చేరికలే అస్త్రాలుగా.. కాంగ్రెస్‌ దూకుడు!

ABN , First Publish Date - 2022-06-25T09:46:23+05:30 IST

వచ్చే డిసెంబరులో శాసన సభను రద్దు చేసి, కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్తారన్న అంచనాలో ఉన్న కాంగ్రెస్‌.. చేరికలతో దూకుడు పెంచింది. అధికార టీఆర్‌ఎ్‌సనే టార్గెట్‌ చేసుకుని చేరికల కార్యక్రమం..

చేరికలే అస్త్రాలుగా.. కాంగ్రెస్‌ దూకుడు!

విడతల వారీగా టీఆర్‌ఎస్‌ నేతలే టార్గెట్‌..

చేరే దాకా గోప్యత పాటిస్తున్న నాయకత్వం

నేరుగా రాహుల్‌కే టీపీసీసీ ప్రతిపాదన

అనుమతి రాగానే కండువా కప్పేలా ప్రణాళిక

2 రోజుల్లో పాలమూరు నేతలు చేరే చాన్స్‌

ఐదుగురు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్‌లో చేరడంతో టీఆర్‌ఎస్‌ అప్రమత్తం

పరిస్థితులను చక్కదిద్దేందుకు రంగంలోకి దిగిన మంత్రి కేటీఆర్‌


హైదరాబాద్‌, జూన్‌ 24(ఆంధ్రజ్యోతి): వచ్చే డిసెంబరులో శాసన సభను రద్దు చేసి, కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్తారన్న అంచనాలో ఉన్న కాంగ్రెస్‌.. చేరికలతో దూకుడు పెంచింది. అధికార టీఆర్‌ఎ్‌సనే టార్గెట్‌ చేసుకుని చేరికల కార్యక్రమం ప్రారంభించింది. వాస్తవానికి 2018 ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నేతలు టీఆర్‌ఎ్‌సలో చేరడమే తప్ప.. టీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రె్‌సలోకి ఎవరూ వచ్చిన దాఖలాలు లేవు. రాజకీయ సమీకరణాలు మారుతున్న వేళ అలాంటి పరిస్థితిని అధిగమించిన కాంగ్రెస్‌ పార్టీ.. జడ్పీ చైర్‌పర్సన్‌గా ఉన్న నల్లెల భాగ్యలక్ష్మితోపాటు ఆమె భర్త మాజీ ఎమ్మెల్యే ఓదెలును చేర్చుకోవడం ద్వారా అధికార పార్టీకి తొలి షాక్‌ ఇచ్చింది. జీహెచ్‌ఎంసీ టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌, పీజేఆర్‌ తనయ విజయారెడ్డిని పార్టీలో చేర్చుకుని మరో షాక్‌ ఇచ్చిం ది. తాజాగా టీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుతోపాటు కరకగూడెం జెడ్పీటీసీ సభ్యుడు కాంతారావును శుక్రవారం పార్టీలో చేర్చుకుంది.


ఆయా నాయకుల ప్రతిపాదనలను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నేరుగా రాహుల్‌ దృష్టికి తీసుకెళుతున్నారని, అక్కడి నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చిన వెంటనే వారిని చేర్చుకుంటున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే, ఆయా నేతలు పార్టీలో చేరే వరకూ గోప్యతను పాటించడం గమనార్హం. ఉమ్మడి ఆదిలాబాద్‌, హైదరాబాద్‌, ఖమ్మం జిల్లాల నుంచి టీఆర్‌ఎస్‌ నేతలు, ప్రజా ప్రతినిధులను చేర్చుకున్న రేవంత్‌రెడ్డి.. ఒకటి, రెండు రోజుల్లో ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి చేరికలను ప్లాన్‌ చేసుకున్నట్లుగా పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ చేరికలు విడతల వారీగా జరగనున్నాయని, టీఆర్‌ఎస్‌, బీజేపీకి చెందిన ముఖ్యనాయకులతోపాటు ప్రజాపతినిధులూ కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. సగానికిపైగా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ఆ పార్టీ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ నివేదికలే స్పష్టం చేస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ ముఖ్యనేతలు కాంగ్రె్‌సను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది.


ఈ పరిస్థితిని అవకాశంగా మలుచుకునేందుకు చేరికల ప్రక్రియను టీపీసీసీ ముమ్మరం చేసింది. టీఆర్‌ఎస్‌ నుంచి పెద్ద ఎత్తున వలసలు జరిగితే.. ఓటింగ్‌ సరళిలో పెనుమార్పులు చోటు చేసుకుంటాయని కాంగ్రె స్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చేరికలు పెరి గే కొద్దీ ప్రజల్లో నమ్మకమూ పెరుగుతుందని భావిస్తున్నాయి.హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల తర్వాత చేరికల ప్రక్రియను మరింత వేగవంతం చేయాలన్న ప్రణాళికలూ సిద్ధం చేసినట్లు పేర్కొంటున్నాయి.


