మునుగోడులో టీఆర్‌ఎస్‌ ‘చివరి పోటీ’..

ABN , First Publish Date - 2022-10-07T08:14:37+05:30 IST

మునుగోడు పోరుకు గులాబీ దండు కదిలింది.

మునుగోడులో టీఆర్‌ఎస్‌ ‘చివరి పోటీ’..

  • మునుగోడులో టీఆర్‌ఎస్‌ ‘చివరి పోటీ’
  • కేటీఆర్‌కు గట్టుప్పల్‌-1 బాధ్యతలు
  • మర్రిగూడ ఇన్‌చార్జ్‌గా హరీశ్‌రావు 
  • ఉప ఎన్నికపై కేటీఆర్‌ అంతర్గత సమీక్ష

హైదరాబాద్‌, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): మునుగోడు పోరుకు గులాబీ దండు కదిలింది. ఉప ఎన్నికకు మరి కొద్ది రోజులే సమయం ఉండటంతో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని బయలుదేరింది. బతుకమ్మ, దసరా పండుగలు ముగియడం, బీఆర్‌ఎస్‌ ఏర్పాటు ప్రకటన పూర్తి కావడంతో.. నియోజకవర్గంలో నేతల మోహరింపునకు టీఆర్‌ఎస్‌ సిద్ధమైంది. కీలకమైన ఈ ఉప ఎన్నికలో విజయం సాధించి తీరాలన్న పట్టుదలతో ఉన్న పార్టీ అధినేత కేసీఆర్‌.. కీలక నేతలకు బాధ్యతలను అప్పగించారు. వారందరినీ శుక్రవారమే మునుగోడు నియోజకవర్గం వెళ్లిపోవాలని ఆదేశించారు. మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఒక్కో ప్రాంతాన్ని కేటాయించారు. ప్రతి ఎంపీటీసీ పరిధిని ఒక మంత్రి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల్లో ఎవరో ఒకరికి అప్పగించారు. ఒక్కో ఎంటీపీసీ పరిధిలో 2,500-3,000 మంది వరకు ఓటర్లున్నారు.


నియోజకవర్గాన్ని 86 యూనిట్లుగా విభజించి మంత్రులు, ఎమ్మెల్యేలను మోహరిస్తున్నారు. ప్రతి మంత్రి, ఎమ్మెల్యే 30 మంది నేతల బృందంతో మునుగోడుకు వెళ్తున్నారు. ఈ బృంద సభ్యులకు ఒక్కో ఎంపీటీసీ పరిధిలోని 3 వేల మందిని విభజించి, 100 మందికి ఒకరు చొప్పున బాధ్యతలు అప్పగించనున్నారు. మునిసిపాలిటీల్లో వార్డుల వారీగా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలను నియమించారు. కాగా, మంత్రి కేటీఆర్‌ మునుగోడు ఉప ఎన్నికపై తన అంతర్గత బృందంతో గురువారం సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గ పరిస్థితి, అక్కడ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. 


ఎవరెవరు ఎక్కడంటే..?

మునిసిపాలిటీల్లో ప్రతి రెండు వార్డులకు ఒకరు, ఒక్కో ఎంపీటీసీ పరిధిలో ఒకరి చొప్పున పార్టీలోని కీలక నేతలకు ఇన్‌చార్జ్‌ బాధ్యతలను అప్పగించారు. చండూరు మునిసిపాలిటీలో 10 వార్డులుంటే ఐదుగురు ఎమ్మెల్యేలను బాధ్యులుగా నియమించారు. చండూరు మండలానికి 11 మందిని ఇన్‌చార్జులుగా వేశారు. చౌటుప్పల్‌ మునిసిపాలిటీలో 10 మంది ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించారు. చౌటుప్పల్‌ మండలానికి 12 మందిని ఇన్‌చార్జులుగా నియమించారు. మర్రిగూడ మండలానికి 11 మంది, మునుగోడు మండలానికి 13 మంది, నాంపల్లి మండలానికి 11 మంది, నారాయణపురం మండలానికి 13 మందిని వేశారు. చండూరు మండలం గట్టుప్పల్‌ గ్రామానికి మంత్రి కేటీఆర్‌, చండూరు మునిసిపాలిటీలో 2, 3 వార్డులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, చౌటుప్పల్‌ మునిసిపాలిటీలోని 2, 3 వార్డులకు మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌, చౌటుప్పల్‌ మండలం ఆరెగూడెం గ్రామానికి మంత్రి మల్లారెడ్డి, డి.నాగారం గ్రామానికి మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, మర్రిగూడకు మంత్రి హరీశ్‌ రావు, డి.బి పల్లికి మంత్రి నిరంజన్‌రెడ్డి, నాంపల్లి మండల కేంద్రంలో ఒక ప్రాంతానికి మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, అదే మండలం పసునూరుకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి, నారాయణపూర్‌ మండల కేంద్రంలోని ఓ భాగానికి మంత్రి గంగుల కమలాకర్‌, అదే మండలం పొర్లగడ్డ తండాకు మంత్రి సత్యవతి రాథోడ్‌, సర్వేల్‌ గ్రామంలో ఓ భాగానికి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిని ఇన్‌చార్జ్‌లుగా నియమించారు. 


మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ తరఫునే అభ్యర్థిని బరిలో దింపనున్నారు. పార్టీ పేరును టీఆర్‌ఎస్‌ నుంచి బీఆర్‌ఎ్‌సగా మార్చే ప్రక్రియ కోసం అవసరమైన తీర్మానాలు చేయడం, వాటిని కేంద్ర ఎన్నికల సంఘానికి అందించే పనిని పూర్తి చేశారు. అయితే దీనికి ఈసీఐ నుంచి అనుమతి వచ్చేందుకు కొంత సమయం పడుతుంది. దీంతో మునుగోడులో టీఆర్‌ఎస్‌ పేరుతోనే బరిలోకి దిగనున్నారు. ఈ విషయాన్ని ఆంధ్రజ్యోతి ముందే చెప్పింది. మరోవైపు టీఆర్‌ఎస్‌ పార్టీ పేరు మీద ఇదే చివరి పోటీ కానుంది.

Updated Date - 2022-10-07T08:14:37+05:30 IST