సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేశారు!

ABN , First Publish Date - 2020-09-07T05:54:53+05:30 IST

మొదట నాకు ‘కరోనా పాటిజివ్‌’ అనే వార్త బయటకు రాగానే కొందరు సోషల్‌ మీడియాలో ఊహించని కామెంట్లతో ట్రోల్‌ చేయడం మొదలుపెట్టారు...

సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేశారు!

ఏ లక్షణాలూ లేకుండానే ‘కరోనా పాజిటివ్‌’ అంటూ రిపోర్ట్‌... మర్నాడు పరీక్షల్లో నెగెటివ్‌ అని నిర్థారణ... ఈ గందరగోళం మధ్య ఆత్మస్థైర్యంతో నిలబడ్డారు భారత బ్యాడ్మింటన్‌ డబుల్స్‌ స్టార్‌, కామన్‌వెల్త్‌ పతక విజేత సిక్కి రెడ్డి. ఇప్పుడు మళ్ళీ ట్రాక్‌లో పడి, నేషనల్‌ క్యాంప్‌లో ప్రాక్టీస్‌ చేస్తున్న ఆమె కరోనా కాలంలో తన అనుభవాలను ‘నవ్య’తో పంచుకున్నారు.


‘‘నాకు ‘కరోనా పాజిటివ్‌’ అని తెలియగానే షాక్‌గా అనిపించింది. ఎందుకంటే నాకు టెస్ట్‌ చేసిన రోజు కూడా ఎప్పటిలానే నాలుగైదు గంటలు తీవ్రంగా సాధన చేశాను. మామూలు అలసటే తప్ప శరీరంలో ఎలాంటి ఇబ్బందీ అనిపించలేదు. నిజానికి క్రీడాకారుల్లో ఆ అలసట సర్వసాధారణమే. ఏదో ఒక టోర్నమెంట్‌ ఆడుతూనే ఉంటాను. రోజూ ఆరేడు గంటలు ప్రాక్టీస్‌ చేస్తాను. లాక్‌డౌన్‌ తొలగించిన తరువాత ప్రారంభమైన జాతీయ శిక్షణ శిబిరానికి హాజరై సాధన మొదలు పెట్టాను. అక్కడ మాకు కరోనా పరీక్షలు చేశారు. నాకు ‘పాజిటివ్‌’ అని చెప్పేసరికి ఆశ్చర్యపోయాను. ధైర్యాన్ని మాత్రం కోల్పోలేదు. కానీ మా అమ్మ డయాబెటిస్‌ పేషెంట్‌ కావడంతో ఆమె గురించి కంగారు పడ్డాను. నా ఆరోగ్యంలో మార్పులేవీ కనిపించకపోవడంతో మర్నాడు ఒక ప్రైవేట్‌ ఆస్పత్రిలో  మరోసారి పరీక్ష చేయించుకున్నాను. ‘నెగెటివ్‌’ రావడంతో ఊపిరి పీల్చుకున్నాను. అయితే కొన్నాళ్ళు ఐసోలేషన్‌లో ఉండాలని నిర్ణయించుకున్నాను. తొలిసారి నిర్వహించిన ‘కొవిడ్‌-19’ వైద్య పరీక్షల్లో పాజిటివ్‌గా రిపోర్టు ఎందుకు వచ్చిందో ఇప్పటికీ అర్థం కావడం లేదు. ఎందుకైనా మంచిదని మా కుటుంబ సభ్యులతో పాటు, ఇంట్లో పనివారికి కూడా కరోనా వైద్య పరీక్షలు చేయించాను. ఏ ఒక్కరికీ ‘పాజిటివ్‌’ అని రిపోర్టు రాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నాను.


మొబైల్‌ పక్కన పడేశాను!

