వేములపల్లిలో అలజడి

ABN , First Publish Date - 2020-06-04T10:58:15+05:30 IST

ద్వారపూడి పంచాయతీ వేములపల్లిలో కరోనా అలజడి కొనసాగుతోంది. తాజాగా బుధవారం ఒకరికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ ..

వేములపల్లిలో అలజడి

గ్రామంలో మరొకరికి కరోనా పాజిటివ్‌.. పదికి చేరిన కేసులు

మూడు రోజులుగా గ్రామస్థులకు శ్వాబ్‌ పరీక్షలు

పరిసర గ్రామాల ప్రజల్లో ఆందోళన


మండపేట, జూన్‌ 3: ద్వారపూడి పంచాయతీ వేములపల్లిలో కరోనా అలజడి కొనసాగుతోంది. తాజాగా బుధవారం ఒకరికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో ఈ గ్రామంలో వైరస్‌ సోకిన వారి సంఖ్య పదికి చేరుకుంది. గత మూడు రోజులుగా పీహెచ్‌సీ వైద్యాధికారిణి డాక్టర్‌ పి.ప్రసన్న, సిబ్బంది శ్వాబ్‌ నమూనాలు సేకరిస్తున్నారు. కాగా ఈ గ్రామాన్ని రెడ్‌జోన్‌గా ప్రక టించారు. ఇక్కడి పాజిటివ్‌ కేసులతో పక్కనే వున్న జడ్‌.మేడపాడు, ఇతర ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. బుధవారం అదనపు డీఎంహెచ్‌వో డాక్టర్‌ కోమల వేములపల్లి వచ్చి పరీక్షలు చేస్తున్న విధానాన్ని పరిశీలించారు. వైద్య సేవలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అమె వెంట డాక్టర్‌ ప్రసన్న, హెల్త్‌ సూపర్‌వైజరు టీవీ సత్యనారాయణ ఉన్నారు. కాగా ఈ గ్రామంలో 75ఏళ్ల  వృద్ధురాలు మరణించింది. సహజ మరణమైనా, కరోనా లక్షణాలు లేకపోయినా వైద్యులు ఆమె నమూనాలు సేకరించి పరీక్షలకు పంపించామని వైద్యులు తెలిపారు. ఎంపీడీవో గౌతమి, ఈవోపీఆర్డీ రాజు గ్రామంలో పర్యటించి పారిశుధ్య నిర్వహణ, ప్రజల ఇబ్బందులపై పంచాయతీ కార్యదర్శి సుబ్బారావును అడిగి తెలుసుకున్నారు. 


కొరుపల్లిలో ఒకరికి..

కరప, జూన్‌ 3: కరప మండలం కొరుపల్లిలో మరో కరోనా పాజిటివ్‌ కేసు వెలుగుచూసింది. గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలకు పాజిటివ్‌ రాగా, అదే కుటుంబంలోని ఒక వృద్ధుడికి తాజాగా పాజిటివ్‌ నిర్ధారణయింది. మండల వైద్యాధికారి శ్రీనివాసనాయక్‌, ఎస్‌ఐ రామారావుబాధితుడిని అంబులెన్స్‌పై వైజాగ్‌ విమ్స్‌ ఆసుపత్రిలోని ఐసోలేషన్‌కు తరలించారు. బాధితులతో ప్రైమరీ కాంటాక్ట్‌లో ఉన్న 45 మందికి ఈనెల 1న కొవిడ్‌ టెస్ట్‌లు చేయించగా కొరుపల్లిలోని వృద్ధుడికి మినహా మిగిలినవన్నీ నెగిటివ్‌గా తేలడంతో అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. గ్రామంలో పారిశుధ్య పనులు చేపట్టారు.


అల్లవరం ఐదుగురికి, మలికిపురంలో ఒకరికి..

ముమ్మిడివరం/అల్లవరం, జూన్‌ 3: మండలంలోని అనాతవరం ప్రసిద్ధ ఇంజనీరింగ్‌ కళాశాల క్వారంటైన్‌ సెంటర్‌లో ఉన్న  ఆరుగురికి కరోనా పాజిటివ్‌ నిర్థారణ అయింది. ముంబై నుంచి మే31న వచ్చిన వలస కార్మికులను క్వారంటైన్‌కు తరలించారు. ఈనెల1న 49మందికి పరీక్షలు నిర్వహించగా అల్లవరం మండలం ఎంటికోనకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన భర్త(42), భార్య(32), కుమారుడు(22), కుమార్తెలు (16, 14),  మలికిపురం మండలానికి చెందిన పదేళ్ల బాలుడికి పాజిటివ్‌ వచ్చింది. వీరిని అమలాపురం కిమ్స్‌ కొవిడ్‌ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుత కేసులతో కలిపి అల్లవరంలో కొవిడ్‌ కేసుల సంఖ్య పదికి చేరింది.


ఎన్‌.పెదపాలెంలో ఇద్దరికి..

అయినవిల్లి, జూన్‌ 3: మండలంలోని నేదునూరు పెదపాలెంలో భార్యాభర్తలకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణయిందని పీహెచ్‌సీ వైద్యాధికారి బి.మంగాదేవి తెలిపారు. వారిని అమలాపురం కిమ్స్‌ కొవిడ్‌ ఆసుపత్రికి తరలించారు. అమలాపురం రూరల్‌ సీఐ రుద్రరాజు భీమరాజు, అయినవిల్లి ఎస్‌ఐ జి.వెంకటేశ్వరరావు, ఎంపీడీవో కేఆర్‌ విజయ గ్రామాన్ని సందర్శించి, ప్రజలకు జాగ్రత్తలు సూచించారు. 


బిక్కవోలులో మరొకరికి..

బిక్కవోలు, జూన్‌ 3: స్థానిక అంబటిపేటలో 80 ఏళ్ల వృద్ధురాలికి బుధవారం కొవిడ్‌-19 నిర్ధారణ అయ్యిందని పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ రాజీవ్‌ తెలిపారు. గత నెల 31న ఇదే ప్రాంతంలో కరోనా పాజిటివ్‌ వచ్చిన మహిళ తల్లి ఈమె. దీంతో మండలంలో కొవిడ్‌ కేసుల సంఖ్య 21కి చేరుకుంది.

Updated Date - 2020-06-04T10:58:15+05:30 IST