టీఆర్‌ఎస్‌కు మూడో స్థానమే

ABN , First Publish Date - 2022-05-03T07:15:24+05:30 IST

తెలంగాణలో కేసీఆర్‌ పాలన మరో 12 నెలలు మాత్రమే ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. రాబోయే ఎన్నికల్లో గెలిచేది, అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్‌ పార్టీయేనని ధీమా వ్యక్తం చేశారు..

టీఆర్‌ఎస్‌కు మూడో స్థానమే

65 మంది సిటింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్లిస్తే జరిగేది అదే

ప్రత్యామ్నాయం కాంగ్రెస్సే, 70 సీట్లలో ప్రధాన ప్రత్యర్థి

టీఆర్‌ఎస్‌ వ్యతిరేక ఓటు బీజేపీకి పడదు

కేసీఆర్‌ పాలన మరో 12 నెలలు మాత్రమే

దానికి రైతు సంఘర్షణ సభే పునాది.. అధికారం మాదే

నాతో కలిసి పార్టీ కోసం పని చేయాలనుకున్న పీకే 

రెడ్‌ ఫ్లాగ్‌ ఎగరొద్దు, రెడ్లు ఎదగొద్దు.. సీఎం లక్ష్యాలివే 

మోదీ, కేసీఆర్‌ మధ్య వైరుధ్యాల్లేవు.. ఒప్పందమే

అందుకే కేసీఆర్‌పై ఈడీ, ఐటీ దాడులు జరగడం లేదు

‘ఆంధ్రజ్యోతి’ ఇంటర్వ్యూలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి


హైదరాబాద్‌, మే 2 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో కేసీఆర్‌ పాలన మరో 12 నెలలు మాత్రమే ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. రాబోయే ఎన్నికల్లో గెలిచేది, అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్‌ పార్టీయేనని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్‌ 65 మంది టీఆర్‌ఎస్‌ వారికి టికెట్లు ఇస్తే ఆ పార్టీకి మూడో స్థానమే దక్కుతుందని జోస్యం చెప్పారు. టీఆర్‌ఎ్‌సకు అసలైన ప్రత్యర్థి కాంగ్రెస్సేనని, ఆ పార్టీ వ్యతిరేక ఓట్లు బీజేపీకి పడవని అన్నారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ రెండూకూడబలుక్కొని వరి ధాన్యం కొనుగోలు విషయంలో డ్రామాలాడాయని, బీజేపీ గ్రాఫ్‌ను పెంచేందుకు కేసీఆరే స్వయంగా దీనికి వ్యూహరచన చేశారని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌, ప్రధాని మోదీ మధ్య ఒప్పందంలో భాగంగానే ఇది జరిగిందన్నారు. దేశంలో ఎంతో మంది నేతల మీద కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులు చేయించే బీజేపీ.. కేసీఆర్‌పై ఎటువంటి దాడులూ చేయించకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. కేసీఆర్‌ పాలనలో రైతులు దిక్కలేనివారు అయ్యారని, వారికి ధైర్యం చెప్పి.. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక అండగా ఉంటామని చెప్పేందుకే వరంగల్‌ సభకు పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ వస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో రాహుల్‌గాంధీ రెండు రోజుల పర్యటన నేపథ్యంలో రేవంత్‌రెడ్డి సోమవారం ‘ఆంధ్రజ్యోతి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ విశేషాలు..


తెలంగాణకు రాహుల్‌గాంధీ ఎందుకొస్తున్నారు ?

తెలంగాణ రాష్ట్రంపై కాంగ్రెస్‌ పార్టీకి, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ కుటుంబానికి హక్కు, అధికారాలున్నాయి. సోనియాగాంఽధీ ఉక్కు సంకల్పంతో, ఇక్కడి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలన్న ఉద్దేశంతో 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. రైతులు కష్టకాలంలో ఉంటే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నెపం మోపుకొంటూ కాలక్షేపం చేస్తున్నారు. రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నందున.. వారిని పరామర్శించడానికి, ధైర్యం చెప్పడానికి రాహుల్‌గాంధీ వస్తున్నారు.  ఓడిపోయిన రాష్ట్రాలను చూపించి కాంగ్రెస్‌ ఓడిందని, రాహుల్‌ ఆధ్వర్యంలో పార్టీ పని అయిపోయిందంటూ విశ్లేషణలు సరికాదు. రాహుల్‌ రాజకీయాల్లోకి అరంగేట్రం చేసిన 2004లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 2009లో అధికారం చేపట్టింది. రాహుల్‌ ఏఐఐసీ అధ్యక్షుడిగా ఉన్న సందర్భంలో మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, కర్ణాటక వంటి పెద్ద రాష్ట్రాల్లో ఛత్తీ్‌సగఢ్‌లో అధికారంలోకి వచ్చింది. మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 


సోనియా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని పదేళ్ల తర్వాత చెప్పుకొంటే ఏమొస్తుంది ? 

