Chitrajyothy Logo
Advertisement

సినీ పరిశ్రమకు ఎందుకీ అవమానం!

twitter-iconwatsapp-iconfb-icon

హీరోలను జీరోలు అనడం సబబేనా?
కష్టం అంటే మొదట ముందుకొచ్చేది సినిమా వాళ్లే..
ఎంత చేసినా సినిమా వాళ్లకు ఎందుకీ అవమానం!
హెల్ప్‌ ఎవర్‌.. హర్ట్‌ నెవర్‌ అన్నదే  సిద్దాంతం!

హీరో ఎప్పటికీ హీరోనే.. కొత్త హీరో వచ్చాడు కదా అని పాత హీరోలను మరచిపోలేం కదా! దేశంలో విపత్కర పరిస్థితులు ఎదురైన ప్రతిసారీ ముందుగా మన హీరోలే.. సేవ చేసే హీరోలుగా మారి సాయం అందిస్తూ వచ్చారు. అందుకు చాలా ఉదాహరణలున్నాయి. కరోనా కష్ట సమయంలో ఒక నటుడు ఎక్కువగా ప్రజల కోసం ఆలోచిస్తూ సేవలు చేస్తున్నాడని పాత హీరోల్ని, గతంలో వారు చేసిన సాయాన్ని మరచిపోతున్నారు. సాయం చేసిన వాడిని మరచిపోకూడదు అంటారు. మరచిపోకపోయినా ఫర్వాలేదు. అలాంటి వారిని తక్కువ చేయకూడదు, కించపరచకూడదు. ఓ పెద్ద గీత కనిపిస్తుంది కదా అని పక్కన ఉన్న గీతలు.. గీతలు కాకుండా పోవు. ఆ పెద్ద గీత ఎంతో.. మిగతా గీతలన్నీ కలిపితే అంతే అవుతాయి. ఆ విషయాన్ని మరచి తెలుగు చిత్ర పరిశ్రమను, హీరోలను జీరోలు అనడం కరెక్ట్‌ కాదని కొందరు విశ్లేషకులు, అభిమానులు అంటున్నారు. సినిమా పరిశ్రమ అంటే అంత లోకువ ఏంటి? ‘రామేశ్వరం వెళ్లినా శనిశ్వరం తప్పలేదు’ అన్నట్లు సినిమా పరిశ్రమ ప్రజలకు, అభిమానులకు ఎంత చేసినా నిందలు, విమర్శించడాలు తప్పవా? అంటూ సినీ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేశారు. అసలు విషయంలోకి వెళ్తే..

సినీ పరిశ్రమకు ఎందుకీ అవమానం!

గత ఏడాది లాక్‌డౌన్‌ మొదలైనప్పటి నుంచి దేశ వ్యాప్తంగా ఎంతో మంది మృత్యు వాతపడ్డారు. ఉపాధి లేక కార్మికులు, పేదలు రోడ్డున పడ్డారు. ఇలాంటి కష్టమైన పరిస్థితుల్లో మానవత్వం ఉన్న ఎవరైనా ముందడుగు వేసి తమకు తోచిన సాయం చేస్తారు. వివిధ రంగాల వారు చేశారు కూడా. అయితే ఎంతమంది ఎన్ని చేసినా, ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌ తర్వాత.. సేవ అంటే సంవత్సర కాలంగా వినిపిస్తున్న పేరు సోనూసూద్‌. సినిమా నాలెడ్జ్‌ ఉన్న ప్రతి ఒక్కరికీ ఈయన గురించి తెలుసు. స్టార్‌ విలన్‌ అనీ, మంచి మనసున్న వ్యక్తి అనీ, సినిమాల్లోనే విలన్‌ నిజజీవితంలో హీరో అనీ కరోనా మహమ్మారి వలన జనాలకు తెలిసింది.

సినీ పరిశ్రమకు ఎందుకీ అవమానం!

