Abn logo
Aug 25 2021 @ 19:49PM

టీఆర్‌ఎస్‌‌కు భవిష్యత్తు లేదు: ఈటల రాజేందర్‌

జమ్మికుంట: రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీకి భవిష్యత్తు లేదని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ జోస్యం చెప్పారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ హుజూరాబాద్‌లో ఎవరు గెలిచినా తమ ప్రభుత్వం కూలిపోయేది లేదని మంత్రి కేటీఆర్‌ వాఖ్యానించడం బాధాకరమన్నారు. తాను గెలుస్తున్నా అని రిపోర్ట్‌లు వచ్చాయని, ఓడిపోతున్నామనే భయంతో కేటీఆర్‌ ఇలాంటి స్టేట్‌మెంట్‌ ఇస్తున్నారని తెలిపారు. మీరే గెలిస్తే గొర్ల మంద మీద తోడేళ్లు పడ్డట్లు ఎమ్మెల్యేలు, మంత్రులు నియోజకవర్గంపై ఎందుకు పడుతున్నారని ప్రశ్నించారు. సొంత పార్టీ నాయకులను ప్రలోభపెట్టి, ఖరీదు కట్టి చిల్లర పనులు చేసి కేసీఆర్‌ అభాసుపాలయ్యారన్నారు. హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్‌కు డిపాజిట్‌ కూడా రాదని ఈటల ఎద్దేవాచేశారు. ఏడు సంవత్సరాల తర్వాత సీఎం కేసీఆర్ అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేశారన్నారు. తన డిమాండ్‌తోనే సీఎంవో కార్యాలయంలో దళితుడైన రాహుల్‌ బొజ్జాను, ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా లింబాద్రిని నియమించారని తెలిపారు. ఎవరి జాగాలో వారు ఇళ్లు కట్టుకునేందుకు నిధులు ఇవ్వాలని, అర్హులైన ప్రతీ కుటుంబానికి పేద బంధు ఇవ్వాలని ఈటల రాజేందర్‌ డిమాండ్‌ చేశారు.