అలంకార ప్రాయంగా జానారెడ్డి కమిటీ

పార్టీలో చేరికల ప్రతిపాదనను పరిశీలించేందుకు సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి నేతృత్వంలో ఒక కమిటీ వేసిన సంగతి తెలిసిందే. అయితే, ఇటీవల రాహుల్‌గాంధీ హైదరాబాద్‌కు వచ్చినప్పుడు చేరికల అంశంపై చర్చ జరిగింది. ప్రజల్లో పలుకుబడి ఉన్న ఇతర పార్టీల నేతలు కాంగ్రె్‌సలో చేరేందుకు ఆసక్తి చూపుతుంటే.. ఆయా జిల్లాలకు చెందిన పార్టీ ముఖ్యనేతలు అడ్డుపడుతున్నారని కొందరు నేతలు రాహుల్‌ దృష్టికి తీసుకెళ్లారు.  పార్టీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్న వారి జాబితాను తనకు ఇవ్వాలని రాష్ట్రనాయకత్వా న్ని రాహుల్‌ ఆదేశించారు. చేరికలను ప్రోత్సహించాలని సూచించారు. దీంతో పార్టీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్న ఇతర పార్టీల నేతలతో టీపీసీసీ నాయకత్వమే నేరుగా సంప్రదింపులు జరిపి.. అధిష్ఠానానికి ప్రతిపాదన పెట్టడం, దాన్ని పరిశీలించి రాహుల్‌గాంధీ ఓకే చేయడం జరుగుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో జానారెడ్డి కమిటీ.. అలంకారప్రాయంగానే మిగిలిపోతుందన్న వాదన వినిపిస్తోంది.


అసంతృప్తులకు కేటీఆర్‌ ఫోన్లు

జిల్లాల వారీగా టీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకులకు కాంగ్రెస్‌ గాలం వేస్తుండడంతో ఆ పార్టీ అప్రమత్తమైంది. అసంతృప్త నేతలతో మంత్రి కేటీఆర్‌ స్వయంగా భేటీ అయి సంప్రదింపులు జరుపుతున్నారు. పరిస్థితిని చక్కదిద్దే యత్నం చేస్తున్నారు. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, మాజీ మంత్రి, పాలమూరు నేత జూపల్లి కృష్ణారావు తదితరులు కాంగ్రె్‌సలో చేరుతారని ప్రచారం జరగ్గా, ఆయా జిల్లాల్లో కేటీఆర్‌ పర్యటించినప్పుడు వారితో భేటీ కావడమే దీనికి నిదర్శనంగా నిలుస్తోంది. 


త్వరలో భారీ చేరికలు:రేవంత్‌

హైదరాబాద్‌, జూన్‌ 24(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ పార్టీలో చేరికల తుఫాన్‌ మొదలైందని, త్వరలోనే భారీగా చేరికలు ఉంటాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మరో 11 నెలల్లోనే రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రానుందని, ఆ వెంటనే పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గాంధీభవన్‌లో శుక్ర వారం టీఆర్‌ఎస్‌ నేత, అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, కరకగూడెం జెడ్పీటీసీ కాంతారావు సహా పలువురు మాజీ ప్రజాప్రతినిధులు రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రె్‌సలో చేరారు. రేవంత్‌రెడ్డి.. వారికి కాంగ్రెస్‌ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ తాటి వెంకటేశ్వర్లు, కాంతారావు చేరికతో అశ్వారావుపేటలో కాంగ్రెస్‌ మరింత బలపడనుందని అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రెండు ఎంపీ సీట్లు, మొత్తం అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్సే గెలుచుకోనుందని ధీమా వ్యక్తం చేశారు. వందలాది మంది పోడు సాగుదారులపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కేసులు పెట్టిందని, ఆదివాసీలను చిన్న చూపు చూస్తోందని ఆరోపించారు. వరంగల్‌లో ప్రకటించిన రైతు డిక్లరేషన్‌ అమలైతే రైతుల జీవితాలే మారిపోతాయన్నారు. త్వరలోనే అశ్వరావుపేటలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తేనే గిరిజనులకు న్యాయం జరుగుతుందని తాటి వెంకటేశ్వర్లు అన్నారు.  


అశ్వారావుపేటలో మారనున్న రాజకీయం

అశ్వారావుపేట/కరకగూడెం: గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరపున పోటీ చేసి ఓడిన తాటి వెంకటేశ్వర్లు ఆ పార్టీకి రాజీనామా చేసి అనుచరులతో కాంగ్రె్‌సలో చేరడంతో అశ్వారావుపేట నియోజకవర్గ రాజకీయ సమీకరణలు మారనున్నాయి. ఈపరిణామం..అశ్వారావుపేట నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న వారిలో కొంత ఆందోళన కలిగిస్తుండగా.. తాటి, ఆయన అనుచరుల చేరికతో పార్టీ మరింత బలోపేతం అవుతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా కరకగూడెం జడ్పీటీసీ కాంతారావు ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ తన తో పాటు మండలం నుంచి మరో 100మంది కాంగ్రె్‌సలో చేరారన్నారు. 

Updated Date - 2022-06-25T09:46:23+05:30 IST