మొదట నాకు ‘కరోనా పాటిజివ్‌’ అనే వార్త బయటకు రాగానే  కొందరు సోషల్‌ మీడియాలో ఊహించని కామెంట్లతో ట్రోల్‌ చేయడం మొదలుపెట్టారు. ‘‘మిగిలిన వారికి కరోనా అంటించడానికి కావాలనే క్యాంప్‌కి వెళ్లావా? ఇంట్లో ఉండకుండా బయట ఎందుకు తిరుగుతున్నావ్‌? ఇంకా ఎక్కడికి వెళ్ళబోతున్నావ్‌?’’ అంటూ వికృతమైన వ్యాఖ్యలు చేశారు. వాటిని చూసి బాధ కలిగింది. వెంటనే మొబైల్‌ను పక్కన పెట్టేశాను. కుటుంబ సభ్యులకు తప్ప ఎవరికీ అందుబాటులో లేకుండా ఏకాంతంగా గడిపాను. అనవసరమైన భయాందోళనలు దరి చేరకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకున్నాను.


ఫిట్‌నెస్‌ కాపాడుకుంటూ..

బ్యాడ్మింటన్‌ విషయానికొస్తే, నా పదేళ్ళ కెరీర్‌లో ఇంత సుదీర్ఘ విరామం ఎన్నడూ తీసుకోలేదు. ఈ నాలుగు నెలలు బ్యాడ్మింటన్‌కు దూరమవడం బాధ కలిగించినా, మరోవైపు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడిపేందుకు వీలు దొరకడం సంతోషంగా అనిపించింది. తీరిక లేని షెడ్యూల్‌తో కుటుంబాన్ని మిస్‌ అవుతున్నాననే దిగులును ఈ లాక్‌డౌన్‌ విరామం పోగొట్టింది. బ్యాడ్మింటన్‌ కోర్టుకు వెళ్ళి సాధన చేసే వెసులుబాటు లేకపోవడంతో నా భర్త సుమీత్‌తో కలిసి ఇంట్లోనే అందుబాటులో ఉన్న వనరులతో ప్రాక్టీస్‌ కొనసాగించాను. పూర్తిస్థాయిలో మ్యాచ్‌ ప్రాక్టీస్‌ చేసే సౌలభ్యం లేకపోవడంతో ఫిట్‌నెస్‌ కాపాడుకోవడానికే ఎక్కువ సమయం వెచ్చించాను. ‘శాయ్‌’ (స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా) ఆన్‌లైన్‌ శిక్షణ తరగతులు నాకు బాగా ఉపయోగపడ్డాయి. గోపీచంద్‌ సార్‌ ఇచ్చిన మాడ్యూల్స్‌ను ఎప్పటికప్పుడు ఫాలో అవడంతో గేమ్‌ టెంపోలో పెద్దగా వ్యత్యాసం రాలేదు. ఇటీవల నేషనల్‌ క్యాంప్‌లో అడుగుపెట్టిన కొద్ది సేపటికే మునపటిలా ఆడగలిగాను.


వంటలతో ‘ఆహా!’ అనిపించా!

లాక్‌డౌన్‌ వల్ల ఇంటికే పరిమితమవడంతో వంటింట్లో నా ప్రయోగాలు ఎక్కువైపోయాయి. వాటినే అప్పుడప్పుడు సోషల్‌ మీడియాలో పెడుతున్నా. ‘కీమా పలావ్‌’, ‘పిజ్జా’ అంటే నాకు చాలా ఇష్టం. అమ్మ సహాయంతో ఇంట్లోనే నాకిష్టమైన వాటిని తయారు చేసి రుచి చూస్తున్నా. లాక్‌డౌన్‌లో రోజుకో కొత్త డిష్‌ చేస్తూ ఇంట్లో అందరి నోటా ‘ఆహా!’ అనిపించాను. నేను పుస్తకాలు ఎక్కువ చదువుతుంటాను. ఈ ఖాళీ సమయంలో ఆటోబయోగ్రఫీలు, మానసిక ఉల్లాసం కలిగించే పుస్తకాలు చదివేందుకు సమయం కేటాయించాను. అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌లో వెబ్‌ సిరీస్‌లు బాగా చూశాను.


