వనమా రాఘవ వ్యవహారంతో TRS పార్టీలో గుబులు.. వచ్చే ఎన్నికల్లో..!

ABN , First Publish Date - 2022-01-08T08:05:31+05:30 IST

వనమా రాఘవ వ్యవహారంతో TRS పార్టీలో గుబులు.. వచ్చే ఎన్నికల్లో..!

వనమా రాఘవ వ్యవహారంతో TRS పార్టీలో గుబులు.. వచ్చే ఎన్నికల్లో..!

  • పాతపాల్వంచ ఘటనతో విస్తృత చర్చ

ఖమ్మం, జనవరి 7 (ఆంధ్రజ్యోతిప్రతినిధి) : టీఆర్‌ఎస్‌ నాయకుడు, కొత్తగూడెం ఎమ్మెల్యే తనయుడు వనమా రాఘవ వ్యవహారంతో అధికార పార్టీలో గుబులు రేపుతోంది. నియోజకవర్గంలో ఆయన చేస్తున్న షాడో రాజకీయంతో పాటు పలు అరాచకాలు పార్టీకి అప్రతిష్ట తీసుకొస్తున్నాయన్న చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆస్తి వివాదాన్ని పరిష్కరిం చాలని తన వద్దకు వచ్చిన రామకృష్ణ విషయంలో వ్యవహరించిన తీరు, ఏకంగా భార్యను తనవద్దకు పంపాలని కోరడం ఫలితంగా రామకృష్ణ, ఆయన కుటుంబం బలవడం.. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపడం అధికార పార్టీని ఇరకాటంలో పెడుతు న్నాయి. ఇప్పటికే విపక్షాలు ఈ ఘటనపై తీవ్రంగా స్పందించి.. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు రాఘవను పార్టీనుంచి సస్పెండ్‌ చేయాలని, రాఘవను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ ఘటన విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని, ఉమ్మడి ఖమ్మంజిల్లాకు చెందిన అధికార పార్టీ ముఖ్య ప్రజా ప్రతినిధులు కనీసం ఖండించకపోవడం దారుణమని మండిపడుతున్నాయి.


రాష్ట్రవ్యాప్తంగా వస్తున్న విమర్శలు, ఎదురవుతున్న నిరసనలను దృష్టిలో పెట్టుకుని రాఘవను పార్టీనుంచి సస్పెండ్‌ చేస్తున్నట్టు ప్రకటించినా అతడిని ఇప్పటివరకు పోలీసులు అరెస్టు చేయకపోవడం వెనుక అధికార పార్టీ ప్రమేయం ఉందన్న ఆరోపణలూ వెల్లువెత్తుతుండటం ఆ పార్టీకి తలనొప్పిగా మారింది.  అయితే అధికారం కోసమే ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు రాఘవ టీఆర్‌ఎస్‌లో చేరారని, విపక్ష ఎమ్మెల్యేగా ఉంటే పోలీసులు, అధికారులు తనకు ప్రాధాన్యమివ్వడంలేదని, తన మాట చెల్టుబాటవడం లేదని భావించి వనమా టీఆర్‌ఎస్‌లో చేరారన్న చర్చ జరుగుతోంది. అనుకున్నట్టుగా అధికారపార్టీలో చేరిక అనంతరం ఎమ్మెల్యే వనమా నియోజకవర్గ, జిల్లా అఽధికారులను తనగుప్పిట్లోకి తెచ్చుకున్నారని, అలా అందివచ్చిన అధికారం చూసుకుని ఆయన తనయుడు రాఘవ షాడో ఎమ్మెల్యేగా మారారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే వనమా వృద్ధాప్యంలో ఉండటం, అనారోగ్యం బారిన పడటంతో రాఘవ ఇష్టారీతిన వ్యవహరిస్తూ, అన్నీ తానే అన్నట్టుగా అధికారుల పోస్టింగులు, ఎమ్మెల్యే పైరవీలు, అభివృద్ధి పనులకు సంబం ధించిన కాంట్రాక్టులు, ఇసుక క్వారీలు, గ్రానైట్‌ క్వారీలు అన్ని విషయాల్లో పెత్తనం చెలాయిస్తున్నాడన్న చర్చ జరుగుతోంది. ప్రస్తుతం రాఘవ ఇరుక్కున్న వివాదంతో పాటు గతంలో ఉన్న వివాదాలు కూడా తెరపైకి వస్తుండటం టీఆర్‌ఎస్‌కు తలనొప్పిగా మారింది.


వచ్చే ఎన్నికల్లో కొత్తగూడెం నియోజక వర్గంతోపాటు జిల్లా వ్యాప్తంగా విపక్షాలు రాఘవ అంశాన్నే ప్రచా రాస్త్రంగా ఎంచుకునే అవకాశం ఉందని, మహిళ ల్లో ఇది మరింత నాటుకు పోతే తమకు ఇబ్బం దికర పరిస్థితి ఎదుర వుతుందేమోనని టీఆర్‌ఎస్‌ నాయకులు బిక్కుబిక్కుమంటు న్నారు. అయితే రాఘవకు గతంలోనే పార్టీ నుంచి కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి హెచ్చరికలు రాకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని, కొంత కఠినంగా వ్యవహరించి ఉంటే దారు ణం జరిగి ఉండేది కాదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Updated Date - 2022-01-08T08:05:31+05:30 IST