బెదిరింపులకు పాల్పడుతున్న టీఆర్‌ఎస్‌

ABN , First Publish Date - 2021-10-23T06:08:39+05:30 IST

అవినీతి సొమ్ముతో అక్రమాలే లక్ష్యంగా వ్యవహరిస్తున్న టీఆర్‌ఎస్‌ పార్టీ బెదిరింపులకు పాల్పడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ అన్నారు.

బెదిరింపులకు పాల్పడుతున్న టీఆర్‌ఎస్‌
హుజూరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతున్న బండి సంజయ్‌

 -ఎన్నికలు వాయిదా వేయాలనే ఆలోచనలో భాగమే కిషన్‌రెడ్డిపై దాడి

- అవినీతి సొమ్ముతో అక్రమాలే లక్ష్యంగా వ్యవహరిస్తున్న టీఆర్‌ఎస్‌ 

- కేంద్ర మంత్రిపై దాడికి నిరసనగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు

- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌

హుజూరాబాద్‌ రూరల్‌, అక్టోబరు 22:  అవినీతి సొమ్ముతో అక్రమాలే లక్ష్యంగా వ్యవహరిస్తున్న టీఆర్‌ఎస్‌ పార్టీ బెదిరింపులకు పాల్పడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం హుజూరాబాద్‌ పట్టణంలోని మధువని గార్డెన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామంలో ప్రచారం చేస్తున్న సమయంలో టీఆర్‌ఎస్‌ నాయకులు దాడులు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి హయాంలో దాడి జరిగిందన్నారు. ఎన్నికలు వాయిదా వేయాలనే ఆలోచనలో భాగమే కిషన్‌రెడ్డిపై దాడి చేశారని అన్నారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో వంద కోట్లు ఖర్చు పెట్టినా టీఆర్‌ఎస్‌ గెలవని పరిస్థితి ఉందన్నారు. డిపాజిట్‌ వచ్చే పరిస్థితి లేదన్నారు. ఏ సర్వే అయినా బీజేపీ గెలుస్తాయంటున్నాయన్నారు. హుజూరాబాద్‌ ఎన్నిక కోసమే దళితబంధు పథకం తీసుకొచ్చి ఈ పథకాన్ని అమలు చేయలేక బీజేపీని బదనాం చేస్తున్నారన్నారు. ప్రభుత్వ భూములను అమ్ముతూ, ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేస్తున్నారన్నారు. ఈటల గెలవడం, టీఆర్‌ఎస్‌ ఓడిపోవడం పక్కా అన్నారు. దాడులు చేసి అడ్డుకుంటామంటే ఊరుకోం ఖబడ్దార్‌ అన్నారు. టీఆర్‌ఎస్‌ నాయకుల దాడికి సీఎం కేసీఆర్‌ క్షమాపణ చెప్పాలన్నారు. పోలీసులు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని అన్నారు. ఎన్నికల కమిషన్‌కు దాడిపై ఫిర్యాదు చేస్తామన్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిపై దాడికి నిరసనగా శనివారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతామన్నారు. ఈ సందర్భంగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ మాట్లాడుతూ హుజూరాబాద్‌లో ఓడిపోతామని కేసీఆర్‌కు భయం పట్టుకుందన్నారు. ఓటమి భయంతోనే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిపై దాడి చేసే ప్రయత్నం చేశారన్నారు. అవినీతి సొమ్మును ఉపయోగించి గెలుస్తామనే బ్రమ సీఎం కేసీఆర్‌కు తొలిగిపోయిందన్నారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక కోసమే దళితబంధు ప్రవేశపెట్టారని, దళితబంధు ఇవ్వడం కేసీఆర్‌కు ఇష్టం లేదన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, హైద్రాబాద్‌ మాజీ మేయర్‌ కార్తీకరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-23T06:08:39+05:30 IST