టీఆర్‌ఎస్‌ బాక్సులు బద్దలు కొట్టాలి..

ABN , First Publish Date - 2021-10-21T06:04:11+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ గర్వం అణిచే విధంగా హుజూరాబాద్‌ ప్రజలు టీఆర్‌ఎస్‌ బాక్సులు బద్దలు కొట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ అన్నారు.

టీఆర్‌ఎస్‌ బాక్సులు బద్దలు కొట్టాలి..
వెంకటేశ్వరపల్లిలోని దళితబస్తీలో భోజనం చేస్తున్న బండి సంజయ్‌కుమార్‌, బీజేపీ నాయకులు

 హుజూరాబాద్‌ ప్రజలకు రెండు రోజుల ముందే దీపావళి వస్తోంది

 బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌

జమ్మికుంట రూరల్‌, అక్టోబరు 20: ముఖ్యమంత్రి కేసీఆర్‌ గర్వం అణిచే విధంగా హుజూరాబాద్‌ ప్రజలు టీఆర్‌ఎస్‌ బాక్సులు బద్దలు కొట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ  బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. బుధవారం జమ్మికుంట మండలంలోని మడిపల్లె, సైదాబాద్‌లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ తరుపున ప్రచారం నిర్వహించారు. బీజేపీ వాళ్లు దళితబంధు ఆపాలని ఈసీకి లేఖ రాశారని అబద్ధాలు ఆడుతున్నారు.. టీఆర్‌ఎస్‌ వళ్లే దళితబంధు ఆగిందని నేను నిరూపిస్తా.. సీఎం పదవికి కేసీఆర్‌ రాజీనామా చేస్తారా అని  సవాల్‌ విసిరారు. హుజూరాబాద్‌లో జరుగుతున్న ఉప ఎన్నికలో ప్రజలు ఇచ్చే తీర్పు.. తెలంగాణలో మార్పు తెస్తుందన్నారు. హుజూరాబాద్‌ ప్రజలకు రెండు రోజుల ముందే దీపావళి వస్తోందని, నవంబరు 2న ఈటల రాజేందర్‌ గెలుపుతో పండుగ జరుపుకుందామన్నారు. హరీష్‌ అన్నా.. అబద్ధాలు ఆడకు.. పేదవాళ్ల ఉసురు తగులుతుందన్నారు. ఈ నెల 27తర్వాత ఇక్కడ ఉండేది ఈటల రాజేందర్‌ మాత్రమే, మీకు సేవ చేసేది కూడా ఆయనే అని చెప్పారు. ఈటల కాంగ్రెస్‌లోకి పోతాడని టీఆర్‌ఎస్‌ వాళ్లు అసత్యపు ప్రచారాలు చేస్తున్నారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ డ్రామాలు అన్నారు. ఎన్నికలయ్యాక టీఆర్‌ఎస్‌లో ఎవ్వరూ మిగలరని, కేసీఆర్‌, కేటీఆర్‌, కవిత తప్ప అందరూ బీజేపీలోకి వస్తారని తెలిపారు. బీజేపీని గెలిపిస్తే ప్రగతి భవన్‌ గడీలు బద్దలు కొట్టి దళితబంధు డబ్బులు అందేలా కొట్లాడతానని పేర్కొన్నారు. కేంద్రం రాష్ట్రానికి 10 కోట్లు ఇచ్చి మూడు లక్షల ఇళ్లు కట్టాలని చెబితే కేసీఆర్‌ మాత్రం ఒక్క డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కూడా కట్టలేదని, రుణమాఫీ చేస్తానని మాట తప్పిండని విమర్శించారు.ఇదేంటని ఈటల రాజేందర్‌ పేదల కోసం ప్రశ్నిస్తే కేసీఆర్‌ ఆయనను బయటకు పంపించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, ధర్మారావు, సంపత్‌రావు తదితరులు పాల్గొన్నారు.


 దళితుల ఇంట్లో భోజనం


ప్రచారం సందర్భంగా జమ్మికుంట మండలంలోని వెంకటేశ్వరపల్లి దళిత బస్తీలోని పుల్లూరి రవి ఇంట్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌, నాయకులు భోజనం చేశారు. 

Updated Date - 2021-10-21T06:04:11+05:30 IST