సోనూ సోలో శక్తి కాదు...
అవును... సోనూ రియల్‌ హీరోనే! ఎందుకంటే.. ఆయన చేస్తున్న సేవలు మరచిపోలేనివి. ముంబైలో రోజుకి వేల మందికి అన్నదానంతో సేవ మొదలుపెట్టి, బస్సులు, కార్లు, విమానాలు, రైళ్లు ఇలా అనేక మార్గల ద్వారా వలస కార్మికులను తమ సొంత ఊర్లకు పంపిన ఘనత ఆయనది. కష్టం అన్న వారికి ప్రాంతంతో సంబంధం లేకుండా ఏం కావాలో తెలుసుకుని అవి అందచేశారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రాణవాయువు అందక మరణిస్తున్న వారికి ప్రాణవాయువును ఇంటి గుమ్మం ముందుకు చేర్చుతున్నారు. దీని కోసం ఆయన వెనక పెద్ద యంత్రాంగమే నడుస్తోంది. కాల్‌ సెంటర్లు, ఫోన్‌ నంబర్లు, సోషల్‌ మీడియా అనేక మాధ్యమాల ద్వారా కష్టం అన్నవారికి ఆపద్భాందవుడిలా ఆదుకుంటున్నారు. ఐతే సోనూ సినిమా మనిషి కాబట్టి ఇంత ఫోకస్‌లో ఉన్నాడు. ఆయనను కొలిచే వారే కాదు.. ఆయనను విమర్శించే మనుషులూ ఉన్నారు. విలన్‌ పాత్రలు చేస్తూ సంపాదిస్తూ, ముంబైలో రెండు హోటల్స్‌తో బిజినెస్‌ చేసే ఆయన అడిగిందే క్షణంగా ఇంత సేవ ఎలా చేస్తున్నాడు? విలన్‌గా, వ్యాపారుస్థుడిగా సంపాదించిన దానితోనే ఇవన్నీ చేస్తున్నాడా? లేక.. ఆయన వెనుక రాజకీయ, బడాబాబుల అండ ఏమైనా ఉందా? అనే ప్రశ్నలు సంధించేవారూ ఉన్నారు. అయితే తను ఎలా చేస్తున్నాడూ అనేదాని కంటే.. ఎంత మంచి జరుగుతుంది అన్నది ముఖ్యం. ‘మంచి చేసేవారిని ప్రోత్సహించడం మనసున్నవారి లక్షణం’ అని పెద్దలు తరచూ చెబుతుంటారు. ఇక్కడ ప్రోత్సహించకపోగా పంగ నామాలు పెట్టే బ్యాచ్‌ ఎక్కువైంది. అయితే ఒక విషయం గమనించాలి. ఎంత ఉన్నా.. పెట్టే గుణం కూడా ఉండాలి. అది సోనూలో ఉంది. కాబట్టే మంచి పనులు చేస్తున్నాడు. సోనుసూద్‌ చేసే సేవ మొత్తం ఆయన చేతిదే కాదు. ఈ విషయంలో సేవలు ప్రారంభించిన మొదటి రోజే ఆయన క్లారిటీ ఇచ్చారు. ‘‘నా స్నేహితులు రోహిత్‌ శెట్టి, ఫరాఖాన్‌ తదితరులు, సన్నిహితుల చాలామంది నా వెనకుండి సహాయం చేస్తూ, విరాళాలు ఇస్తూ నన్ను ముందుకు నడిపిస్తున్నారు. ఈ సేవ చేసే భాగ్యం నాకు కలిగింది’ అని కరోనా మొదటి వేవ్‌ సమయంలోనే చెప్పుకొచ్చారు. అయితే సోనూ సరైన సమయంలో స్పందించడంతో ఆయన హీరోగా మారాడు. ఇక తెలుగు పరిశ్రమ విషయానికొస్తే..

సినీ పరిశ్రమకు ఎందుకీ అవమానం!