ఒలింపిక్స్‌ కోసం సిద్ధమవుతున్నా

సోషల్‌ మీడియా, యూట్యూబ్‌లో నా ఆరోగ్యం గురించి వస్తున్న వదంతులను ఎవరూ నమ్మకండి. నేను పూర్తి ఆరోగ్యంతో ఉన్నాను. వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్‌ కోసం గోపీచంద్‌ అకాడమీలో నిర్వహిస్తున్న జాతీయ శిక్షణ శిబిరానికి ఇంతకుముందులానే హాజరవుతున్నాను. చివరగా ఒక మాట చెప్పాలనుకుంటున్నా! కరోనాను కోరి తెచ్చుకోవాలని ఎవరూ అనుకోరు. కాంటాక్ట్‌ లేకపోయినా గాలిలో కూడా వైరస్‌ వ్యాపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోండి. దయచేసి కరోనా బారిన పడ్డవారిని భయాందోళనలకు గురి చేయకండి. వారు దానితో పోరాడేలా ధైర్యం చెప్పండి. మెరుగైన వైద్యం అందించేందుకు సహాయపడండి. వారిని అంటరానివాళ్ళలా చూడకండి.

                                                    - సంజయ్‌ శంకా


కరోనా కారణంగా ఒలింపిక్స్‌ వాయిదా పడడం బాధగా ఉంది. అయితే ఒక్క బ్యాడ్మింటనే కాకుండా కరోనా కారణంగా అన్ని క్రీడలూ దెబ్బతిన్నాయి. బాక్సింగ్‌, కబడ్డీ లాంటి బాడీ కాంటాక్ట్‌ గేమ్స్‌తో పోలిస్తే బ్యాడ్మింటన్‌ పరిస్థితి కొంత మెరుగే. పెద్ద కోర్టులో ఇద్దరు లేదా నలుగురు మధ్య జరిగే ఆట కాబట్టి భౌతికదూరం పాటించడం పెద్ద కష్టమేమీ కాదు. సరైన జాగ్రత్తలు తీసుకుంటే కరోనా వ్యాప్తి చెందే అవకాశాలు తక్కువే. అభిమానులు లేకుండా పోటీలు నిర్వహించవచ్చు. ఐపీఎల్‌ ప్రారంభమవడం కూడా ఓ మంచి శకునం. ఎందుకంటే డిసెంబరులో జరిగే ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌కు ఐపీఎల్‌ నిర్వహణ ఊపిరి పోసింది. పీబీఎల్‌ కంటే ముందు వచ్చే అక్టోబరులో ఉబెర్‌ కప్‌ జరగబోతోంది. కాబట్టి అంతర్జాతీయ పోటీలను అభిమానులు త్వరలో వీక్షించవచ్చు.


మానసిక స్థైర్యాన్ని ఇచ్చాం!

‘‘సిక్కీకి ‘కొవిడ్‌- 19’ పాజిటివ్‌ అనగానే అందరం మొదట్లో కంగారుపడ్డాం. వెంటనే తేరుకున్నాం. ముందుగా ఆమెకు ధైర్యం చెప్పాం. ఆమె ఒక గదిలో ఉంటే... మేమంతా హాల్‌లో ఉంటూ గట్టిగా మాట్లాడేవాళ్ళం. ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూ ఆమెకు ఒంటరిననే ఫీలింగ్‌ రాకుండా చూశాం. ఆట గురించీ, ఇతర విషయాల గురించీ చర్చించేవాళ్ళం. నేను కూడా క్రీడాకారుడినే. కాబట్టి ఇలాంటి సమయంలో ప్లేయర్స్‌ మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసు. అందుకు అనుగుణంగానే ఆమెతో వ్యవహరిస్తూ, ఆమెకు ఆత్మస్థైర్యం కలిగించాం. అన్ని విధాలా తోడ్పాటు అందించాం. 

- సుమీత్‌ రెడ్డి

(సిక్కిరెడ్డి భర్త, బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌)

Updated Date - 2020-09-07T05:54:53+05:30 IST