ఖిల్లా మళ్లీ మాదే

ABN , First Publish Date - 2020-10-19T09:52:08+05:30 IST

ఒకప్పుడు కమ్యూనిస్టుల కోటగా ఉన్న ఖమ్మం ఖిల్లా ఇప్పుడు గులాబీ కోటగా మారబోతుందా? ఈసారి కూడా ఖమ్మం ఖిల్లాపై గులాబీ జెండా రెపరెపలాడబోతుందా? అంటే అవుననే అంటున్నాయి అధికార

ఖిల్లా మళ్లీ మాదే

ధీమా వ్యక్తం చేస్తున్న గులాబీ శ్రేణులు

కార్పొరేషన్‌ ఎన్నికలపై టీఆర్‌ఎస్‌ అంతర్గత సర్వే

కార్పొరేటర్ల పరితీరుపై ప్రజల్లో సానుకూలత

స్వల్ప స్థాయిలోనే పోటీ వాతావరణం

అంతా అనుకూలం అంటున్న టీఆర్‌ఎస్‌ శ్రేణులు

ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌


ఖమ్మం, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఒకప్పుడు కమ్యూనిస్టుల కోటగా ఉన్న ఖమ్మం ఖిల్లా ఇప్పుడు గులాబీ కోటగా మారబోతుందా? ఈసారి కూడా ఖమ్మం ఖిల్లాపై గులాబీ జెండా రెపరెపలాడబోతుందా? అంటే అవుననే అంటున్నాయి అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఖమ్మం నగర ప్రజల మనోభావాలు తెలుసుకొనేందుకు అంతర్గత సర్వే నిర్వహించినట్టు సమాచారం. పార్టీ పరిస్థితి, కార్పొరేటర్ల పనితీరుతోపాటు ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను పనితీరు దృష్టిలోపెట్టుకుని సాగించిన సర్వేలో నగర ప్రజలు మళ్లీ టీఆర్‌ఎస్‌కే జైకొట్టినట్టుగా పార్టీ నేతలు పేర్కొంటున్నారు. 


ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న మంత్రి

గత కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఖమ్మంలో టీఆర్‌ఎస్‌ ఘనవిజయం సాధించి ఖిల్లాపై గులాబీ జెండా ఎగురవేసి మేయర్‌, డిప్యూటీమేయర్‌, మెజారిటీ కార్పొరేటర్ల పదవులు సొంత చేసుకున్న విషయం తెలిసిందే. ఖమ్మం కార్పొరేషన్‌ ఎన్నికలకు గడువు ఆరునెలలు ఉండడంతో రాజకీయపార్టీల దృష్టంతా రాబోయే ఎన్నికలపై పడింది. ఈనేపథ్యంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. తన నియోజకవర్గం పరిధిలోనే ఈ ఎన్నిక కావడంతో ఇటు నగర అభివృద్ధి పనులు వేగవంతంగా సాగిస్తూ మరోవైపు రాబోయే కార్పొరేషన్‌ ఎన్నికల కోసం వ్యూహరచన జోరు పెంచారు. 


సర్వేలో టీఆర్‌ఎస్‌ జోరు

టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఖమ్మం కార్పొరేషన్‌లో వాస్తవ పరిస్థితి ఏమిటనే విషయంపై గత నెల 28నుంచి ఈనెల మూడో తేదీ వరకు 50డివిజన్లలో అంతర్గత సర్వే నిర్వహించింది. ఒక్కో డివిజన్‌లో 170నుంచి 180మందిని శాంపిల్స్‌ తీసుకున్నారు. ఈసర్వేలో 46డివిజన్లలో టీఆర్‌ఎస్‌కే జైకొట్టారని, మరో 4డివిజన్లలో కాస్త పోటీ వాతావరణం ఉందని టీఆర్‌ఎస్‌ శ్రేణులు చెబుతున్నాయి. కార్పొరేటర్ల పనితీరుపై 76.18శాతం మంది ప్రజలు అనుకూలంగా చెప్పినట్టు అంతర్గత సర్వేలో వైల్లడయిందని టీఆర్‌ఎస్‌ నేతలు పేర్కొంటున్నారు. 