ఇవి కంటికి కనిపించడం లేదా?
ఇదే సేవను ప్రతి సినీ పరిశ్రమలో ఎంతోమంది హీరోలు, హీరోయిన్‌లు దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు తమ శక్తి మేరకు చేస్తూనే ఉంటారు. అది జనాలకు తెలిసేలా కావచ్చు.. తెలియకుండా కూడా కావచ్చు. అవన్నీ బయటకు రాకపోవచ్చు. అయితే ట్రోలర్స్‌కు మాత్రం పైకి కనిపించే వారే గొప్ప. గుప్త సాయాలు చేసేవారు ట్రోలర్స్‌ దృష్టిలో నథింగ్‌!  ఉదాహరణకు తెలుగు చిత్ర పరిశ్రమను తీసుకుంటే.. కష్టం, విపత్కర పరిస్థితి అంటే ముందు స్పందించే పరిశ్రమ తెలుగు చిత్ర పరిశ్రమే! అందుకు చాలా ఉదాహరణలున్నాయి. దేశవ్యాప్తంగా జాతీయ విపత్తులు ఎదురైనప్పుడు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి సహాయ నిధులకు కోట్ల రూపాయిలు విరాళాలు ఇచ్చారు. 1952 నుంచి చూసుకుంటే ఎన్టీఆర్‌, ఏయన్నార్‌, కృష్ణ నుంచి ఆ తర్వాతి తరం చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్‌, నాగార్జున, అలాగే నేటి యువ హీరోల వరకూ విపత్కర పరిస్థితుల్లో ‘మేముసైతం’ అంటూ సాయం చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో కరువు సంభవించినప్పుడు ఊరురా తిరిగి డొనేషన్లు కలెక్ట్‌ చేశారు. వాటితోపాటు హీరోలుగా వారి భాగం కూడా ఇచ్చి కరువు ప్రాంతాలను ఆదుకున్నారు. దివి సీమ ప్రాంతాన్ని ఆదుకున్నారు. పోలీసుల కోసం ఫండ్‌ రైజ్‌ చేశారు. క్రికెట్‌ ఆడారు, షోలు చేశారు. కేరళలో వరదలు, హైదరాబాద్‌ భారీ వర్షాలతో మునిగిపోయినప్పుడు చిత్ర పరిశ్రమ పలు కార్యక్రమాలు నిర్వహించి ఆపదలో ఉన్నవారిని ఆదుకుంది. సునామీ, హుద్‌హుద్‌, తిత్లీ తుఫాన్‌లాంటి కష్టకాలంలో ప్రతిసారీ అభిమానులను, ప్రాంతాలతో సంబంధం లేకుండా ప్రజలను ఆదుకుంటూనే ఉన్నారు. ఇలాంటివేమీ ట్రోల్‌ చేసేవారికి కనిపించవు.

సినీ పరిశ్రమకు ఎందుకీ అవమానం!

సీసీసీ ఊపిరి పోసింది!
ఉదాహరణకు కరోనా సమయాన్నే తీసుకుంటే గత ఏడాది లాక్‌డౌన్‌లో సినిమా షూటింగ్‌లు లేక ఉపాధి కోల్పోయి పట్టెడు అన్నం లేక అలమటించిన వేలాది మంది కార్మికులను సినీ పరిశ్రమ అండగా ఉంది. 24 శాఖల కార్మికుల కోసం చిరంజీవి తన సహ నటులతో, సురేశ్‌బాబు, అరవింద్‌, దాము, తమ్మారెడ్డి భరద్వాజ, సి.కల్యాణ్‌ వంటి నిర్మాతలంతా చిరంజీవి అధ్యక్షతన సీసీసీ ప్రారంభించారు. మొదట చిరంజీవి కోటి రూపాయిలు విరాళంగా ఇచ్చి ‘కరోనా క్రైసిస్‌ ఛారిటీ’ని ప్రారంభించారు. ఆయన పిలుపు మేరకు ఛారిటీ కోసం పవన్‌కల్యాణ్‌, ప్రభాస్‌, మహేశ్‌, ఎన్టీఆర్‌, చరణ్‌, బన్నీ, నాని, పలువురు దర్శకులు, నిర్మాణ సంస్థలు చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా పరిశ్రమ వారంతా పేద కళాకారులను, సాంకేతిక నిపుణులను ఆదుకున్నారు. దాదాపు 15000 కుటుంబాలకు రెండు విడతలుగా నిత్యావసర వస్తువులు, అపోలో సౌజన్యంతో తక్కువ ఖర్చుకే మందులు ఇచ్చి ఆసరాగా నిలిచారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి సహాయ నిధులకు కోట్లు, లక్షలు సమర్పించుకున్నాక స్వచ్చందంగా పరిశ్రమ కోసం తీసుకున్న స్టెప్‌ ఇది.

