మహిళా మంత్రిపై విమర్శలు హాట్ టాపిక్ అయిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2020-05-31T14:43:17+05:30 IST

టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక ఒక్క గూటికి చేరుకున్నారు. ఆ తర్వాత అనూహ్యరీతిగా

మహిళా మంత్రిపై విమర్శలు హాట్ టాపిక్ అయిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే

మహబూబాబాద్‌ : గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌పై అధికార పార్టీకి చెందిన డోర్నకల్‌ శాసన సభ్యుడు డీఎ‌స్.రెడ్యానాయక్‌ విరుచుకుపడ్డారు.  కురవిలో శనివారం ఏకంగా విలేకరుల సమావేశం నిర్వహించి మంత్రి సత్యవతి రాథోడ్‌పై తొలిసారిగా రచ్చకెక్కాడు దీంతో మహబూబాబాద్‌ జిల్లా రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. డోర్నకల్‌ నియోజకవర్గంలో ప్రత్యర్థులైన రెడ్యానాయక్‌, సత్యవతి రాథోడ్‌లు.. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక ఒక్క గూటికి చేరుకున్నారు. ఆ తర్వాత అనూహ్యరీతిగా సత్యవతి రాథోడ్‌కు ఎమ్మెల్సీగా అవకాశం వచ్చింది. రెడ్యానాయక్‌ కుమార్తె మాలోతు కవితకు ఎంపీగా అవకాశం కల్పించారు. ఈలోగానే మంత్రివర్గ విస్తరణలో సత్యవతి రాథోడ్‌కు చోటు దక్కింది. ఆనాటి నుంచే ఎమ్మెల్యే రెడ్యా కినుకు వహిస్తూ వస్తున్నారు. వైరివర్గాలైన రెడ్యా నాయక్‌, సత్యవతి రాథోడ్‌ల మధ్య సంధి కుదుర్చేందుకు స్వయానా రెడ్యా కూతురు ఎంపీ మాలోతు కవిత కొంత మధ్యవర్తిత్వం వహించారు. అయినప్పటికీ ఏడాదిన్నర కాలంగా ఇద్దరి మధ్య ఎడమొఖం... పెడమొఖం కొనసాగుతూ వస్తోంది. 


మంత్రి సత్యవతి రాథోడ్‌, ఎమ్మెల్యే రెడ్యానాయక్‌లు డోర్నకల్‌ నియోజకవర్గంలో వేర్వేరుగానే పార్టీ శ్రేణులు, వారికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు. మూడు నెలల కిందట జరిగిన సహకార సంఘాల ఎన్నికల్లో తొలిసారిగా మంత్రి సత్యవతి, ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ మధ్య వర్గపోరు బహిర్గతమైంది. సత్యవతి రాథోడ్‌ సొంత ఊరు గుండ్రాతిమడుగులో ఇద్దరి గ్రూపులు బరిలో నిలిచాయి. ఆ తర్వాత సద్దుమణిగినట్లే వర్గపోరు కన్పించింది. ఏం జరిగిందో కానీ కొద్దికాలం కిందట ఎమ్మెల్యే రెడ్యానాయక్‌కు ముఖ్య అనుచరుడిగా ఉన్న ఓడీసీఎంఎస్‌ మాజీ చైర్మన్‌, ప్రస్తుత కురవి టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు నూకల వేణుగోపాల్‌రెడ్డి ఏ కారణం చేతనో కానీ మంత్రి సత్యవతిరాథోడ్‌ వర్గంలో చేరిపోయారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ శనివారం ఏకంగా కురవిలో విలేకరుల సమావేశం నిర్వహించి మంత్రి సత్యవతి రాథోడ్‌పై విరుచుకుపడ్డారు. 


అంతేకాదు పార్టీ మండల అధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డిని అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా ఆయన తనకు ద్రోహం చేశారని తీవ్రంగా విమర్శించారు. పార్టీకి.. తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వేణుగోపాల్‌రెడ్డిని అధ్యక్షుడిగా తొలగించేందుకు ఎమ్మెల్యేగా తనకు పూర్తి అధికారం ఉందని రెడ్యానాయక్‌ ప్రకటించారు. రాష్ట్రంలో 33 జిల్లాలు ఉన్నప్పటికీ మంత్రి సత్యవతి రాథోడ్‌ డోర్నకల్‌ నియోజకవర్గంలోనే తిరుగుతున్నారని విరుచుకుపడ్డారు. దీంతో తొలిసారిగా మంత్రి సత్యవతిరాథోడ్‌, ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ మధ్య వర్గవిభేదాలు బహిర్గతమయ్యాయి. దీనిపై మంత్రి సత్యవతిరాథోడ్‌ వర్గం ఏ విధంగా స్పందిస్తుందోనన్న విషయం చర్చనీయాంశంగా మారింది.

Updated Date - 2020-05-31T14:43:17+05:30 IST