అభివృద్ధే ప్రధాన ఎజెండా

 నగర ప్రజల మనోగతాల్లో ఖమ్మం నగర అభివృద్ధి ప్రధానంగా చర్చకు వచ్చినట్టు తెలిసింది. సర్వేలో రోడ్లవిస్తరణ, సుందరీకరణ, డ్రెయినేజీ నిర్మాణం, చెరువుల ఆధునికీకరణ, నగరంలో జరుగుతున్న కోట్లాది రూపాయల అభివృద్ధి పనులతో పాటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఖమ్మం నగరం అభివృద్ధిలో పురోగతి విషయాన్ని ప్రస్తావిస్తున్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. గత కార్పొరేషన్‌ ఎన్నికల్లో 50డివిజన్లలో 34 డివిజన్లలో టీఆర్‌ఎస్‌ గెలిచింది. ఆతర్వాత పలువురు కాంగ్రెస్‌, వైసీపీ కార్పొరేటర్లు టీఆర్‌ఎస్‌లో చేరడంతో 43కు బలం పెరిగింది. అందులో ఒక సభ్యుడు టీడీపీలో చేరడంతో ఆతర్వాత 42కు తగ్గింది. 


పనులు పూర్తయ్యాకే ఎన్నికలకు

ఖమ్మం కార్పొరేషన్‌ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ సొంత నియోజకవర్గం కావడంతో ఈసారి ఎన్నికల బాధ్యతను ఆయనే నిర్వహించబోతున్నారు. అభ్యర్థుల ఎంపికతోపాటు మెజారిటీ సీట్లు గెలిపించుకోవడంపై ఇప్పటినుంచే ఆయన అంతర్గతంగా కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా సిట్టింగ్‌ కార్పొరేటర్లలో కొందరికి టికెట్లు దక్కే అవకాశం లేదన్న ప్రచారం టీఆర్‌ఎస్‌లో వినిపిస్తోంది. ఎన్నికల ముందు నగర అభివృద్ధి పనులు శరవేగంగా పూర్తిచేసి ఆతర్వాత ఎన్నికలకు వెళ్లే వ్యూహంతో మంత్రి కసరత్తు చేస్తున్నారు. డిసెంబరు నాటికి నగర అభివృద్ధి పనులన్నీ పూర్తిచేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. దీపావళి నాటికి రూ.25కోట్లతో నిర్మిస్తున్న ఐటీహబ్‌ ప్రారంభించేందకు పనులు వేగవంతం చేశారు.


డిసెంబరు నాటికి రూ.17కోట్లతో నిర్మిస్తున్న కొత్తబస్టాండ్‌ నిర్మాణం, రూ.14కోట్లతో నిర్మిస్తున్న కార్పొరేషన్‌ నూతన భవనం పనులు పూర్తిచేయించేసేందుకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. పేదలకు త్వరలోనే వెయ్యి డబుల్‌బెడ్‌రూంలు ఇళ్ల నిర్మాణం పూర్తిచేసి గృహప్రవేశాలు చేయించబోతున్నారు. రూ.70కోట్లతో నిర్మిస్తున్న గోళ్లపాడు చానల్‌ ఆధునికీకరణతో పాటు రూ.220కోట్లతో చేపట్టిన అమృత్‌ పథకం, మిషన్‌భగీరథ ద్వారా ఖమ్మం నగరంలో అందరికి తాగునీటి వసతి, రూ.75కోట్లతో ధంసలాపురం ఆర్వోబీ, నగరంలో రోడ్ల విస్తరణ, సెంట్రల్‌ లైటింగ్‌, 115 ప్రజామరుగుదొడ్ల నిర్మాణం పూర్తిచేసేందుకు పనులు వేగంగా సాగిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్‌ నాటికి గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన హామీల పనులతోపాటు నగరంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులన్నీ పూర్తిచేయించి ఎన్నికల క్షేత్రంలోకి టీఆర్‌ఎస్‌ దిగే అవకాశం ఉంది.

Updated Date - 2020-10-19T09:52:08+05:30 IST