‘ట్రూ’ షాక్‌

ABN , First Publish Date - 2022-08-12T06:36:58+05:30 IST

‘ట్రూ’ షాక్‌

‘ట్రూ’ షాక్‌

ఉమ్మడి జిల్లాలో విద్యుత్‌ వినియోగదారులపై  రూ.395 కోట్ల భారం

యూనిట్‌పై 0.22 పైసల చొప్పున వడ్డింపు

మూడేళ్ల పాటు నెలకు రూ.11 కోట్ల వడ్డన


(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : విద్యుత్‌ వినియోగదారులకు ట్రూ అప్‌ షాక్‌ తగులుతోంది. మూడేళ్ల పాటు వినియోగదారులపై ఈ భారం పడనుంది. 2014-19 సంవత్సరాలకు సంబంధించిన విద్యుత్‌ నష్టాలపైౖ ట్రూ అప్‌ చార్జీలను వసూలు చేసుకునేందుకు విద్యుత్‌ నియంత్రణ మండలి ఆమోదం తెలపడంతో అధికారులు ఈ వడ్డింపునకు రంగం సిద్ధం చేశారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో మొత్తం రూ.395 కోట్లను ట్రూ అప్‌ రూపంలో వసూలు చేయాలని సీపీడీసీఎల్‌ అధికారులు నిర్ణయించారు. ఈ నెల బిల్లుల్లోనే ఈ చార్జీలు విధిస్తారు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఇప్పుడు ట్రూ అప్‌ చార్జీలు మరింత భారం కానున్నాయి. 2014-19 వరకూ డిస్కంలకు నష్టాలు వచ్చాయి. సీపీడీసీఎల్‌ 57,175.05 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను విక్రయించింది. ఇందులో రూ.1,232.56 కోట్ల నష్టం వచ్చిందని అధికారులు చెబుతున్నారు. సీపీడీసీఎల్‌ పరిధిలోని విజయవాడ, ఒంగోలు, గుంటూరు, అమరావతి సర్కిళ్ల పరిధిలో ఉన్న వినియోగదారుల నుంచి ఈ మొత్తాన్ని ట్రూ అప్‌గా వసూలు చేయాలని నిర్ణయించారు. ఈ రూ.395 కోట్లను నెలకు రూ.11 కోట్ల చొప్పున వినియోగదారుల నుంచి వసూలు చేస్తారు.

ప్రతి యూనిట్‌పై 22 పైసల భారం

సీపీడీసీఎల్‌ అధికారులు ప్రతినెలా ఒక్కో యూనిట్‌పై 22 పైసలను ట్రూ అప్‌ చార్జీగా వసూలు చేస్తారు. ఈ విధంగా మొత్తం 36 నెలల పాటు అంటే.. మూడేళ్లు వసూలు చేస్తారు. ఈ నెల నుంచే ట్రూ అప్‌ వడ్డింపు ఆరంభమైనందున 1/22 అని చూపిస్తున్నారు. అదే వచ్చే నెల బిల్లులో 2/22గా చూపిస్తారు.సీపీడీసీఎల్‌ విజయవాడ సర్కిల్‌ పరిధిలో మొత్తం 17 లక్షల వరకు విద్యుత్‌ కన్జెక్షన్లు ఉన్నాయి. గృహ, వాణిజ్య, పారిశ్రామిక కనెక్షన్లు 16 లక్షల 30 వేల వరకు ఉన్నాయి. వీరందరిపై మొత్తంగా రూ.270 కోట్ల భారం పడుతుంది. ట్రూ అప్‌ చార్జీల విధింపునకు వ్యతిరేకంగా ఇప్పటికే ప్రజా సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. దీనిపై ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వస్తోంది. అయినా సీపీడీసీఎల్‌ అధికారులు వెనక్కి తగ్గట్లేదు.  వాస్తవానికి గడిచిన ఏడాది నుంచే ట్రూ అప్‌ చార్జీలు వసూలు చేయాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా ఆగస్టుకు రూ.47.44 కోట్లు, సెప్టెంబరుకు రూ.46.73 కోట్లు వసూలు చేశారు. ప్రజా వ్యతిరేకత తీవ్రం కావడంతో తర్వాత ఈ వడ్డనకు విరామం ఇచ్చారు. విద్యుత్‌ నియంత్రణ మండలి స్పందించి వసూలు చేసిన మొత్తాలను వినియోగదారులకు వెనక్కి ఇవ్వాలని ఆదేశించింది. ఈ రెండు నెలలు వసూలు చేసిన మొత్తాన్ని తర్వాత బిల్లుల్లో సర్దుబాటు చేశారు. ఇప్పుడు మళ్లీ ట్రూ అప్‌ బాదుడు ఆరంభం కావడంతో వినియోగదారులు తలలు పట్టుకుంటున్నారు. 


Updated Date - 2022-08-12T06:36:58+05:30 IST