టీఆర్‌ఎస్‌..ఇక బీఆర్‌ఎస్‌

ABN , First Publish Date - 2022-10-03T07:55:44+05:30 IST

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ.. ఇకపై భారత రాష్ట్ర సమితిగా మారనుంది. తెలంగాణ పరిధి నుంచి జాతీయ స్థాయి పార్టీగా రూపాంతరం చెందనుంది.

టీఆర్‌ఎస్‌..ఇక బీఆర్‌ఎస్‌

  • భారత రాష్ట్ర సమితిగా జాతీయస్థాయికి..
  • జెండా రంగు గులాబీనే.. గుర్తు కారే!
  • దసరా మర్నాటి నుంచే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ
  • గుర్తు కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి
  • డిసెంబరు 9న ఢిల్లీలో భారీ బహిరంగ సభ
  • మహారాష్ట్ర నుంచి పార్టీ ప్రచారం ప్రారంభం
  • తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటకలపై దృష్టి
  • 4 రాష్ట్రాల్లో 60కి పైగా ఎంపీ సీట్లలో గెలుస్తాం
  • జాతీయ పార్టీ అయ్యాక భారీగా సభ్యత్వ పెంపు
  • పార్టీ నేతలకు ఇక దేశవ్యాప్తంగా అవకాశాలు
  • గవర్నర్లు, ఇన్‌చార్జులుగా పనిచేసే అవకాశం
  • రాష్ట్ర మంత్రులు, జిల్లా పార్టీ అధ్యక్షులతో భేటీలో
  • కేసీఆర్‌ వెల్లడి.. బీజేపీ విఫలమైందని వ్యాఖ్య


హైదరాబాద్‌, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ.. ఇకపై భారత రాష్ట్ర సమితిగా మారనుంది. తెలంగాణ పరిధి నుంచి జాతీయ స్థాయి పార్టీగా రూపాంతరం చెందనుంది. ఉద్యమ పార్టీ నుంచి.. ప్రాంతీయ పార్టీ అధినేతగా మొదలైన కేసీఆర్‌ ప్రస్థానం జాతీయ పార్టీ అధ్యక్షుడి స్థాయికి చేరనుంది. విజయదశమి రోజు మధ్యాహ్నం 1.19 నిమిషాలకు కేసీఆర్‌ జాతీయ రాజకీయ పార్టీని ప్రకటించనున్నారు. పార్టీ జెండా ఇప్పుడున్నట్లు గులాబీ రంగులోనే ఉంటుంది. ఒకరకంగా చెప్పాలంటే ఇప్పుడున్న జెండానే ఉండనుంది. పార్టీ గుర్తు కూడా కారే ఉంటుంది. ఆ గుర్తే ఉండేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని అడగనున్నారు. సీఎం కేసీఆర్‌ ఆదివారం స్వయంగా తొలిసారి పార్టీ నేతలకు జాతీయ పార్టీ గురించి ఈ వివరాలు వెల్లడించారు. వాస్తవానికి టీఆర్‌ఎస్‌ పార్టీని 2001లో రిజిస్ట్రేషన్‌ చేసినప్పుడు.. పార్టీ పరిధిని తెలంగాణ ప్రాంతం వరకే పేర్కొన్నారు.  పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సమితిగా పేర్కొన్నారు. ఇప్పుడు ఆ పార్టీ పేరు స్థానంలో భారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్‌)అని మార్చనున్నారు.


 పరిధిని తెలంగాణ నుంచి మార్చి దేశవ్యాప్తం చేయనున్నారు. ఈ మేరకు అవసరమైన పత్రాలను సిద్ధం చేసి దసరా రోజున తీర్మానం చేస్తారు. ఆరోజు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, రాష్ట్ర మంత్రులందరితో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నారు. జాతీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించిన తీర్మానంపై అదే రోజు 283 మంది సంతకాలు చేయనున్నారు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, డీసీసీబీ, డీసీఎంఎ్‌సల అధ్యక్షులు.. సంతకాలు చేసే వారిలో ఉండనున్నారు. దసరా రోజు సంతకాలు చేస్తారు. మర్నాటి నుంచే జాతీయ పార్టీ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆరో తేదీన ఆ పత్రాలతో ఢిల్లీ వెళ్తారు. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయ్యాక.. డిసెంబరు 9న ఢిల్లీలో ఒక భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. అన్నీ అనుకున్నట్లు సాగితే ఉప ఎన్నిక నాటికి మునుగోడులో మూడూ జాతీయ పార్టీలే తలపడనున్నాయని కేసీఆర్‌ అన్నట్లు తెలిసింది. 


