Abn logo
Jun 13 2021 @ 23:54PM

గరీబోళ్ల పక్షాన టీఆర్‌ఎస్‌ సర్కారు

గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మున్సిపల్‌ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న మంత్రి హరీశ్‌రావు, ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, వంటేరు ప్రతాప్‌రెడ్డి, పాలకవర్గం

నయాపైసా ఖర్చు లేకుండా అర్హులైన పేదలకు ‘డబుల్‌’ ఇళ్లు 

ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలి

అభివృద్ధిలో రాష్ట్రానికే ఆదర్శంగా గజ్వేల్‌

రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు

లబ్ధిపొందిన వాళ్లు ప్రభుత్వాన్ని విమర్శిస్తే సూర్యుడిపై ఉమ్మినట్లే

ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌


గజ్వేల్‌, జూన్‌ 13 : టీఆర్‌ఎస్‌ సర్కార్‌ గరీబోళ్ల పక్షాన ఉంటుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ రోజాశర్మ, కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డితో కలిసి ఆదివారం ఆయన గజ్వేల్‌ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ నిజమైన నిరుపేదలకు లబ్ధి చేకూర్చేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్‌ అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. నిరుపేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు దక్కాలన్నదే సీఎం లక్ష్యమన్నారు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అర్హులకు అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందజేస్తామన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో సొంత జాగా ఉంటే ప్రభుత్వం ద్వారా డబుల్‌ బెడ్రూం ఇళ్లు నిర్మించుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నామన్నారు. కరోనాతో ఖర్చు పెరిగి ఆదాయం తగ్గిందని అయినప్పటికీ సంక్షేమ పథకాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయన్నారు. కొడకండ్ల డబుల్‌ బెడ్రూం కాలనీకి ప్రధాన రోడ్డు, వీధి దీపాలు వేస్తామని తెలిపారు. కొడకండ్లకు మరో 50 ఇళ్లను మంజూరు చేస్తామన్నారు. మున్సిపాలిటీలో బిగ్‌డేటా ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక చేస్తామని, పైరవీకారులను నమ్మొద్దని సూచించారు. లంచం ఇచ్చినా, తీసుకున్న వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుకుందాం

గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మున్సిపల్‌ భవనం అద్భుతంగా నిర్మించామని, అదేవిధంగా గజ్వేల్‌ మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకుందామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. కేసీఆర్‌ గజ్వేల్‌లో అడుగుపెట్టగానే పట్టణ రూపురేఖలు, దశ, దిశ మారిందన్నారు. కలలో కూడా అనుకోని విధంగా మున్సిపల్‌ అభివృద్ధి చెందిందన్నారు. తాగునీటి అవసరాలతో పాటు కాళేశ్వరం నీళ్లతో చెరువులను నింపామని, మండుటెండల్లో చెరువులను నింపుకున్నామని తెలిపారు. ఈ ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. తెలంగాణకు గజ్వేల్‌ పట్టణం ఆదర్శంగా నిలిచిందన్నారు. గజ్వేల్‌ తరహా సమీకృత మార్కెట్‌ను రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో నిర్మించేందుకు రూ.500 కోట్లను కేసీఆర్‌ మంజూరు చేశారన్నారు. అద్భుతమైన షాదీఖానా నిర్మితమైందని, అన్ని సామగ్రితో కూడా షాదీఖానా గజ్వేల్‌లోనే ఉందన్నారు. మదీనా మజీద్‌ వద్ద కాంప్లెక్స్‌ నిర్మాణం కోసం సంజీవరావు, విజయరామారావు, గీతారెడ్డి చుట్టూ తిరిగినా కాలేదని, ఒక్క సంతకంతో రెండు కోట్ల రూపాయలు కేటాయించి సీఎం కేసీఆర్‌ అందించారన్నారు. నవంబర్‌ వరకు యూజీడీ పనులు పూర్తి చేసి రోడ్లను నిర్మింపజేస్తామన్నారు. ఎలక్షన్ల కోసం తాము పనిచేయమని, ప్రజల కోసం పనిచేస్తామన్నారు. వాక్సినేషనే సంజీవని అని, ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలని మంత్రి కోరారు. మాస్కులను ఎట్టి పరిస్థితుల్లో తీయొద్దని, కరోనా ఇంకా ఖతమ్‌ కాలేదని చెప్పారు. 

లబ్ధిదారుల్లో ఆనందం చూస్తున్నా

లబ్ధిపొందిన వాళ్లు ప్రభుత్వాన్ని విమర్శిస్తే సూర్యుడిపై ఉమ్మినట్లుంటదని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ అన్నారు. ఇళ్లను పొందిన లబ్ధిదారుల కళ్లల్లో ఆనందం చూస్తుంటే సంతోషంగా ఉందన్నారు. దేశానికే అన్నం పెట్టేలా తెలంగాణ రాష్ట్రం ఎదిగిందన్నారు. ప్రతి వ్యక్తికీ ప్రభుత్వంతో లబ్ధి జరిగింది తెలంగాణలోనే అని చెప్పారు. తెలంగాణలో కేసీఆర్‌ పుట్టడమే ప్రజల అదృష్టమని, ప్రజలంతా కేసీఆర్‌ వెంటే ఉంటూ ఆయన అడుగుజాడల్లో నడుస్తారన్నారు. కొడకండ్లలో రూ.3,72 కోట్ల వ్యయంతో నిర్మించిన 56 డబుల్‌ బెడ్రూం ఇళ్లను ప్రారంభించడంతో పాటు గజ్వేల్‌ నుంచి క్యాసారం వరకు రూ.10.75 కోట్లతో నిర్మించనున్న డబుల్‌ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఎరువుల విక్రయకేంద్రంను మంత్రులు ప్రారంభించారు. గజ్వేల్‌లో నిర్మించిన 1250 డబుల్‌ ఇళ్ల లబ్ధిదారులకు దరఖాస్తుల ఎంపికను ప్రారంభించారు. రూ.45 లక్షలతో నిర్మించిన ప్రొహిబిషన్‌, ఎక్సెజ్‌ కార్యాలయాన్ని, రూ.3.45 లక్షలతో నిర్మించిన షాదీఖానాను ప్రారంభించారు. అనంతరం రూ.3 కోట్లతో నిర్మించనున్న ఆర్యవైశ్య భవనానికి శంకుస్థాపన చేశారు. రూ.7.80 కోట్ల వ్యయంతో నిర్మించిన గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ పురపాలిక కార్యాలయాన్ని ప్రారంభించారు. వారివెంట డీసీసీబీ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి, గడ ఎస్‌వో ముత్యంరెడ్డి, ఆర్డీవో విజయేందర్‌రెడ్డి, టూరిజం కార్పొరేషన్‌ చైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌, మున్సిపల్‌ చైర్మన్‌ రాజమౌళి, వైస్‌చైర్మన్‌ జకీయొద్దీన్‌, ఏఎంసీ చైర్‌పర్సన్‌ అన్నపూర్ణ, ఎంపీపీ అమరావతి, జడ్పీటీసీ పంగ మల్లేశం, టీఎంసీ చైర్మన్‌ సయ్యద్‌ యూసుఫ్‌, కౌన్సిలర్లు, నాయకులు తదితరులున్నారు.