. ఇందులో భాగంగా సోమవారం రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో అంబేడ్కర్‌ విగ్రహాల వద్ద కాంగ్రెస్‌ శ్రేణులు నిరసనకు దిగనున్నాయి. అనంతరం ఈ నెల 6న అన్ని కలెక్టరేట్ల ఎదుట ధర్నా చేయనున్నారు. 7న విద్యుత్‌ చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ విద్యుత్‌ సౌధను, ధాన్యం కొనుగోళ్లు, ధరల పెంపును నిరసిస్తూ పౌరసరఫరాల శాఖ కమిషనరేట్‌ను ముట్టడించనున్నారు. ఈ ముట్టడి కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సహా ముఖ్యనేతలందరూ పాల్గొననున్నారు. ఆ తర్వాత కూడా నిరసన కార్యక్రమాలను కొనసాగించి మే మొదటి వారంలో రాహుల్‌గాంధీతో భారీ బహిరంగ సభను నిర్వహించే ఆలోచనలో టీపీసీసీ ఉంది. ఇదిలా ఉండగా.. చమురు, గ్యాస్‌ ధరల పెరుగుదలను నిరసిస్తూ కలిసివచ్చే పార్టీలతో సోమవారం నుంచి ఈ నెల 10 వరకు మండల, జిల్లా కేంద్రాల్లో సీపీఐ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యాదర్శి చాడ వెంకట్‌రెడ్డి  పిలుపునిచ్చారు. 


Updated Date - 2022-04-04T09:02:18+05:30 IST