నాలుగు రాష్ట్రాలపై గురి..

జాతీయ పార్టీ ఏర్పాటయ్యాక ప్రధానంగా తెలంగాణతోపాటు ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలపై దృష్టి సారించనున్నట్లు కేసీఆర్‌ వెల్లడించారు.  ఈ నాలుగు రాష్ట్రాల్లో కలిపి 100కు పైగా సీట్లున్నాయని.. వీటిలో 50-60 స్థానాలు గెలుస్తామని కేసీఆర్‌ ధీమా వ్యక్తంచేశారని తెలిసింది. మహారాష్ట్రలో రైతులు ఎక్కువమంది ఉన్నారని, ఆ రాష్ట్రం నుంచే ప్రచారం ప్రారంభిద్దామని ఆయన వెల్లడించినట్లు సమాచారం. మహారాష్ట్రలో మరఠ్వాడా ప్రాంతం, కర్ణాటకలోని తెలుగు ప్రాంతాలు, బెంగళూరు వంటి నగరాల్లోనూ పార్టీకి ఆదరణ ఉంటుందని కేసీఆర్‌ ఈ భేటీలో అభిప్రాయపడ్డారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో మరే రాష్ట్రంలోనూ లేవని, రాష్ట్రంలో ఉన్న అభివృద్ది మరెక్కడా లేదని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి, ఇక్కడ అమలు చేస్తున్న సంక్షేమం గురించే ప్రచారం చేస్తూ దేశవ్యాప్తంగా ఇలాగే చేస్తామంటే జనం నుంచి ఆదరణ లభిస్తుందని పేర్కొన్నారు. రైతాంగ అజెండా, రైతాంగ సంక్షేమం, దళిత సంక్షేమం ప్రధాన అజెండాలుగా ఉంటాయన్నారు.


సభ్యత్వం పెంచాలి

జాతీయ పార్టీగా ఏర్పడ్డాక తెలంగాణలో సైతం ఇప్పుడున్న సభ్యత్వం సరిపోదని, భారీగా పార్టీ సభ్యత్వం పెంచాలని కేసీఆర్‌ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. బయటి రాష్ట్రాల నుంచి కూడా మంచి స్పందన ఉందని.. పార్టీ పెట్టిన సత్వరమే ఆదరణ లభిస్తుందని తెలిపారు. పార్టీ నేతలకు జాతీయ స్థాయి కూడా అవకాశాలు వస్తాయని.. వివిధ రాష్ట్రాల్లో పార్టీ తరఫున ఇన్‌చార్జులుగా పనిచేసే అవకాశం, అదేవిధంగా జాతీయ స్థాయిలో ప్రభుత్వం ఏర్పాటులో కీలకమైతే గవర్నర్‌ అవకాశాలు తదితరాలు వస్తాయని అన్నట్లు తెలిసింది. పార్టీలోని కీలక నేతలకు ఏయే బాధ్యతలు అప్పగించాలన్న దానిపైనా చర్చించినట్లు సమాచారం. 


ప్రధానే అలా అనడం దారుణం

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందని కేసీఆర్‌ ఈ భేటీలో విమర్శించినట్లు సమాచారం. ‘‘బీజేపీ చాలా నియంతృత్వంగా వెళ్తోంది. ప్రధాని మోదీ పశ్చిమబెంగాల్‌ పర్యటనకు వెళ్లి తృణమూల్‌ ఎమ్మెల్యేలు 40మంది మాతో టచ్‌లో ఉన్నారని అన్నారు. ఎవరో అనడం కాదు. ప్రధానే ఇలా అనడం దారుణం. దేశంలో ప్రజాస్వామ్యం కాకుండా నియంతృత్వం ఉన్నట్లుగానే బీజేపీ వ్యవహరిస్తోంది’’అని కేసీఆర్‌ వ్యాఖ్యానించినట్లు సమాచారం.

Updated Date - 2022-10-03T07:55:44+05:30 IST