Errabelli Pradeep Rao: టీఆర్‌ఎస్‌కు షాక్.. గులాబీ పార్టీకి మంత్రి ఎర్రబెల్లి సోదరుడు ప్రదీప్ రావు గుడ్‌బై

ABN , First Publish Date - 2022-08-07T19:23:52+05:30 IST

తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) పార్టీకి షాక్ తగిలింది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు టీఆర్ఎస్‌కు రాజీనామా చేస్తున్నట్లు..

Errabelli Pradeep Rao: టీఆర్‌ఎస్‌కు షాక్.. గులాబీ పార్టీకి మంత్రి ఎర్రబెల్లి సోదరుడు ప్రదీప్ రావు గుడ్‌బై

వరంగల్: తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) పార్టీకి షాక్ తగిలింది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు టీఆర్ఎస్‌కు రాజీనామా చేస్తున్నట్లు ఆదివారం నాడు ప్రకటించారు. ప్రదీప్ రావును బుజ్జగించేందుకు టీఆర్ఎస్ నేతలు చేసిన బుజ్జగింపులు ఫలించలేదు. టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన సందర్భంగా ఎర్రబెల్లి ప్రదీప్ రావు మాట్లాడుతూ.. ప్రజల కోసమే రాజకీయాల్లోకి వచ్చానని, ప్రజలకు కనీసం సహాయం చేయలేకపోతున్నానని చెప్పారు. 9 సంవత్సరాలు టీఆర్ఎస్‌‌లో క్రమశిక్షణతో ఉండి నిస్వార్ధంగా పనిచేశానని, పదవులు ఇయ్యకున్నా పార్టీకి సేవ చేస్తూనే ఉన్నానని ఆయన గుర్తుచేశారు. కనీస గుర్తింపు లేనప్పుడు పార్టీలో ఉండి ఏం లాభమని, సంస్కారం లేని నాయకులకు ప్రజలే బుద్ధి చెప్తారని ఎర్రబెల్లి ప్రదీప్ రావు వ్యాఖ్యానించారు. ఏ పార్టీలో చేరాలో నిర్ణయం తీసుకోలేదని, వరంగల్ తూర్పు ప్రజలతో కలిసి ముందుకు నడుస్తానని ఎర్రబెల్లి ప్రదీప్ రావు తెలిపారు.



టీఆర్‌ఎస్‌కు 7న రాజీనామా చేస్తానని ముందే చెప్పిన ప్రదీప్ రావు

టీఆర్‌ఎస్‌ను నమ్ముకుంటే న్యాయం జరగడమనేది కల్ల అని, అందుకే ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర నేత, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తమ్ముడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు ముందే స్పష్టం చేశారు. ఈనెల 7న టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేస్తున్నట్టు ఆయన ముందుగానే ప్రకటించారు. వరంగల్‌లోని ఓసిటీలో గల తన నివాసంలో గత బుధవారం ఆయన వరంగల్‌ తూర్పు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అనుచరులతో సమవేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో ఎన్ని అవమానాలు జరిగినా ఓపికతో భరించామని, తనతో పాటు తన వారి మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించినా భరించామని తెలిపారు. చివరికి తనను నమ్ముకున్న కార్యకర్తలపై పోలీసులు కేసులు పెట్టించే పరిస్థితులు వచ్చాయని, ఇంత జరుగుతున్నా అధిష్ఠానం నుంచి ఎలాంటి స్పందన కనిపించలేదని పేర్కొన్నారు. ‘ఇన్నేళ్లుగా టీఆర్‌ఎస్‌ పార్టీలో పనిచేస్తున్నా.. నాకు న్యాయం జరగలేదు. వ్యయప్రయాసలకు ఓర్చి టీఆర్‌ఎస్‌ పార్టీ గెలుపు కోసం శ్రమించాం.. ఎన్నో అవమానాలను భరించాం.. అయినా పార్టీ గుర్తించడం లేదు’ అని ప్రదీప్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. గత 12 ఏళ్లుగా టీఆర్‌ఎస్‌ పార్టీ అనేక అవకాశాలిస్తామని చెప్పిన మాటలు నీటిమూటలుగానే మిగిలాయని, ఏ అవకాశం ఇవ్వకుండా అవమానపరిచిందని తెలిపారు. ఎప్పుడు అడిగినా భవిష్యత్తులో అవకాశాలు కల్పిస్తామని చెప్పడం.. తీరా చూస్తే ఇతరులకు ఇవ్వడం జరిగిందని వెల్లడించారు. ఈ పరిణామాలను భరించడం ఇక తనవల్ల కావడం లేదని, పార్టీకి రాజీనామా చేయడంపై అభిప్రాయాలను తెలపాలని ఆయన కోరగా, ‘మీ వెంటే మేముంటామని’ ఆయన వర్గీయులు స్పష్టంచేశారు.



ఆదరించే పార్టీలో చేరుదాం 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా సాగిన ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించామని, ఉద్యమ ప్రయోజనాల కోసం తాను స్వయంగా ఏర్పాటు చేసిన తెలంగాణ నవ నిర్మాణ సమితి పార్టీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేశామని ప్రదీప్‌ రావు గుర్తు చేసుకున్నారు. వరంగల్‌ తూర్పు టికెట్టు ఇస్తామని చెప్పి రెండుసార్లు చేయిచ్చారని, ఆ తర్వాత ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చెప్పి ఇవ్వలేదని ఆరోపించారు. అంతేకాకుండా పార్టీలో కూడా అవకాశాలు ఇవ్వలేదని తెలిపారు. ‘మనల్ని ఆదరించి, మంచి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన పార్టీలోనే చేరుదాం’ అని  ప్రదీప్ రావు పేర్కొన్నారు. 


ఫలించని బుజ్జగింపులు

ప్రదీప్‌రావు టీఆర్‌ఎస్‌ను వీడుతున్నట్టు వార్తలు రావడంతో టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ రంగంలోకి దిగారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, రోడ్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మెట్టు శ్రీనివాస్‌ను దూతలుగా ప్రదీప్ రావు వద్దకు పంపించారు. వారు ప్రదీప్ రావు నివాసానికి వెళ్లి మాట్లాడారు. పార్టీ మారవద్దని బుజ్జగించే యత్నం చేశారు. అంతేకాకుండా, సీఎం కేసీఆర్‌ మీతో మాట్లాడతారని ఫోన్‌ కలిపి ఇచ్చినా ప్రదీప్ రావు మాట్లాడలేదని తెలిసింది. ప్రదీప్ రావు నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాకపోవడంతో సారయ్య, శ్రీనివాస్‌ వెనుదిరిగారు. చెప్పినట్టుగానే ఆగస్టు 7న ఎర్రబెల్లి ప్రదీప్ రావు రాజీనామా చేశారు.

Updated Date - 2022-08-07T19:23:52+05:30 IST