టీఆర్‌ఎస్‌లో జోష్‌

ABN , First Publish Date - 2021-04-14T04:47:38+05:30 IST

జీడబ్ల్యూఎంసీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్‌ఎ్‌సలో జోష్‌ నెలకొంది. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్‌ నగర పర్యటన ఆ పార్టీకి మంచి మైలేజీగా మారిందని పార్టీ ప్రముఖులు ధీమాగా ఉన్నారు.

టీఆర్‌ఎస్‌లో జోష్‌

 మైలేజీ ఇచ్చిన మంత్రి కేటీఆర్‌ టూర్‌

 బీజేపీయే ప్రధాన  ప్రత్యర్థిగా దూకుడు

 పంచ్‌లతో గులాబీల్లో ఆత్మసైర్థ్యం నింపిన యువనేత

వరంగల్‌ సిటీ :  జీడబ్ల్యూఎంసీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్‌ఎ్‌సలో జోష్‌ నెలకొంది. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్‌ నగర పర్యటన ఆ పార్టీకి మంచి మైలేజీగా మారిందని పార్టీ ప్రముఖులు ధీమాగా ఉన్నారు. మొత్తం 66 డివిజన్లలో గులాబీ శ్రేణుల్లో కేటీఆర్‌ ఆత్మస్థైర్యం నింపారు. ఒకవైపు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో అభివృద్ధి బాణం సంధించారు. అదే క్రమంలో ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తున్న భారతీయ జనతా పార్టీపై తొలి దశలోనే అటాకింగ్‌ దృక్పథంతో పదునైన పంచ్‌లతో అస్త్రాలు సంధించారు. దీంతో జీడబ్ల్యూఎంసీ ఎన్నికకు పార్టీని సమాయాత్తం చేయడంలో కేటీఆర్‌ ప్రత్యర్థులపై మాటల తూటాల దాడినే ఎంచుకున్నట్లుగా స్పష్టమైంది. 

బీజేపీపై పంచ్‌లు

జీహెచ్‌ఎంసీ ఎన్నికలో భారతీయ జనతా పార్టీ అధికార పార్టీకి గట్టి పోటీ ఇచ్చింది. జీడబ్ల్యూఎంసీ ఎన్నికల్లో బీజేపీ ప్రభావం కనిపించక ముందే ఎదురుదాడితో దెబ్బతీయాలనే వ్యూహంతో కేటీఆర్‌ నగరంలో పర్యటించారు. ఈ మేరకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్య నేతలు, కార్యకర్తలను సంసిద్ధులను చేశారు. ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీయే ప్రధాన ప్రత్యర్థిగా భావించి మాటల దాడితోనే మానసికంగా పైచేయి సాధించాలనే ఉపదేశం చేశారు. మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన భరోసాతో ఇక తమ స్పీడు పెంచుతామంటూ గులాబీ దళాలు ధీమాగా చెబుతున్నాయి. 

పదునైన పంచ్‌లతో..

మంత్రి కేటీఆర్‌ బీజేపీపై సాదాసీదాగా మాటలు వదలలేదు. పదునైన పంచ్‌లను సంధించారు. ప్రధానమంత్రి మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌షా వంటి దిగ్గజాలతో పాటు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై కూడా పంచ్‌లు విసిరారు. కొత్త బిచ్చగాళ్లు, సంస్కారం లేని వాళ్లు, చిల్లర రాజకీయాలు చేస్తున్నారంటూ తుటాలు వదిలారు. బూతులు తిట్టడంతో బీజేపీ కంటే తాము ఎక్కువగా ఉపయోగించే సామర్ధ్యం ఉందని, ఇదే చివరి హెచ్చరిక అంటూ ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్‌ను ఇతర నేతలను హద్దు మీరి తిట్టినా, సోషల్‌ మాధ్యమాల్లో కించపరిచినా ప్రతి దాడి తీవ్రంగానే ఉంటుందని పదే పదే హెచ్చరించారు. భారతీయ జనతా పార్టీపై ఆదిలోనే పైచేయి సాధించి జీడబ్ల్యూఎంసీ ఎన్నికలో ఆ పార్టీని మానసికంగా దెబ్బతియాలనే వ్యూహంతో మాట్లాడారు. శ్రేణులకు కూడా ఇదే విధంగా సంకేతాలు ఇచ్చారు. 

ధీమాలో గులాబీలు

మంత్రి కేటీఆర్‌ వరంగల్‌ నగర పర్యటన, బీజేపీపై ఆయన చేసిన వ్యాఖ్యలతో గులాబీ దళాలు కదనోత్సాహంతో ఉన్నాయి. జీడబ్ల్యూఎంసీ ఎన్నికల్లో ఇక తమకు ఎదురే లేదనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. 66 డివిజన్లను కైవసం చేసుకుంటామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మంత్రి కేటీఆర్‌ మాటల స్ఫూరితో ఆయన పక్కనే ఉండి ప్రకటించారు. ఇక తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌, చీఫ్‌ విప్‌ వినయ్‌భాస్కర్‌ తమ నియోజక వర్గంలో  అత్యధిక డివిజన్లన సాధించి చూపెడతామనే పోటీ వ్యాఖ్యలు చేశారు. ఈ పరిణామాలతో టీఆర్‌ఎస్‌ ఎన్నికకు ముందే ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తోంది. కాంగ్రె్‌సను ప్రత్యర్థిగానే భావించడం లేదని, భారతీయ జనతా పార్టీ కూడా తమకు గట్టి పోటీ ఇచ్చే పరిస్థితే లేదని గులాబీ నేతలు అంటున్నారు. మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలతో భారతీయ జనతా పార్టీ ప్రతి స్పందన, ప్రతిదాడి ఎలా ఉంటుందనేదే ఇప్పుడు రెండు పార్టీల్లో ఆసక్తిగా మారింది. మొత్తంగా ఈ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం, ఆధిపత్య పోరు రసవత్తరంగానే సాగనుందనే అంచనాలు నెలకొన్నాయి. మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకొని చూసినా తాము బలమైన ప్రత్యర్థులమని తేలినట్లే కదా అని బీజేపీ నాయకులు అంటున్నారు. తమ బలం ఏంటో చూపించేందుకు రె’ఢీ’ అవుతున్నామంటున్నారు. 

Updated Date - 2021-04-14T04:47:38+05:30 IST