సినీ పరిశ్రమకు ఎందుకీ అవమానం!

ఇప్పుడు ప్రాణ వాయువు కోసం...
సీసీసీ పేరుతో సినీ కార్మికులకు నిత్యావసర వస్తువులు, వ్యాక్సిన్‌, మందులు ఏర్పాటు చేసిన చిరంజీవి ఇప్పుడు అభిమాన సంఘాల అండతో రెండు తెలుగు రాష్ట్రాలో ఆక్సిజన్‌ ప్లాంట్లు పెట్టే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పటికే బుధవారం కొన్ని జిల్లాలకు ఆక్సిజన్‌ సిలెండర్లు చేరుకున్నాయి. మరో రెండు రోజుల్లో 6 జిలాల్లలో ఆక్సిజన్‌ అందుబాటులోకి వెళ్లనుంది.  ఆక్సిజన్‌ కొరత వల్ల ఏ వ్యక్తి మరణించకూడదు అన్న సంకల్పంతోనే ఆక్సిజన్‌ ప్లాంట్‌లను ఏర్పాటు చేస్తున్నారు చిరంజీవి. బిగ్‌బీ అమితాబ్‌ కూడా తెలుగు పరిశ్రమ కోసం ఆర్థిక సాయం చేశారు. బాలకృష్ణ కేన్సర్‌ ఆసుపత్రి ద్వారా ఎన్నో సేవలను అందిస్తున్నారు. కరోనా ప్రారంభమైనప్పుడు హిందూపూర్‌లో ఆయన ప్రత్యేక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పీపీఈ కిట్లు, మాస్క్‌లు, శానిటైజర్‌లను అక్కడి ప్రజలకు అందచేశారు. సురేశ్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ వైజాగ్‌లో ఉన్న రామానాయుడు స్టూడియోను ఐసోలేషన్‌ వార్డులుగా మార్చింది. అలాగే దర్శకుడు సుకుమార్‌ రూ.40లక్షల వ్యయంతో రాజోలు ప్రాంతంలో ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేశారు. అలాగే ఎంతో మంది నటీనటులు సాంకేతిక నిపుణులు గుప్తంగా చాలా సేవ కార్యక్రమాలు చేస్తున్నారు. 

సినీ పరిశ్రమకు ఎందుకీ అవమానం!

హెల్ప్‌ ఎవర్‌.. హర్ట్‌ నెవర్‌ అన్నదే  సిద్దాంతం!
అలనాటి మేటి నటులు ఎన్టీఆర్‌, ఎస్వీఆర్‌, ఏయన్నార్‌, కృష్ణ, చిత్తూరు నాగయ్య. సావిత్రి, దాసరి నారాయణరావు ఆనాటి ప్రజల సమస్యలకు స్పందించి ఎంతో సేవ చేశారు. సావిత్రి అయితే వంటి మీద నగలు తీసి దానం చేసిన సందర్భాలున్నాయి. అదే సంప్రదాయాన్ని నేటితరం స్టార్లు కొనసాగిస్తున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌, నాగార్జున, మహేశ్‌, ప్రభాస్‌. అల్లు అర్జున్‌, ప్రకాష్‌ రాజ్‌, పవన్‌ కళ్యాణ్‌ ఇలా ఒక్కరేంటి యావత్‌ తెలుగు హీరోలు, సహ నటులు దర్శక నిర్మాతలు అందరూ వారివారి స్థోమత కొద్ది ప్రతీ విపత్తులో సామూహికంగా కాని వ్యక్తిగతంగా కాని ఆదుకోవాలని తపన పడుతూనే ఉంటారు. హీరో నిఖిల్ కరోనా కష్టాల్లో చాల మందిని ఆదుకున్నాడు. హీరోయిన్లు ప్రణీత, నిధి అగర్వాల్‌, ప్రియాంక చోప్రా, అనుష్కాశర్మ కూడా ఇటీవల కొంత ఫండ్‌ కరోనా బాధితుల కోసం ఏర్పాటు చేశారు. బాలీవుడ్‌లో కంగనా రనౌత్‌ ప్రతి ఒక్కరినీ విమర్శిస్తుంది, రూల్స్‌ మాట్లాడుతుంది. కానీ ఇప్పటి వరకూ ఆమె చేసిన సాయం ఇంచు కూడా లేదు.