సానుభూతి, ఓట్లు, నాటకాల కోసం కాంగ్రెస్‌ పార్టీ, గాంధీ కుటుంబం ప్రయత్నం చేయదు. పదవే కావాలంటే పదేళ్లుగా ఆ కుటుంబం ప్రధాని పదవి తీసుకోకుండా దూరంగా కూర్చుంది. ఒక రాష్ట్రంలో అధికారం రావడం, రాకపోవడమనేది పెద్ద చర్చనే కాదు. ఎనిమిదేళ్ల కేసీఆర్‌ పాలనలో అఽధ్వాన పరిస్థితి ఉంది. ఈ ఎనిమిదేళ్లలో ఎన్‌సీఆర్‌బీ రికార్డుల ప్రకారం రాష్ట్రంలో 8400 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన ఒక ప్రకటనలో 74 వేల మంది రైతులకు రైతు బీమా పథకాన్ని అమలు చేశామని చెప్పింది. అంటే నాలుగేళ్లలో 74 వేల మంది రైతులు చనిపోయారంటూ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి పేపర్లలో ప్రకటన ఇచ్చారు. ఎన్‌సీఆర్‌బీ ప్రకారం 8400 మంది, ప్రభుత్వ ప్రకటన ప్రకారం 74 వేల మంది... మొత్తం 82 వేల మంది రైతులు చనిపోయినట్లు లెక్కలు చెబుతున్నాయి.


రైతు సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయమేంటి?

రాహుల్‌తో ఐదు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించుకున్నాం. మొదటిది రైతులు, రెండోది విద్యార్థులు, నిరుద్యోగులు, మూడోది మహిళలు, నాలుగోది దళితులు, గిరిజనులు, ఐదోది బలహీనవర్గాల కోసం పెట్టాలనుకున్నాం. వరంగల్‌ది రైతు సంఘర్షణ సభ. రైతుల సమస్యనే ప్రధానంగా తీసుకుంటున్నాం. తెలంగాణకు పట్టిన టీఆర్‌ఎస్‌ చెదలు, చీడ పీడలను వదిలించడానికి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ సభ ద్వారా సమర శంకాన్ని పూరిస్తున్నాం. ఇది కేసీఆర్‌ పతనానికి పునాదులు వేస్తుంది. ఈ సభలో వ్యవసాయ పాలసీని రాహుల్‌గాంధీ ప్రకటిస్తారు. 


ధాన్యం కొనుగోలులో టీఆర్‌ఎస్‌ వర్సెస్‌ బీజేపీ అనే పరిస్థితి. కాంగ్రెస్‌ చేసిందేంటి ? 

గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి, ప్రత్యామ్నాయ పంటలను వేసేలా చేసింది. కాంగ్రెస్‌ ఉన్నప్పుడే తమకు మేలు జరిగిందని రైతులు చెబుతున్నారు. వారంతా కాంగ్రెస్‌ వైపు మళ్లుతున్న సందర్భంలో టీఆర్‌ఎస్‌, బీజేపీ కూడబలుక్కుని, రాజకీయ క్రీడలో రైతులను వాడుకుంటున్నాయి. కాంగ్రెస్‌ అసలు క్షేత్రంలోనే లేదని చెప్పడంలో క్షకొంత విజయవంతమయ్యారు. నరేంద్ర మోదీ, అమిత్‌ షా అధికారంలోకి వచ్చిన ఈ ఎనిమిదేళ్లలో.. వారికి వ్యతికేంగా ఉండే అధికారులు, రాజకీయ నేతలపై ఈడీ, ఐటీ, సీబీఐ, సెంట్రల్‌ విజిలెన్స్‌ దాడులతో ఏదో రకంగా ఇబ్బందులు పెట్టారు. సొంత పార్టీలో ఉండే ముఖ్యమంత్రులను కూడా వదలలేదు. కానీ, బీజేపీపై యుద్ధం చేస్తున్నానని, ఢిల్లీలో భూకంపం సృష్టిస్తా, మోదీ మెడలు వంచుతానన్న కేసీఆర్‌పై మాత్రం ఈరోజు వరకు ఈగ కూడా వాలడం లేదు.


కేసీఆర్‌ జైలుకు పోతాడని బీజేపీవాళ్లంటున్నారు!

