పొటాష్‌ కోసం పాట్లు

ABN , First Publish Date - 2021-10-02T04:27:04+05:30 IST

వ్యవసాయశాఖ అధికారుల అనాలోచిత నిర్ణయాలతో రైతులకు ఏటా ఎరువుల కష్టాలు తప్పడం లేదు. రైతులకు ఇంటింటా ఎరువులు, పురుగుల మందులు పంపిణీ చేస్తామని చెప్పిన ప్రభుత్వ ప్రకటనలు ఆచరణకు నోచుకోవడం లేదు. అరకొరగా పొటాష్‌ను కేటాయించడంతో అన్నదాతలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పొటాష్‌ కోసం మండుటెండలో గంటల తరబడి నిరీక్షిస్తున్నారు.

పొటాష్‌ కోసం పాట్లు
నరసన్నపేట : పొటాస్‌ కోసం క్యూలో ఉన్న రైతులు

- రైతులకు సక్రమంగా అందని ఎరువులు

- మండుటెండలో తప్పని ఇబ్బందులు

(టెక్కలి/నరసన్నపేట)

వ్యవసాయశాఖ అధికారుల అనాలోచిత  నిర్ణయాలతో రైతులకు ఏటా ఎరువుల కష్టాలు తప్పడం లేదు. రైతులకు ఇంటింటా ఎరువులు, పురుగుల మందులు పంపిణీ చేస్తామని చెప్పిన ప్రభుత్వ ప్రకటనలు ఆచరణకు నోచుకోవడం లేదు. అరకొరగా పొటాష్‌ను కేటాయించడంతో అన్నదాతలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పొటాష్‌ కోసం మండుటెండలో గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. 

జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌లో 2.10లక్షల హెక్టార్లకు పైగా వరి సాగు చేస్తున్నారు. రైతుభరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైన యూరియా పంపిణీ చేస్తామన్న వ్యవసాయశాఖ అధికారులు.. సకాలంలో సరఫరా చేయడం లేదు. చిరుపొట్ట దశలో ఉన్న వరిపంటకు ప్రస్తుతం పొటాష్‌ ఎరువు ఎంతో అవసరం. కానీ, రైతుభరోసా కేంద్రాల ద్వారా సక్రమంగా ఎరువులు అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల టెక్కలి వచ్చిన వ్యవసాయశాఖ జేడీ.. వారం రోజుల్లో జిల్లాలో 1,650 మెట్రిక్‌ టన్నుల పొటాష్‌ పంపిణీ చేస్తామని చెప్పారు. కానీ, ఆ పరిస్థితి ఎక్కడా కానరావడం లేదని రైతులు వాపోతున్నారు. ఉదాహరణకు నరసన్నపేట మండలంలో 5,700 ఎకరాలకు పైగా వరి సాగు చేస్తున్నారు. ఎకరాకు 20 కేజీల నుంచి 25 కేజీల వరకు పొటాష్‌ అవసరం. దీని ప్రకారం మండలానికి 2,500 బస్తాలు అవసరం. జిల్లా అధికారులు కేవలం 600 బస్తాలు మాత్రమే కేటాయించారు. నిల్వలు తక్కువగా ఉండడంతో రైతుభరోసా కేంద్రాల్లో కాకుండా.. శుక్రవారం ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో పంపిణీ చేశారు. దీంతో అన్నదాతలు పొటాష్‌ ఎరువు కోసం ఉదయం నుంచి బారులుదీరారు. మండుటెండలో ఇబ్బందులు పడ్డారు. 


మార్కెట్‌లో కూడా కొరతే!

మార్కెట్‌లో కూడా పొటాష్‌ ఎరువులు దొరకని పరిస్థితి నెలకొంది. ఇటీవల టెక్కలికి చెందిన ఓ హోల్‌సేల్‌ డీలర్‌ కాకినాడ నుంచి మొజాయిక్‌ పొటాష్‌ 200 మెట్రిక్‌టన్నులు జిల్లాకు తీసుకువచ్చారు. వీటిని కొన్ని మండలాల డీలర్లకు విక్రయించారు. తమ అనుమతి లేకుండా విక్రయాలు సాగించారనే ఉద్దేశంతో వ్యవసాయశాఖ అధికారులు వీటి విక్రయాలను నిలిపేశారు. దీంతో మార్కెట్‌లో కూడా పొటాష్‌ దొరక్కపోవడంతో ఏం చేయాలో తెలియక రైతులు సతమతమవుతున్నారు. రైతుభరోసా కేంద్రాల ద్వారా పూర్తిస్థాయిలో ఎరువులు పంపిణీ చేయాలని కోరుతున్నారు.  ఈ విషయమై వ్యవసాయశాఖ ఏడీ బీవీ తిరుమలరావు వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా మండలానికి 20 మెట్రిక్‌టన్నులు చొప్పున పొటాష్‌ ఎరువులు పంపిణీకి చర్యలు తీసుకుంటామని తెలిపారు. బస్తా ధర 1,040 రూపాయలుగా  నిర్ణయించామన్నారు.  

Updated Date - 2021-10-02T04:27:04+05:30 IST