Abn logo
Sep 16 2020 @ 10:47AM

వ్యూహం మార్చిన టీఆర్ఎస్..? రంగంలోకి వీర విధేయుడు?

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికార పార్టీ వ్యూహం మార్చిందా? గత చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి సత్తా చాటేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందా? ఎలాగైనా అక్కడ పాగా వేయాలని స్కెచ్ వేస్తున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ తన వీర విధేయుడినే బరిలో దింపాలని డిసైడ్ అయ్యారా? ఇప్పటికే  పెద్ద పదవిలో ఉన్న ఆ నాయకుడు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో విజయం సాధిస్తే అంతకన్నా పెద్ద ప్రమోషన్ ఇవ్వాలని ప్లాన్ చేశారా? ఇంతకీ యువరాజు మనసును గెలుచుకున్న ఆ వీర విధేయుడు ఎవరు? వాచ్ దిస్ ఇంట్రస్టింగ్ స్టోరీ.


అచ్చిరాని ఎమ్మెల్సీ ఎన్నికలు..

తెలంగాణలో అధికారపార్టీకి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు అచ్చిరావడం లేదు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అధికార పగ్గాలు చేపట్టిన తొలి ఏడాది జరిగిన హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్ నగర్ పట్టభద్రుల స్థానానికి ఉద్యోగ సంఘాల నేత దేవి ప్రసాద్‌ను బరిలోకి దింపారు. కానీ ఆయన బీజేపీ అభ్యర్థి చేతిలో ఓటమి చెందారు. రాష్ట్రమంతా గులాబీ హవా వీస్తున్న సమయంలో ఈ ఓటమి అధికార పార్టీని తీవ్రంగా నిరాశ పరిచింది. ఆ తర్వాత జరిగిన పలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ప్రతికూల ఫలితాలే వచ్చాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నుంచి ఓటమి చెందిన కాంగ్రెస్ అభ్యర్థి టి. జీవన్ రెడ్డి.. ఆ తర్వాత జరిగిన మండలి ఎన్నికల్లో టీఆర్ఎస్‌పై గెలిచి గట్టి షాక్ ఇచ్చారు. గ్రేటర్‌ హైదరాబాద్ ఎన్నికలతోపాటు ఎమ్మెల్సీ ఎన్నికలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు ఈసారి సరికొత్త వ్యూహంతో అడుగులు వేస్తున్నారట. 


ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు..

వచ్చే ఏడాది జరగనున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో వంద డివిజన్లు గెలిచి గులాబీ పార్టీ సెంచరీ కొట్టడం ఖాయమని సీఎం కేసీఆర్ ఇటీవల జరిగిన టీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో ప్రకటించారు. సర్వేలన్నీ టీఆర్ఎస్‌కు అనుకూలంగా ఉన్నాయన్నారు. అయితే గత ఎన్నికల్తో పోలిస్తే.. ఈసారి బీజేపికి కొన్ని వార్డులు అదనంగా గెలుచుకోవచ్చన్నారు. ఇప్పుడు ఇవే మాటలు బీజేపీకి కొంత ప్లస్ అయినట్లు ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో గెలిచి ఏకంగా కేసీఆర్ కుమార్తెనే ఓడించి షాక్‌ ఇచ్చింది కమలం పార్టీ. అధికార పార్టీకి తామే ప్రత్యామ్నాయమని చెప్పుకుంటున్న బీజేపీ విషయంలో ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఉంటే కష్టమని గులాబీ పెద్దలు భావిస్తున్నారట. ఈసారి హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్‌నగర్ పట్టభద్రుల మండలి స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని కేటిఆర్ పక్కా వ్యూహాన్ని ఖరారు చేసుకున్నారని సమాచారం. గ్రేటర్ ఎన్నికలకు ముందే ఈ ఎమ్మెల్సీ సీటును దక్కించుకుంటే.. కమలం పార్టీని ముందే కంగు తినిపించవచ్చని ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇటీవల జరిగిన పార్టీ సమావేశంలో అభ్యర్థి ఎవరన్న విషయంపై మంత్రి కేటీఆర్‌ స్పష్టత ఇచ్చినట్లు సమాచారం. 


ఈ స్థానానికి అన్ని విధాలుగా ఆయనే కరెక్ట్ అని...

గ్రేటర్ ఎన్నికలు సమీపిస్తుండడంతో హైదరాబాద్ నగరంలో పలుచోట్ల సుందరీకరణ పనులు మొదలుపెట్టారు. 30వేల కోట్ల రూపాయలతో నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్ నగర్ పట్టభద్రుల స్థానానికి మేయర్ బొంతు రామ్మోహన్‌ను బరిలోకి దింపాలని కేటీఆర్ దాదాపుగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఉస్మానియా యానివర్సిటిలో చదువుకున్న రామ్మోహన్ అక్కడి విద్యార్థి సంఘాలలో చురుకుగా పనిచేశారు. బీజేపీ అనుబంధ సంస్థ ఏబీవీపీలోనూ కీలకంగా పనిచేసి ఆ తర్వాత టీఆర్ఎస్‌లో చేరారు. ఇప్పటికీ కొందరు బీజేపీ సానుభూతిపరులు రామ్మోహన్ పట్ల సన్నిహితంగా ఉంటారనే టాక్‌ ఉంది. తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్‌గా పనిచేసిన బొంతు రామ్మోహన్‌కు అన్ని పార్టీలతో సత్సంబంధాలు ఉన్నాయి. హైదరాబాద్ మేయర్‌గా తన ఐదేళ్ల కాలంలో తన పనితీరులో ప్రతిభ కనబరిచిన రామ్మోహనే ఈ స్థానానికి అన్ని విధాలుగా కరెక్ట్ అని కేటీఆర్ నిర్ణయానికి వచ్చారట. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు రామ్మోహన్ వైపే మొగ్గు చూపుతుండటంతో ఆయన పేరును ఖరారు చేసేందుకు అధినేత కేసీఆర్ కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. పైగా కేటీఆర్‌కు బొంతు రామ్మోహన్ వీర విధేయుడు. అటు గ్రేటర్ ఎన్నికల రిజర్వేషన్లు ఇదివరకే ఖరారు అయ్యాయి. ఈసారి మేయర్ పదవి బీసీ మహిళకు దక్కనుంది. దీంతో పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలోకి రామ్మోహన్‌ను దింపాలని కేటీఆర్‌ నిర్ణయించారట. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధిస్తే ఆయనకు మంత్రి పదవి కూడా ఖాయమన్న చర్చ పార్టీలో జోరుగా జరుగుతోంది. కేటీఆర్‌ కూడా ఈ విషయంలో రామ్మోహన్‌కు ఇదివరకే హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.


బీజేపీ నుండి మళ్లీ ఆయనే..

పట్టభద్రుల స్థానానికి బొంతు రామ్మోహన్ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా దింపనుండడంతో ఈ ఎన్నిక రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారింది. మరోవైపు బీజేపీ ప్రస్తుత ఎమ్మెల్సీ రామ్‌చందర్ రావును మరోసారి బరిలోకి దింపాలని భావిస్తోంది. ప్రధాని మోదీ వేవ్, నాలుగు లోక్‌సభ సీట్లు సాధించిన జోష్ ఈ ఎన్నికల్లో బీజేపీకి కలిసొస్తుందా? లేక కేటీఆర్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా? అన్నది ఉత్కంఠ రేపుతోంది.

Advertisement
Advertisement
Advertisement