కేసీఆర్‌ను జైలుకు పంపుతానన్న బండి సంజయే జైలుకు వెళ్లొచ్చారు. కాళేశ్వరంలో వేల కోట్ల కుంభకోణం జరిగింది, నీ లెక్కలు తీస్తున్నాం, నువ్వు జైలుకు పోవాల్సిందే అంటూ కేసీఆర్‌పై బీజేపీ నేతలు విరుచుకుపడ్డారు. మొన్న సీనియర్‌ మంత్రి నితిన్‌ గడ్కరీ వచ్చి కాళేశ్వరం అద్భుతం, దానికి తానే అనుమతులిచ్చానని, హైదరాబాద్‌కు కూడా దాన్నుంచే నీళ్లు వస్తున్నాయని డోలు బజాయించి చెప్పిపోయిండు. దీనినెలా చూడాలి? ఇక్కడి బీజేపీ నేతలు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ చెప్పింది అబద్ధమని గడ్కరీ చెప్పారు. సమతామూర్తి విగ్రహావిష్కరణకు మోదీ సూచన మేరకే కేసీఆర్‌ హాజరు కాలేదు తప్ప.. వాళ్లిద్దరి మధ్య ఎలాంటి వైరుధ్యాలు లేవు. వారిద్దరూ కలిసి ఆడుతున్నది నాటకమని, గూడుపుఠానీ అని మేము చెబుతున్నదే నిరూపితమైంది.


ఓయూ విద్యార్థులతో రాహుల్‌ ముఖాముఖికి అనుమతి ఇవ్వకపోవడంపై ఏమనుకుంటున్నారు?

తెలంగాణ సమాజం, బుద్ధి జీవులు, తెలంగాణ ఉద్యమంలో పని చేసిన గద్దర్‌, విమలక్క, కోదండరాం, ప్రొఫెసర్‌ హరగోపాల్‌, వరవరరావులాంటి వారందరూ  ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టాల్సిన అవసరం ఉంది. స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవాల్సిన అక్కడి వైస్‌ చాన్స్‌లర్‌పై ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి పర్యటనకు అనుమతి లేకుండా చేస్తోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఈ మధ్యనే యూనివర్సిటీకి వెళ్లి క్రీడలు నిర్వహించామని చెప్పారు. సీనియర్‌ ఎంపీ రాహుల్‌ అక్కడి వస్తానంటే.. అనుమతి లేదంటున్నారంటే వర్సిటీ పాలక మండలిపై సర్కారు ఒత్తిడి ఎంత ఉందో ఆలోచించాలి. ఓయూకు నేనే రెండు మూడుసార్లు పోయి వచ్చాను. అంతకుముందు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెళ్లి వచ్చారు. కేసీఆర్‌ లక్ష్యాలు రెండే రెండు. రాష్ట్రంలో ఎర్ర జెండా ఎగరకూడదు. రెడ్డి అనేటోడు తన చెవుల కంటే కింద ఉండాలి. మొదటి లక్ష్యంగా రాష్ట్రంలో ఎన్‌కౌంటర్లు చేయించారు. రెడ్డి అనేవాడు తనకు అనుచరుడిగానో, పనోడిగానో ఉండాలి తప్ప ముందుకు పోకూడదనేది రెండో లక్ష్యం. కేసీఆర్‌ తనకు అత్యంత సన్నిహితుల వద్ద ఈ విషయం చెప్పారు.


ఓయూకు రాహుల్‌గాంధీని రప్పించి.. విద్యార్థులను రెచ్చగొట్టాలనుకుంటున్నారా?

రెచ్చగొడితే రెచ్చిపోవడానికి వాళ్లేమీ స్కూలు పిల్లలు కాదు. పీజీ, పీహెచ్‌డీలు చదువుతున్న యూనివర్సిటీ విద్యార్థులు. సమాజంలో జరుగుతున్న పరిమాణాలపై వారికి అవగాహన, స్పష్టత ఉంది. తెలంగాణ ఇచ్చిన పార్టీ నేత రాహుల్‌గాంధీని ఓయూకు రావాలని విద్యార్థులే ఆహ్వానించారు. అనుమతించకపోవడం వెనక రాజకీయపరమైన కుట్ర ఉంది. 100 శాతం ఓయూకు వెళ్తారు. ఎవరు అడ్డుకుంటారో చూస్తాం. 


రాబోయే ఎన్నికల్లో 1, 2, 3 స్థానాలు ఎవరివి?

రాబోయే ఎన్నికల్లో కాంగ్రె్‌సపార్టీ తప్పక గెలుస్తుంది. బీజేపీ తెలంగాణను మోసం చేసింది. పునర్విభజన చట్టంలో మేం పొందుపరిచిన అంశాలను అమలు చేయలేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రధాని నరేంద్రమోదీ అపహాస్యం చేశారు. తెలంగాణ మనుగడును గుర్తించడానికి ప్రధాని మోదీకి ఇష్టం లేదు. అలాంటి బీజేపీకి ఇక్కడి ప్రజలు ఓటేస్తారా? కేసీఆర్‌ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్నారు. అన్ని నేరాల్లో టీఆర్‌ఎస్‌ నాయకులే ఉంటున్నారు. హుజూర్‌నగర్‌, నాగార్జునసాగర్‌లో బీజేపీకి డిపాజిట్లు వచ్చాయా? రాష్ట్రంలో ఎప్పటికీ బీజేపీ ప్రత్యామ్నాయం కాదు. రాష్ట్రం మొత్తంలో విస్తరించి ఉన్న పార్టీలు కాంగ్రెస్‌, టీఆర్‌ఎ్‌సలే. కేసీఆర్‌ నిజాం కన్నా ఎక్కువగా సంపాదించుకున్నారు.