సినీ పరిశ్రమకు ఎందుకీ అవమానం!


ఎందుకు జీరోలను చేస్తున్నారు?
‘‘తెలుగు సినిమా హీరోలు కోట్లు కోట్లు పారితోషికం తీసుకోవడంలో చూపించే శ్రద్థ, సోనూసూదు లాగా ఆదుకోవడంలో చూపించరు. వీళ్లు తెరపైనే హీరోలు నిజజీవితంలో జీరోలు’’ అని సోషల్‌ మీడియాలో మీమ్స్‌, ట్రోల్‌ చేస్తున్నారు. కొందరు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. సోషల్‌ మీడియా ఖాతా, చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ ఉన్న ప్రతి ఒక్కరూ విమర్శిస్తునే ఉన్నారు. ‘చిరంజీవి చేపల కూర వండాడు, నాగార్జున ఇంకేదో చేశాడు. రాజమౌళి ఇల్లు ఉడ్చాడు. తారక్‌ మొక్కలకి నీళ్లు పోశాడు’ వీళ్లకి సమాజం పట్ల బాధ్యత లేదు. ప్రజల సొమ్మును రెమ్యూనరేషన్‌గా తీసుకుంటూ ప్రజలకు కష్టాలు వస్తే పట్టించుకోని జీరోలు తెలుగు హీరోలు’ అంటూ ట్రోల్‌ చేస్తున్నారు. అసలు ఈ ట్రోల్‌ చేసే వారు ఇంట్లో తల్లిదండ్రులకు ఓ ముద్ద అయినా పెడతారా? పక్కన ఆపదలో ఉన్న వారికి పది రూపాయలు సాయం చేస్తారా? అంటూ అభిమానులు మండిపడుతున్నారు. అసలు ఈ ట్రోల్‌ చేసేవారు, వీడియోల్లో పిచ్చి కూతలు కూసేవారు రాజకీయ నాయకులను, బడా బాబులను ప్రశ్నించగలరా.. వారిని విమర్శించే ధైర్యం ఉందా’ అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. అవగాహనా రహితంగా సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడేవారంతా సమాజంలో వారి స్థాయి ఏంటో తెలుసుకోవాలని హితవు పలుకుతున్నారు సినీ ప్రేమికులు. వీరందరికీ కేవలం సినిమా వాళ్లే డబ్బున్న వారిలా కనిపిస్తారా? కోట్లుకు కోట్లు అక్రమంగా సంపాదించి ప్రజల కోసం రూపాయి ఖర్చు పెట్టలేనివారు సినీ హీరోలను విమర్శించే అర్హత ఉందా? అని ఇటీవల కర్నూల్‌కి చెందిన అభిమాని ఓ వీడియోలో నిలదీసి అడిగారు. ఈ సమాజంలో బాగా సంపాదించిన లాయర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు ఇలా అధిక సంపాదన ఉన్న వారని ఎందుకు ట్రోల్‌ చేయలేరు. ఎందుకు ప్రశ్నించలేరు. సినిమా వాళ్లంటే అంత లోకువా? అని మండిపడుతున్నారు. ‘ట్రోల్‌ చేసే వారికి ఇంగిత జ్ఞానం కూడా లేదు. కాబట్టే తాము ఏమీ చేయలేక మంచి చేసేవారి వెనుకపడి విమర్శిస్తున్నారు’ అంటూ వాపోతున్నారు.
నువ్వు సేవ చెయ్యక పోయినా ఫర్వాలేదు కానీ చేసేవాడి మీద రాళ్లు వేయడం, కించపరచడం తప్పు’ అన్నది ట్రోలర్స్‌, విమర్శించేవారు తెలుసుకుంటే మంచిది.

సినీ పరిశ్రమకు ఎందుకీ అవమానం!


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement