టీఆర్‌ఎస్‌ ‘ఆపరేషన్‌ మునుగోడు’ షురూ!

ABN , First Publish Date - 2022-07-25T08:48:03+05:30 IST

నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంపై అధికార టీఆర్‌ఎస్‌ ఫోకస్‌ పెంచింది.

టీఆర్‌ఎస్‌ ‘ఆపరేషన్‌ మునుగోడు’ షురూ!

  • ఆగస్టులో రాజగోపాల్‌ రాజీనామా..
  • ఉప ఎన్నిక ఖాయమని అధికార పార్టీ అంచనా
  • ఎదుర్కొనేందుకు ప్రగతి భవన్‌ నుంచి కార్యాచరణ..
  • కేసీఆర్‌, జగదీశ్‌రెడ్డి చర్చలు
  • కాంగ్రెస్‌, బీజేపీ నుంచి వలసలకు ప్రోత్సాహం.. 
  • ‘గట్టుప్పల్‌’ మండల నేతలపై ఒత్తిడి
  • ఫోన్లు స్విచాఫ్‌ చేసిన నేతలు.. 
  • ముష్టిపల్లి సర్పంచ్‌, ఎంపీటీసీలకు గులాబీ కండువా


నల్లగొండ, జూలై 24 (ఆంద్రజ్యోతి): నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంపై అధికార టీఆర్‌ఎస్‌ ఫోకస్‌ పెంచింది. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన పదవికి, కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరడం ఖాయమని, దీంతో ఇక్కడ ఉప ఎన్నిక రావడం తథ్యమని గులాబీ పార్టీ నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఉప ఎన్నికను ఎదుర్కొనేందుకు అప్పుడే వ్యూహరచన మొదలుపెట్టింది. గత మూడు రోజులుగా ప్రగతి భవన్‌ నుంచే ఇందుకు సంబంధించిన కార్యాచరణ కొనసాగుతోంది. 


ఆగస్టు నెలాఖరుకు రాజగోపాల్‌రెడ్డి  రాజీనామా చేసేలా బీజేపీ కీలక నేతలతో చర్చ జరిగిందని టీఆర్‌ఎస్‌ నేతలు బావిస్తున్నారు. దీంతో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో రాజగోపాల్‌రెడ్డి సమావేశమైన మరుసటి రోజే సీఎం కేసీఆర్‌, జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి మద్య మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించిన కసరత్తు మొదలైంది. ఇందులో భాగంగా.. ఈ నియోజకవర్గంలో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న, గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఓటమికి కారణమైన గట్టుప్పల్‌ మండల ఏర్పాటును వెనువెంటనే ప్రకటించారు. ఆ తరువాత నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న సమస్యలపై దృష్టి సారించారు. డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా పూర్తి చేయాల్సిన రిజర్వాయర్లు, భూనిర్వాసితులకు నష్టపరిహారం అందజేయడం, గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వడంతోపాటు ఓటింగ్‌పై ప్రభావం చూపే రహదారులను పెద్ద సంఖ్యలో చేపట్టాలని నిర్ణయించారు. దీంతోపాటు ఇతర పార్టీల నుంచి చేరికలను ప్రోత్సహించే చర్యలనూ చేపట్టారు. ఈ క్రమంలో గట్టుప్పల్‌ మండల సాదన సమితి నాయకులందరినీ టీఆర్‌ఎ్‌సలో చేర్చుకునేందుకు పార్టీ నేతలు ఒత్తిడి ప్రారంభించగా.. వారు సెల్‌ఫోన్లు స్విచ్‌ ఆఫ్‌ పెట్టుకుని దాటవేస్తున్నారు. 


టీఆర్‌ఎ్‌సలోకి కాంగ్రెస్‌ సర్పంచ్‌, ఎంపీటీసీ..

‘ఆపరేషన్‌ మునుగోడు’లో భాగంగా నాంపల్లి మండలంలోని ముష్టిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ సర్పంచ్‌, ఎంపీటీసీలకు ఆదివారం హైదరాబాద్‌లో మంత్రి జగదీశ్‌రెడ్డి గులాబీ కండువాలు కప్పారు. రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయనున్నారు. రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరుతారని బలంగా విశ్వసిస్తున్న నేపథ్యంలో ఆ మేరకు ప్రధాని మోదీ, ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి కేంద్రంగా మంత్రి జగదీశ్‌రెడ్డి మాటల తూటాలు పేల్చడం మొదలు పెట్టారు. మోదీ పనుల ప్రధాని కాదు.. పన్నుల ప్రధాని అని, తల్లి పాలపై మినహా అన్నింటిమీదా జీఎస్టీ విధిస్తారని ఆరోపించారు. వ్యాపారాలు, కాంట్రాక్టులతో రాజగోపాల్‌ బిజీ అని, ఆయనది నిలకడలేని మనస్తత్వమని, అందుకే మంత్రిగా తాను స్వయంగా రంగంలోకి దిగి మునుగోడు నియోజకవర్గంలో కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశానని చెబుతున్నారు. మరోవైపు తాను రాజీనామా చేయబోనని, రాజీనామా చేసే విధంగా టీఆర్‌ఎస్‌ నేతలు రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారని, తనకు ఆ ఆలోచన ఉంటే కాంగ్రెస్‌ కార్యకర్తలు, మునుగోడు ప్రజల అభిప్రాయం తీసుకుని ముందుకు వెళ్తానని రాజగోపాల్‌రెడ్డి ప్రకటిస్తున్నా.. నియోజకవర్గ కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు ఆయన మాటలను విశ్వసించడం లేదు. అంతర్గతంగా ఏదో ఒక ఎజెండా కొనసాగుతోందని, ఆ విషయాన్ని తమ నేత బయటపెట్టడం లేదని ద్వితీయ శ్రేణి నాయకులు భావిస్తున్నారు. 

Updated Date - 2022-07-25T08:48:03+05:30 IST