TS NEWS: వీఆర్ఏలను వేధిస్తున్న టీఆర్ఎస్: విజయశాంతి

ABN , First Publish Date - 2022-09-24T01:04:03+05:30 IST

వీఆర్ఏ(VRA)లను టీఆర్ఎస్ ప్రభుత్వం(TRS GOVT) వేధిస్తోందని బీజేపీ సీనియర్ నేత విజయశాంతి(Vijayashanti) అన్నారు.

TS NEWS: వీఆర్ఏలను వేధిస్తున్న టీఆర్ఎస్: విజయశాంతి

హైదరాబాద్ (Hyderabad): వీఆర్ఏ(VRA)లను టీఆర్ఎస్ ప్రభుత్వం(TRS GOVT) వేధిస్తోందని బీజేపీ సీనియర్ నేత విజయశాంతి(Vijayashanti) అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌(CM KCR)పై సోషల్ మీడియా(Social media) వేదికగా మరోసారి ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రాములమ్మ పోస్టు చేసిన వార్తను యదాతధంగా ఇక్కడ ఇస్తున్నాం. ‘‘కేసీఆర్ సర్కార్ నిరంకుశ పాలన వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక వ్యవస్థలను విధ్వంసం చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు రాక అనేక అవస్థలు పడుతున్నారు. ఇప్పుడు తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్న వీఆర్ఏలపై పోలీస్ శాఖ నిఘా పెంచింది. పేస్కేల్, అర్హులకు ప్రమోషన్లు, వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలనే డిమాండ్‌తో ఈనెల 13న వారు చలో అసెంబ్లీ చేపట్టారు. వీఆర్​ఏలను కట్టడి చేయడంలో ఇంటెలిజెన్స్, పోలీస్ శాఖ విఫలమైందని ప్రభుత్వ పెద్దలు సీరియస్​ కావడంతో వారి కార్యకలాపాలపై పోలీసులు దృష్టి సారించారు. వీఆర్​ఏల వివరాలను ప్రత్యేక ఫార్మాట్‌లో పంపాలని రాష్ట్రంలోని అన్ని పోలీస్​ స్టేషన్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ ఫార్మాట్​ ప్రకారం.. వీఆర్ఏ పేరు, వయస్సు, తండ్రి పేరు/భర్త పేరు, రెసిడెన్షియల్ అడ్రస్​, ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న గ్రామం, మొబైల్ నంబర్, కనీసం ఇద్దరు బంధువుల పేర్లు, వారి మొబైల్ నంబర్లు పోలీసులు సేకరిస్తున్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వీఆర్ఏల వివరాలను పోలీస్ శాఖ సేకరించడం ఎంతవరకు సమంజసం? వీఆర్ఏలను బెదిరింపులకు గురిచేయడం కోసమే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోంది. ఏం కేసీఆర్... రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తానని చెప్పి ఈ వేధింపులేంటి? ఉద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం బతికి బట్ట కట్టినట్టు చరిత్రలో లేదు. ఈ కేసీఆర్ సర్కార్ కూడా రానున్న రోజుల్లో కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం’’ అని విజయశాంతి హెచ్చరించారు. 



Updated Date - 2022-09-24T01:04:03+05:30 IST