కాంగ్రె్‌సకు ఎన్ని సీట్లు వస్తాయు?

కాంగ్రెస్‌ వ్యూహకర్త సునీల్‌ కనుగోలు, ప్రశాంత్‌ కిశోర్‌  సర్వే చేశారు. నేను పీసీసీ ప్రెసిడెంట్‌ అయ్యాక.. ప్రశాంత్‌ కిశోర్‌ను ఢిల్లీలో కలిశా. తెలంగాణ రాజకీయాలపై చాలాసేపు చర్చించాం. నాతో కలిసి కాంగ్రెస్‌ పార్టీకి పనిచేసేందుకు ఆసక్తి చూపించారు. ఆయనేం స్టడీ చేశారో నాకు వివరించారు. నేను కలిసిన విషయం కేసీఆర్‌కు తెలిసింది. ప్రశాంత్‌ కిశోర్‌ కాంగ్రె్‌సతో జతకలిస్తే టీఆర్‌ఎ్‌సకు నష్టమని ఆయన భావించారు. వెంటనే ఆయనను దగ్గరకు తీసుకున్నారు. ఇటీవల టీఆర్‌ఎస్‌ కోసం ప్రశాంత్‌ కిశోర్‌ రాష్ట్ర రాజకీయాలపై స్టడీ చేశారు. ‘టీఆర్‌ఎ్‌సలోని 65 మంది ఎమ్మెల్యేలకు మళ్లీ సీట్లు ఇస్తే ఓడిపోతారు. అదే జరిగితే పార్టీ మూడో స్థానంలోకి వెళ్తుంది. కేవలం 20 స్థానాల్లోనే టీఆర్‌ఎస్‌ గెలిచే అవకాశం ఉంది. మరో 20 స్థానాల్లో పోటీ తీవ్రంగా ఉండనుంది. 70 స్థానాల్లో టీఆర్‌ఎ్‌సకు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్సే. 20 నుంచి 25 సీట్ల మధ్యన బీజేపీ నుంచి పోటీ ఉంటుంది. టీఆర్‌ఎస్‌ ఓటింగ్‌ శాతం 50 నుంచి 35 శాతానికి పడిపోయే అవకాశముంది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వ్యతిరేక ఓటింగ్‌ కాంగ్రె్‌సకు వెళ్తుంది. అందుకే వీలైనంత వరకు బీజేపీ గ్రాఫ్‌ను పెంచాలి. అలా చేస్తే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓటింగ్‌ టీఆర్‌ఎస్‌ వెంటే ఉంటుంది.’ అని సీఎం కేసీఆర్‌కు ప్రశాంత్‌కిశోర్‌ నివేదిక ఇచ్చారు. 


కాంగ్రెస్‌ చచ్చిన పాము అని కేటీఆర్‌ అన్నారుగా?

కేటీఆర్‌.. మా ప్రధాన ప్రత్యర్థి కేఏ పాల్‌ అనే మాట అన్నారు. ఈ మాట విని కేసీఆర్‌ ఆత్మహత్య చేసుకోవాలి. వంగ్యంగా మాట్లాడాలన్నా కాసింత సెన్స్‌ ఉండాలి. కేటీఆర్‌ను వాళ్ల ఇంట్లోనే సీరియ్‌సగా తీసుకోరు. ఆయన సీఎం అనేది గోడ మీద రాసుకోవాల్సిందే. ఏ రోజు చదివినా కాబోయే సీఎం అనే ఉంటుంది.


యూత్‌ను ఆకర్షించేందుకు ఏం చేస్తారు?

అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా లక్ష ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తానని ప్రకటించా. దానికి భయపడి  ఈ మధ్యనే 25 వేల ప్రభుత్వ ఉద్యోగాలకు సీఎం కేసీఆర్‌ నోటిఫికేషన్‌ ఇచ్చారు. అలాగే రైతు పండించిన ప్రతి పంట గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తాం. డ్రగ్స్‌పై కఠినంగా వ్యవహరిస్తాం. డ్రగ్స్‌ను సరఫరా చేసే వాళ్లను ఎన్‌కౌంటర్‌ చేయించే బాధ్యత తీసుకుంటా. 

Read more